పకడ్బందీగా ఏర్పాట్లు
ABN , Publish Date - Oct 28 , 2026 | 11:17 PM
కర్నూలు నగరపాలక సంస్థ ఎన్నికలను ప్రశాంతంగా, పారదర్శకంగా సమర్థవంతంగా నిర్వహించేందుకు అధికారులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు.
పురపోరుకు సర్వం సిద్ధం
కర్నూలులో 67వార్డులు, 4,72,765 మంది ఓటర్లు
మొత్తం 487 పోలింగ్ కేంద్రాలు
సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై ప్రత్యేక దృష్టి
ఎన్నికల నిర్వహణకు భారీగా సిబ్బంది
కర్నూలు న్యూసిటీ, అక్టోబరు 28 (ఆంధ్రజ్యోతి): కర్నూలు నగరపాలక సంస్థ ఎన్నికలను ప్రశాంతంగా, పారదర్శకంగా సమర్థవంతంగా నిర్వహించేందుకు అధికారులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పోలింగ్ సిబ్బందికి అవసరమైన సదుపాయాలు కల్పిస్తూ, ఎన్నికల సామగ్రి పంపిణీ నుంచి ఓట్ల లెక్కింపు వరకు ప్రతి దశను పకడ్బందీగా నిర్వహించేందుకు చర్యలు చేపట్టారు. అడిషనల్ ఎలక్షన్ అథారిటీ, కమిషనర్ చల్లా ఓబులేసు ముందస్తు ప్రణాళికతో వివిధ విభాగాలను సమన్వయం చేస్తూ ఏర్పా ట్లను వేగవంతం చేస్తున్నారు. నగరపాలక సంస్థ పరిధిలో 68 వార్డుల్లో మొత్తం 4,79,861 ఓటర్లు ఉన్నారు. ఇందులో పురుషులు 2,32,508, మహిళలు 2,47,295, ఇతరులు 58 ఉన్నారు. ఈ క్రమంలో నగరపాలక పరిధిని కోడుమూరు నియోజకవర్గంలోని నాలుగు వార్డుల్లో ఒక్క వార్డు అంటే 53వ వార్డు ఏకగ్రీవంగా కురువ చంద్రశేఖర్ ఎన్నికయ్యారు. ఆ వార్డులో ఎన్నికలు జరగవు. ఈ క్రమంలో 67 వార్డుల్లో మొత్తం 4,72,765 ఉండగా పురుషులు 2,28,985, మహిళలు 2,43,723, ఇతరులు 57 మంది ఉన్నారు. దీని కోసం 487 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఎన్నికల నిర్వహణలో ఇబ్బందులు తలెత్తకుండా ప్రతి అంశాన్ని ముందుగానే పరిశీలించి అవసరమైన ఏర్పాట్లు చేయాలన్న కమిషనర్ ఆదేశాల మేరకు అధికారులు క్షేత్రస్థాయిలో చర్యలు తీసుకుంటున్నారు.
పోలింగ్ కేంద్రాల భద్రతకు ప్రత్యేక చర్యలు
పోలింగ్ కేంద్రాల భద్రతకు ప్రత్యేక ప్రాధాన్యమిస్తూ సమస్యాత్మక ప్రాంతాలపై దృష్టి సారించారు. అందుబాటులో ఉన్న ఎన్నికల వివరాల ప్రకారం 153 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు 39 ప్రాంతాల్లో, 153 అత్యంత సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు 28 ప్రాంతాల్లో ఉన్నట్లు అధికారులు గుర్తించారు. 181 సాధారణ పోలింగ్ కేంద్రాలు 63 ప్రాంతాల్లో ఉన్నట్లు నిర్ధారించారు. ఈ కేంద్రాల్లో ఎన్నికలు సజావుగా జరిగేలా భద్రతా చర్యలు పర్యవేక్షణ బలోపేతం చేస్తున్నారు.
ప్రత్యేక బృందాలు
ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలును పర్యవేక్షించేందుకు మూడు బృందాలు, ఫ్లయింగ్ స్క్వాడ్‌లను ఆరు, స్టాటిక్ సర్వేలైన్స్ బృందాలు ఆరు ఏర్పాటు చేశారు. సమస్యాత్మక ప్రాంతాలపై నిరంతర నిఘా ఉంచడం ద్వారా ఎన్నికల ప్రక్రియలో శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా చూడాలని కమిషనర్ సంబంధిత అధికారులకు సూచించారు.
