తుంగభద్రపై ‘ఎల్‌నినో’
ABN , Publish Date - Jul 03 , 2026 | 11:34 PM
తుంగభద్రపై ‘ఎల్‌నినో’
రైతులు తొందరపడి వరి సాగు చేయవద్దు
జూలై ఆరంభమైనా టీబీపీ డ్యాంకు చేరని వరద
తుంగ, భద్ర జలాశయాల్లో ప్రవాహాలు లేవు
సాగు నీరు ఇవ్వలేమని తేల్చేసిన కర్ణాటక ఇంజనీర్లు
జిల్లాలో టీబీపీ ఎల్లెల్సీ నీటిపై ఆయకట్టు రైతుల ఆశలు
తుంగభద్రకు గడ్డుకాలం వచ్చింది. జూలై మాసం ఆరంభమైనా ఎల్‌నినో ప్రభావం కారణంగా నీటి జాడ లేదు. తుంగభద్ర డ్యాం ఎగు వన ఉన్న తుంగ, భద్ర ప్రాజెక్టులకు వరద ప్రవాహాలు లేవు. ఆ జలాశ యాలు నిండితేనే తుంగభద్రకు నీరు విడుదల చేస్తారు. పరిస్థితి అనుకూలంగా లేకపోవడంతో ఆయకట్టుకు సాగునీరు ఇవ్వలేని పరిస్థితి ఉంది. తొందరపడి వరి నాట్లు వేయవద్దని రైతులకు అధికారులు సూచించారు. ఈ ఏడాది తాగు నీరు ఇవ్వడానికి ఎన్నో ఇబ్బందులు పడాల్సి వస్తుందని, సాగునీరు ఇవ్వలేమని కర్ణాటక ఇంజనీర్లు తేల్చేశారు. జిల్లాలో తుంగభద్ర దిగువ కాలువ (టీబీపీ ఎల్లెల్సీ) ఆయకట్టు రైతులు కాలువకు సాగునీరు విడుదల చేయగానే వరి నాట్లుకు సిద్ధం అవుతున్నారు. అందుకు అనుగుణంగా బోరుబావుల వద్ద వరినార్లు పెంచుతు న్నారు. శుక్రవారం వరకు డ్యాంలోకి నీటి అడుగులే పడలేదు. ఎల్లెల్సీకి సాగు నీటి విడుదల ప్రశ్నార్థకంగా ఉంది. నీళ్లు వస్తాయనే నమ్మకంతో తొం దరపడి వరి నాట్లు వేసి నష్టపోవద్దని సాగునీటి నిపుణులు సూచిస్తున్నారు. జిల్లాలో ఖరీఫ్ ఆయకట్టు 43,519 ఎకరాలు ఉంది.
కర్నూలు, జూలై 3 (ఆంధ్రజ్యోతి):
జిల్లాలో ఆలూరు, ఆదోని, ఎమ్మిగనూరు, మంత్రాలయం, కోడుమూరు నియోజకవర్గాల్లో తుంగభద్ర దిగువ కాలువ (టీబీపీ ఎల్లెల్సీ) ప్రవహిస్తుంది. తుంగభద్ర జలాశయం నుంచి కేడబ్ల్యూడీటీ-1 అవార్డు ప్రకారం 24 టీఎంసీలు నిఖర జలాలు వాటా ఉంది. ఖరీఫ్‌లో 43,519 ఎకరాలు, రబీలో 1,07,615 ఎకరాలు కలిపి 1,51,134 ఎకరాలకు సాగునీరు ఇవ్వాల్సి ఉంది. ఆదోని, ఎమ్మిగనూరు మున్సిపాలిటీ పట్టణాలు సహా 194 గ్రామాలకు ప్రధాన తాగునీటి ఆధారం ఈ కాలువనే. గత ఏడాది ఇదే సమయానికి తుంగభద్ర ప్రాజెక్టు ఎగువన ఉన్న తుంగ, భద్ర ప్రాజెక్టులు పూర్తిగా నిండడంతో గేట్లెత్తారు. అదే క్రమంలో తుంగభద్ర డ్యాంలో కూడా 77.144 టీఎంసీలు వరద చేయడమే కాకుండా 32,767 క్యూసెక్కులు వరద కొనసాగుతుండడతో టీబీపీ బోర్డు ఇంజనీర్లు క్రస్ట్ గేట్లు ఎత్తి దిగువన శ్రీశైలం జలాశయానికి నీరు విడుదల చేశారు. ప్రస్తుత పరిస్థితులు పూర్తిగా భిన్నంగా ఉన్నాయి. ఖరీఫ్ సీజన్ ప్రారంభమై దాదాపు నెల రోజులు కావస్తున్నా.. జల సవ్వడులు లేవు. డ్యాంలో చుక్క వరద చేరడం లేదు. కర్ణాటక రాష్ట్రంలో తుంగ, భద్ర నదులు జన్మస్థానమైన పశ్చిమ కనుమల్లో అత్యల్ప వర్షపాతం నమోదు అవుతుంది. ఈ రెండు నదులకు వరద ప్రవాహమే ప్రారంభం కాలేదు. వానొచ్చి వరదొచ్చినా శిమమొగ్గ జిల్లాలోని తుంగ డ్యాం సామర్థ్యం 3.2 టీఎంసీలు, భద్ర జలాశయం సామర్థ్యం 71.5 టీఎంసీలు నిండి, వరద ఉంటేనే గేట్లు ఎత్తి దిగువున ఉన్న తుంగభద్ర డ్యాంకు నీరు వదులుతారు. ఎన్‌నినో ప్రభావం వల్ల ప్రస్తుత పరిస్థితి ఆశాజనకంగా లేకపోవడంతో తుంగభద్ర కాలువల ద్వారా సాగునీరు ఇవ్వలేమని కర్ణాటక ఇంజనీర్లు తేల్చిచెప్పారు.
