గ్రంథాలయాల బలోపేతానికి కృషి
ABN , Publish Date - Jan 30 , 2026 | 11:21 PM
గ్రంథాలయాల బలోపేతానికి కృషి చేస్తానని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ శాలివాహన కార్పొరేషన్ చైౖర్మన్ తుగ్గలి నాగేంద్ర ఉమ్మడి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా అన్నారు.
సంస్థ నూతన చైర్మన్ తుగ్గలి నాగేంద్ర
పత్తికొండ ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు సమక్షంలో ప్రమాణ స్వీకారం
భారీగా తరలి వచ్చిన అభిమానులు
కర్నూలు కల్చరల్, జనవరి 30 (ఆంధ్రజ్యోతి): గ్రంథాలయాల బలోపేతానికి కృషి చేస్తానని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ శాలివాహన కార్పొరేషన్ చైౖర్మన్ తుగ్గలి నాగేంద్ర ఉమ్మడి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా అన్నారు. శుక్రవారం ఆయన ప్రమాణ స్వీకారోత్సవానికి పత్తికొండ ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు, డీసీఎంఎస్ చైర్మన్ వై నాగేశ్వరరావు యాదవ్, శాలివాహన కార్పొరేషన్ డైరెక్టర్లు పీబీవీ సుబ్బయ్య, కె. సుధాకర్, కుమ్మరి శాలివాహన సంఘం జిల్లా అధ్యక్షుడు కేసీ నాగన్న హాజరయ్యారు. ప్రమాణ స్వీకారం సందర్భంగా తుగ్గలి నాగేంద్ర గ్రంథాలయంలోని సరస్వతి మాత విగ్రహానికి పూల దండలు వేసి, జ్యోతి వెలిగించి ప్రార్థనలు చేశారు. తర్వాత గ్రంథాలయ ప్రాంగణంలోని గ్రంథాలయ ఉద్యమ పితామహుడు గాడిచర్ల హరిసర్వోత్తమరావు విగ్రహానికి పూలదండలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో పత్తికొండ, తుగ్గలి ప్రాంతాలకు చెందిన ఆయన అభిమానులు భారీగా తరలివచ్చారు. అనంతరం గ్రంథాలయ సంస్థ కార్యదర్శి కె. ప్రకాశ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సభలో ముఖ్య అతిథిగా హాజరైన పత్తికొండ ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు మాట్లాడుతూ తమ కుంటుంబ మిత్రుడు, టీడీపీ సీనియర్ నేత తుగ్గలి నాగేంద్ర గ్రంథాలయ సంస్థ ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించడం సంతోషంగా ఉందని చెప్పారు. అనంతరం తుగ్గలి నాగేంద్ర మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, రాష్ట్ర మంత్రి నారా లోకేష్ సూచనల మేరకు ఈ పదవి చేపట్టానని తెలిపారు. గ్రంథాలయాల పురోభివృద్ధికి జిల్లాలోని మేధావి వర్గాలు, గ్రంథాలయ ఉద్యోగుల సహాయ సహకారాలు తీసుకుంటానని తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా తుగ్గలి నాగేంద్రను భారీ పూలదండలు, శాలువాలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ కార్యదర్శి నక్కలమిట్ట శ్రీనివాసులు, శాలివాహన సంఘం జిల్లా, నగర నాయకులు కేవీ మధు, జీ. శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.