Share News

ఎన్నికల ఫారాలు సిద్ధం

ABN , Publish Date - Oct 08 , 2026 | 11:52 PM

జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఫారాలను మండలాల వారీగా జిల్లా పరిషత్‌ డీపీఆర్‌సీ భవనంలో ఉద్యోగులు, సిబ్బంది విభజిస్తున్నారు.

ఎన్నికల ఫారాలు సిద్ధం
ఎన్నికల ఫారాలను మండలాల వారీగా విభిస్తున్న ఉద్యోగులు, సిబ్బంది

కర్నూలు న్యూసిటీ, అక్టోబరు 8(ఆంధ్రజ్యోతి): జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఫారాలను మండలాల వారీగా జిల్లా పరిషత్‌ డీపీఆర్‌సీ భవనంలో ఉద్యోగులు, సిబ్బంది విభజిస్తున్నారు. ఏ క్షణంలోనైనా నోటిఫికేషన్‌ జారీ అయ్యే అవకాశం ఉండటంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు జడ్పీ పరిపాలన అధికారి బాబు భాస్కర్‌ పర్యవేక్షణలో గురువారం డీపీఆర్‌సీ భవనంలో ఉద్యోగులు, సిబ్బంది జిల్లాలోని 26 మండలాలకు సంబంధించిన ఫారాలను విభజించారు. నామినేషన్‌ పత్రాలు, రిటర్నింగ్‌ అధికారుల ప్రొసీడింగ్స్‌ కాపీలు తదితర వాటిని ఏ మండలాలనికి ఎన్ని కేటాయించాలో విభజన పనిలో నిమగ్నమయ్యారు. ఇప్పటికే ఉమ్మడి జిల్లాకు సంబంధించి బ్యాలెట్‌ పేపర్లను డీపీఆర్‌సీ భవనంలో భద్రపరిచారు. కర్నూలు జిల్లాకు 19.9, నంద్యాల జిల్లాకు 19 మెట్రిక్‌ టన్నుల బ్యాలెట్‌ పేపర్‌ వచ్చింది. కర్నూలు జిల్లాలో ఎన్నికల నిర్వహణకు అవసరమైన బ్యాలెట్‌ పెద్దవి 1595, మీడియం 14, చిన్నవి 220 ఉన్నాయి. నంద్యాల జిల్లాకు పెద్ద బ్యాలెట్‌ బాక్సులు 154, మీడియం, 112, చిన్నవి 139 ఉన్నాయి. ఇప్పటికే ఈ ఎన్నికలకు సంబంధించి పోలింగ్‌ కేంద్రాలను గుర్తించారు. అలాగే ఓటరు జాబితాలను ప్రత్యేకించి బీసీ, ఎస్సీ, ఎస్టీ ఓటరు జాబితాలను రూపొందించి ఆయా మండల అభివృద్ధి అధికారి కార్యాలయాల్లో ప్రచురించారు. కర్నూలు జిల్లాలో 26 జడ్పీటీసీ, 432 ఎంపీటీసీలు, నంద్యాల జిల్లాలో 28 జడ్పీటీసీ, 377 ఎంపిటీసీ స్థానాలు ఉన్నాయి. అలాగే కర్నూలు జిల్లాలో 1432, నంద్యాల జిల్లాలో 1238 పోలింగ్‌ కేంద్రాలను గుర్తించారు. కర్నూలు జిల్లా పరిధిలో గ్రామీణ ఓటర్లు మొత్తం 12,50,166 కాగా ఇందులో పురుషులు 6,21,167, మహిళలు 6,28,834 ఇతరులు 165 మంది ఉన్నారు. అదే విధంగా నంద్యాల జిల్లాలో గ్రామీణ ఓటర్లు మొత్తం 10,84,704, పురుషులు 5,33,160, మహిళలు 5,51,419, ఇతరులు 125 ఉన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్‌ అసిస్టెంట్‌ సిద్ధారెడ్డి, తిరుమలేశ్వరరెడ్డి, సి. రాముడు, కిషోర్‌, మాధవి, సాజిదా, షాహిదా, చిన్న హుస్సేన్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Oct 08 , 2026 | 11:52 PM