Share News

ఎన్నికలు ప్రశాంతంగా జరగాలి

ABN , Publish Date - Oct 26 , 2026 | 11:33 PM

స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణను అత్యంత పకడ్బందీగా, ప్రశాంత వాతావరణంలో పూర్తి చేసేందుకు కావాల్సిన అన్ని ముందస్తు ఏర్పాట్లను వేగవంతం చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ డాక్టర్‌ ఏ.సిరి అధికారులను ఆదేశించారు.

ఎన్నికలు ప్రశాంతంగా జరగాలి
కౌంటింగ్‌ కేంద్రాన్ని పరిశీలిస్తున్న కలెక్టర్‌, ఎస్పీ

కలెక్టర్‌ ఎ. సిరి

పత్తికొండ/ఆదోని/ ఆలూరు, అక్టోబరు 26 (ఆంధ్రజ్యోతి): స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణను అత్యంత పకడ్బందీగా, ప్రశాంత వాతావరణంలో పూర్తి చేసేందుకు కావాల్సిన అన్ని ముందస్తు ఏర్పాట్లను వేగవంతం చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ డాక్టర్‌ ఏ.సిరి అధికారులను ఆదేశించారు. సోమవారం ఆమె ఆదోని, పత్తికొండ, ఆలూరులోని స్ట్రాంగ్‌ రూమ్‌, కౌంటింగ్‌ కేంద్రాలు, రిసెప్షన్‌ సెంటర్లను పరిశీలించారు. కలెక్టర్‌తో పాటు ఎస్పీ విక్రాంత్‌ పాటిల్‌, జాయింట్‌ కలెక్టర్‌ నూరుల్‌ ఖమర్‌ ఉన్నారు. ఆదోని మండలంలోని విరూపాపురంలో ఉన్న ప్రభుత్వ పాలిటెక్నికల్‌ కళాశాల, పత్తికొండలో డిగ్రీ కళాశాల, ఆలూరులో జూనియర్‌ కళాశాలలో కొనసాగుతున్న ఎన్నికల ఏర్పాట్ల ప్రక్రియను వారు పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ పోలింగ్‌ సిబ్బందికి అవసరమైన సామగ్రి పంపిణీ, పోలింగ్‌ అనంతర డిపాజిట్‌ ప్రక్రియ సజావుగా సాగేలా ఏర్పాట్లు చేయాలన్నారు. ఓట్ల లెక్కింపు రోజున కౌంటింగ్‌ ఏజెంట్లు, సిబ్బందికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగిన వెలుతురు, ఫ్యాన్‌లు, మంచినీటి వసతి కల్పించాలని ఆదేశించారు. అనంతరం జిల్లా ఎస్పీ విక్రాంత్‌ పాటిల్‌ మాట్లాడుతూ ఎన్నికల కమిషన్‌ నిబంధనల ప్రకారం కౌంటింగ్‌ కేంద్రం వద్దకు అనధికారిక వ్యక్తులు ఎవరూ రాకుండా కట్టుదిట్టమైన సెక్యూరిటీ చర్యలు చేపడతామన్నారు. వీరి వెంట ఆర్డీఓ ఓబులేసు, డీఎస్పీ వంశీధర్‌, ఎన్నికల అధికారులు ఉన్నారు.

Updated Date - Oct 26 , 2026 | 11:33 PM