వెలవెలబోతున్న తుంగభద్ర జలాశయం
రాయలసీమ జిల్లాలకు జీవనాడి అయిన తుంగభద్ర జలాశయం గరిష్ఠ నీటి మట్టం 1633 అడుగులు, సామర్థ్యం 105.788 టీఎంసీలు. గత ఏడాది ఇదే సమయానికి 1625.53 అడుగుల లెవల్‌లో 78.24 టీఎంసీలు నీటి నిల్వ చేరడమే కాకుండా 32,767 క్యూసెక్కులు వరద కొనసాగు తుండడంతో డ్యాం క్రస్ట్‌గేట్లు ఎత్తి దిగువకు నీరు విడుదల చేశారు. ఎల్లెల్సీ కాలువకు కూడా సాగునీరు విడుదల చేయడంతో ఆలూరు, ఆదోని, ఎమ్మిగనూరు ప్రాంతంలో వరినాట్లు వేశారు. ఈ ఏడాది పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉంది. శుక్రవారం డ్యాం నీటి లెక్కలు తీసే సమయానికి 1587 అడుగుల లెవల్‌లో కేవలం 9.30 టీఎంసీలు మాత్రమే ఉన్నాయి. తాగునీటి అసరాల కోసం గతేడాది నిల్వ చేసివే. వానొచ్చి డ్యాంలోకి వరద చేరకపోతే సాగునీటి మాటేలా ఉన్నా తాగునీటికి తీవ్ర కష్టాలు తప్పవని ఇంజనీరింగ్ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వాస్తవంగా ఎల్లెల్సీపై ఆధారపడిన ఆదోని, ఎమ్మిగనూరు మున్సిపాలిటీ సహా 194 గ్రామాలకు తాగునీటి కోసం 3 టీఎంసీలు అవసరం ఉందని అంచనా. ప్రస్తుతం డ్యాంలో 9.30 టీఎంసీలు ఉన్నాయి. అందులో రెండు టీఎంసీలు డెడ్ స్టోరేజీ పోను 7 టీఎంసీలు మాత్రమే వినియోగించుకోవడానికి అవకాశం ఉంటుంది. అంటే కేడబ్ల్యూడీటీ-1 అవార్డు నీటి కేటాయింపుల దమాషా ప్రకారం టీబీపీ ఎల్లెల్సీ, కేసీ వాటా ఒక టీఎంసీ కూడా వాటా వచ్చే పరిస్థితి లేదు. ఆ నీటిని తుంగభద్ర డ్యాం నుంచి 250.86 కిలోమీటర్లు ప్రవహించి జిల్లాకు చేరుతాయా..? అన్నది ప్రశ్నార్థకమే. దీంతో తుంగభద్రకు వరదొస్తే తప్ప తాగునీటి ఇబ్బందులు ఉండవు.
రైతులు తొందరపడవద్దు..!
తుంగభద్ర జలాశయం 25 ఏళ్ల వరద లెక్కలు పరిశీలిస్తే ఆరేళ్లు వర్షాభావ పరిస్థితుల వల్ల అత్యల్ప వరద నమోదైంది. 2002-03, 2003-04, 2016-17, 2023-24 నీటి సంవత్సరాల్లో అత్యంత దారుణ పరిస్థితులు ఎదుర్కోవాల్సి వచ్చింది. అంటే.. 20 ఏళ్లు అశాజనకంగానే వరద చేరడంతో కాలువలకు సాగు, తాగునీటిని పుష్కలంగా ఇచ్చారు. అయితే.. ఈ ఏడాది ఎన్‌నినో ప్రభావం తీవ్రత అధికంగా ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీనికి తోడు ఇప్పటి వరకు ఈ రోజుకు డ్యాంలోకి వరద చేరిక మొదలుకాకపోవడంతో ఆందోళన కలిగిస్తోంది. ప్రతి ఏటా జూలై 15లోపు టీబీపీ ఎల్లెల్సీకి నీటిని విడుదల చేస్తూ వచ్చారు. ఈ ఏడాది కూడా కాలువకు నీటిని విడుదల చేస్తారనే ఆశతో హాలహర్వి, హొళగుంద, ఆదోని, కౌతాళం, పెద్దకడుబూరు, ఎమ్మిగనూరు తదితర మండలాల్లో బోరుబావుల కింద వరినారు పెంపకం చేపట్టారు. ఎకరాకు సరిపడ వరినారు పెంచడానికి వరి విత్తనంతో కలిపి దాదాపు రూ.10 వేల వరకు ఖర్చు అవుతుందని రైతులు అంటున్నారు. ఇప్పటికే నారు మొలక చల్లి 10-20 రోజులు అవుతోంది. కాలువకు నీళ్లొస్తాయనే ఆశతో తొందరపడి వరినాట్లు వేయవద్దని నిపుణులు సూచిస్తున్నారు. ఆ తరువాత నీరు విడుదల చేయకపోతే నష్టపోవాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు. డ్యాంలోకి ఆశాజనకంగా వరద చేరి, పంటలక సాగునీరు ఇస్తామని ఐఏబీ సమావేశంలో ప్రజా ప్రతినిధులు, ఇంజనీర్లు తీర్మానం చేశాకే వరినాట్లకు సిద్ధం కావాలని సూచిస్తున్నారు.