Share News

రైతులపై ఎల్‌నినో దెబ్బ

ABN , Publish Date - Jul 27 , 2026 | 12:11 AM

kln news

  రైతులపై ఎల్‌నినో దెబ్బ

వర్షాలు లేక ఎండిపోతున్న పంటలు

చేసేదేమీ లేక తొలగిస్తున్న రైతులు

మిడుతూరు, జులై 26 (ఆంధ్రజ్యోతి) : మిడుతూరు గ్రామానికి చెందిన రైతు ఖలీల్‌ ఖరీఫ్‌లో ఎంతో ఆశతో రెండున్నర ఎకరాల్లో కొర్ర పంట వేశాడు. ఎల్‌నిలో ప్రభావంతో వరణుడు ముఖం చాటేశాడు. సకాలంలో వర్షం కురుస్తుందని పెట్టుకున్న గంపెడాశ అడియాశ అయ్యింది. పంట ఎదుగుదల నిలిచిపోయింది. కళ్లముందే ఎండి పోయింది. చేసేదేమీ లేక ఆదివారం రైతు ట్రాక్టర్‌తో పంటను తొలగించేశాడు. దీంతో సుమారు రూ.40 వేల వరకు నష్టం వాటిల్లిందని ఆవేదన వ్యక్తం చేశాడు.

మొక్కజొన్న పైరు గొర్రెలపాలు

జూపాడుబంగ్లా : జూపాడుబంగ్లా గ్రామానికి చెందిన కౌలురైతు రామక్రిష్ణ నెల క్రితమే ఎకరాకు రూ.20 వేల చొప్పున కౌలు చెల్లించి 4 ఎకరాలు భూమి తీసుకున్నాడు. ఆ పొలంలో మొక్కజొన్న పంట సాగు చేశాడు. వర్షాలు లేక తన రెండు బోర్లలో భూగర్భ జలం పడిపోయింది. దీంతో సాగునీరు లేక పంట ఎండిపోవడంతో చేసేదేమీ లేక గొర్రెలకు మేతగా వదిలేశారు. పెట్టుబడి, సేద్యం, విత్తనాలు, కూలీల ఖర్చు, ఎరువులు అన్నీ కలిసి రూ.లక్ష నష్టం వచ్చిందని విలపించాడు.

బండిఆత్మకూరు : మండలంలోని పెద్దదేవళాపురం గ్రామంలో రైతులు మొక్కజొన్న పంటను సాగు చేశారు. సకాలంలో వానలు కురువకపోవటంతో అడపాదడపా మొలచిన మొక్కలు సైతం వాడిపోవటంతో పశువులకు వదిలేశారు. పెట్టిన పెట్టుబడి, చేసిన కష్టం వృథా అయ్యిందని రైతులు లబోదిబోమంటున్నారు. ఈ ఏడాది వానలు లేక రైతుల దుస్థితి అంతా ఇంతా కాదు.ల

Updated Date - Jul 27 , 2026 | 12:11 AM