ఆర్వో, ఏఆర్వోలు..
ఎన్నికల నిర్వహణకు 23 మంది రిటర్నింగ్ ఆఫీసర్లు(ఆర్వో), 45 మంది సహాయ రిటర్నింగ్ అధికారులు(ఏఆర్వో), 22 మంది జోనల్/సెక్టోరల్ అధికారులు, 68 మంది రూట్ అధికారులు విధులు నిర్వహిస్తున్నారు. పోలింగ్ ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించేందుకు 600 మంది ప్రిసైడింగ్ అధికారులు, 600 మంది అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులు, 2400 మంది ఇతర పోలింగ్ సిబ్బందిని కేటాయించారు. ఈ సంఖ్యలో 20శాతం అదనపు సిబ్బంది కూడా ఉన్నారు. ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బందికి శిక్షణ అందించి, బాధ్యతలపై స్పష్టమైన అవగాహన కల్పించారు.
అథేనా పాఠశాలలో స్ట్రాంగ్‌రూమ్
కర్నూలులోని అథేనా పాఠశాల ప్రాంగణంలో ఎన్నికల సామగ్రి పంపిణీ, స్వీకరణ కేంద్రం, స్ట్రాంగ్‌రూమ్‌లు, కౌంటింగ్ కేంద్రానికి సంబంధించిన ఏర్పాట్లుచేశారు. సిబ్బందికి ఇబ్బందులు కలగకుండా సదుపాయాలు కల్పించారు. వాహనాల రాక పోకలకు సులభంగా సాగేలా ఏర్పాటుచేస్తున్నారు. ఈపనులను కమిషనర్ చల్లా ఓబులేసు పరిశీలిస్తూ పెండింగ్‌లో ఉన్న పనులను త్వరగా పూర్తి చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేస్తున్నారు.
సీసీ కెమెరాలతో నిఘా..
ఓట్ల పెట్టెల భద్రత, స్ట్రాంగ్‌రూమ్‌లు పర్యవేక్షణకు ప్రాధాన్యత ఇస్తున్నారు. భదత్రా ఏర్పాట్లతో పాటు సీసీ కెమెరాల నిఘా, అవసరమైన సిబ్బంది నియామకం అంశాలను సమన్వయం చేస్తున్నారు. ఎన్నికల సామగ్రి సురక్షితంగా తరలించడం, స్వీకరణ కేంద్రంలో క్రమంగా నమోదు చేయడం, బ్యాలెట్ బాక్సులు భద్రపరచడం వంటి ప్రతి దశలో అప్రమత్తంగా వ్యవహరించాలని కమిషనర్ అధికారులకు సూచిస్తున్నారు.
ఓట్ల లెక్కింపునకు ప్రత్యేక ఏర్పాట్లు
ఓట్ల లెక్కింపు ప్రక్రియ సజావుగా సాగేందుకు వార్డు సభ్యుల ఎన్నికకు 67, మేయర్ ఎన్నికకు 67 కౌంటింగ్ టేబుళ్లను ఏర్పాటు చేస్తున్నారు. కౌంటింగ్ విధుల్లో 163 మంది కౌంటింగ్ సూపర్‌వైజర్లు, 653 మంది మైక్రో అబ్జర్వర్లు పాల్గొంటారు. వీరితో పాటు ఎన్నికల విధులపై శిక్షణ అందించేందుకు 27మంది మాస్టర్ ట్రైనర్స్, శిక్షకులు అందుబాటులో ఉన్నారు.
నిబద్ధతతో విధులు నిర్వహించాలి
ఎన్నికల ప్రక్రియలో ప్రతి అధికారి, సిబ్బంది తమకు అప్పగించిన బాధ్యతలను నిబద్ధతతో నిర్వర్తించాలి. పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లకు అవసరమైన సౌకర్యాలు కల్పించాలని, సమస్యాత్మక కేంద్రాల వద్ద అప్రమత్తంగా ఉండాలి. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని కచ్చితంగా అమలు చేయాలి. ఎన్నికల ఏర్పాట్లలో అధికారులు సమన్వయం చేసుకుని పని చేయాలి. ఓటర్లు స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకునేలా అవసరమైన వాతావరణాన్ని నగరపాలక సంస్థ అందిస్తోంది.
చల్లా ఓబులేసు, అడిషనల్ ఎలక్షన్ అథారిటీ, కార్పొరేషన్ కమిషనర్, కర్నూలు