అనుమతి లేకుండా విద్యుత్ లైన్లు
ABN , Publish Date - Jun 15 , 2026 | 12:27 AM
మండలంలో తమ అనుమతి తీసుకోకుండానే పవర్‌గ్రిడ్ విద్యుత్ టవర్లు, లైన్లు ఏర్పాటు చేయడంపై రైతులు ఆందోళన చెందుతున్నారు. ఆదివారం మండల కేంద్రం సమీపంలోని కొలిమిగుండ్ల, ఇటిక్యాల పొలాల్లో మార్కింగ్ ఇస్తున్న సిబ్బందితో రైతులు వాగ్వావాదానికి దిగారు.
కొలిమిగుండ్ల, జూన్ 14 (ఆంధ్రజ్యోతి): మండలంలో తమ అనుమతి తీసుకోకుండానే పవర్‌గ్రిడ్ విద్యుత్ టవర్లు, లైన్లు ఏర్పాటు చేయడంపై రైతులు ఆందోళన చెందుతున్నారు. ఆదివారం మండల కేంద్రం సమీపంలోని కొలిమిగుండ్ల, ఇటిక్యాల పొలాల్లో మార్కింగ్ ఇస్తున్న సిబ్బందితో రైతులు వాగ్వావాదానికి దిగారు. రైతు సంఘం జిల్లా ఉపాఽడ్యక్షుడు పుల్లయ్య ఆఽధ్వర్యంలో రైతులు పోరెడ్డి ఈశ్వర్ రెడ్డి, శేషన్న, సుధాకర్, మద్దిలేటి రెడ్డి, తదితరులు తమ అనుమతి లేకుండా టవర్లు ఏర్పాటు చేయకూడదని అడ్డుకున్నారు. అవుకు మండలం మారేమడుగుల గ్రామం నుంచి నందిపాడు పవర్‌గ్రిడ్‌కు 220 కేవీ విద్యుత్ లైన్ టవర్లు, లైన్ల ఏర్పాటుకు కాంట్రాక్లర్లు మార్కింగ్ వేస్తున్నారు. గ్రామసభలు నిర్వహించకుండా రైతులకు సమాచారం లేకుండా టవర్ల ఏర్పాటు తగదని అన్నదాతలు ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికే నందిపాడు, తిమ్మనాయునిపేట, అబ్దులాపురం, తోళ్లమడుగు, మదనంతపురం, చింతలాయపల్లె గ్రామాల్లో విద్యుత్ టవర్ల ఏర్పాటు వివాదాస్పదంగా మారింది.