ఎన్నికలకు పకడ్బందీగా ఏర్పాట్లు
ABN , Publish Date - Oct 29 , 2026 | 10:55 PM
ఎన్నికలకు పకడ్బందీగా ఏర్పాట్లు
అధికారులంతా సమన్వయంతో పని చేయాలి
పోలింగ్ కేంద్రాలను అన్ని ఏర్పాట్లతో సిద్ధం చేయాలి
కలెక్టర్ రాజకుమారి
డోన్ టౌన్, అక్టోబరు 29 (ఆంధ్రజ్యోతి): నవంబరు 1వ తేదీన జరగనున్న మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేస్తున్నట్లు కలెక్టర్ రాజకుమారి తెలిపారు. డోన్ పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో ఏర్పాటు చేసిన రిసెప్షన్ డిస్ర్టిబ్యూషన్, స్ర్టాంగ్ రూమ్, కౌంటింగ్ కేంద్రాలను కలెక్టర్ పరిశీలించారు. కౌంటింగ్ సెంటర్లు, స్ర్టాంగ్ రూమ్‌ల వద్ద బారికేడింగ్ పక్కాగా చేపట్టాలని ఎలాంటి ఇబ్బందులు రాకుండా పటిష్టమైన భద్రత చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఓటర్లకు విద్యుత్, మంచినీరు తదితర కనీస సౌకర్యాలకు ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. ఎన్నికల అధికారులకు, సిబ్బందికి రాకపోకలు, పోలింగ్ సామాగ్రి తరలింపునకు, వాహనాల రాకపోకలు, పార్కింగ్‌కు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు సమన్వయంతో చేపట్టాలని ఎన్నికల అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో కేపీ నరసింహులు, ఎన్నికల అథారిటీ అధికారి, మున్సిపల్ కమిషనర్ కే. నరేష్ రెడ్డి, ఆర్‌అండ్‌బీ ఈఈ శ్రీధర్ రెడ్డి, మున్సిపల్ డీఈ రఘు, ఏఈ సురేష్ పాల్గొన్నారు.
కౌంటింగ్ కేంద్రం తనిఖీ
బేతంచెర్ల, అక్టోబరు 29, (ఆంధ్రజ్యోతి) : కర్నూలు రహదారిలో ఉన్న ఎంజేపీ పాఠశాలలో ఏర్పాటు చేసిన బేతంచెర్ల నగర పంచాయతీ ఎన్నికల కౌంటింగ్ కేంద్రాన్ని కలెక్టర్ రాజకుమారి, ఎస్పీ సునీల్ షెరాన్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ రాజకుమారి మాట్లాడుతూ బేతంచెర్ల నగర పంచాయతీ స్థానిక సంస్ధల ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియను పారదర్శకంగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు తగు చర్యలు తీసుకోవాలని అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి హరి ప్రసాద్‌కు సూచించారు. వారి వెంట డోన్ ఆర్‌డీవో నరసింహులు, డీఎస్పీ శ్రీనివాస్, బేతంచెర్ల తహసీల్దార్ నాగమణి, సీఐ వెంకటేశ్వరరావు ఉన్నారు.