బీజేపీ హయాంలో విద్యావ్యవస్థ నాశనం
ABN , Publish Date - Jul 23 , 2026 | 12:19 AM
పేపర్ లీకేజీలతో దేశ విద్యా వ్యవస్థను బీజేపీ నాశనం చేస్తోందని ఏఐసీసీ సభ్యుడు, కర్నూలు జిల్లా కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి జెంగిటి లక్ష్మినరసింహ యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఏఐసీసీ సభ్యుడు లక్ష్మినరసింహ యాదవ్
సిల్వర్ జూబ్లీ కళాశాల ఎదుట కాంగ్రెస్ నిరసన
కర్నూలు అర్బన్, జూలై 22(ఆంధ్రజ్యోతి): పేపర్ లీకేజీలతో దేశ విద్యా వ్యవస్థను బీజేపీ నాశనం చేస్తోందని ఏఐసీసీ సభ్యుడు, కర్నూలు జిల్లా కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి జెంగిటి లక్ష్మినరసింహ యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం ఢిల్లీలో విద్యార్థులపై జరిగిన లాఠీ చార్జీని నిరసిస్తూ నగరంలోని సిల్వర్ జూబ్లీ డిగ్రీ కళాశాల వద్ద నాలుగురోడ్ల కూడలిలో యూత్ కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షుడు మహేంద్ర నాయుడు ఆధ్వర్యంలో ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ చిత్ర పటాలను దహనం చేస్తూ నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ వైఫల్యాల కారణంగా వరుసగా జరుగుతున్న పేపర్ లీకేజీలు దేశ విద్యావ్యవస్థను తీవ్ర సంక్షోభంలోకి నెట్టి వేస్తున్నాయన్నారు. దీనికి పూర్తి బాధ్యత వహిస్తూ కేంద్ర మంత్రి, ప్రధానీ మోదీ వెంటనే రాజీనామా చేయాలన్నారు. దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు కష్టపడి చదివి పోటీ పరీక్షలకు సిద్ధం అవుతున్న తరుణంలో వరుస పేపర్ లీకేజ్‌లు వారి భవిష్యత్‌ను అంధకారంలోని పడేశాయన్నారు. పరీక్షల నిర్వహణలో కేంద్ర ప్రభుత్వం విద్యార్థులకు భరోసా కల్పించడంలో వైఫల్యమైందన్నారు. పేపర్ లీక్ ఘటనపై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో విచారణ జరిపి, బాఽధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. మాజీ డీసీసీ ప్రధాన కార్యదర్శి నవీద్, మైనార్టీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రజాక్, మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షులు జాకీర్ హుస్సేన్, ఐఎన్ టీయూసీ రాష్ట్ర కార్యదర్శి సుంకన్న, యూత్ కాంగ్రెస్ నగర ఉపాధ్యక్షుడు హానుక్, నాయకులు వెంకట్, కిషోర్, జగదీష్, అంజి పాల్గొన్నారు.