Share News

చదువులు అక్కడ.. హాజరు ఇక్కడ..!

ABN , Publish Date - May 02 , 2026 | 12:23 AM

ప్రైవేటు పాఠశాలలో చదివింది. కానీ హా జరు మాత్రం ప్రభుత్వ పాఠశాలలో ఉండేది. వింటేనే విడ్డూరంగా ఉన్న ఈఘటన కొలిమిగుండ్ల మండలంలో చోటుచేసుకుంది.

చదువులు అక్కడ.. హాజరు ఇక్కడ..!
వివాదాలకు కారణమైన ఎర్రగుడి పాఠశాల

ప్రైవేటు స్కూల్‌ విద్యార్థినికి ప్రభుత్వ ఉపాధ్యాయులు ఊతం

తోటి విద్యార్థి ఆవేదనతో బయటపడిన వాస్తవం

సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న వీడియో

కొలిమిగుండ్ల, మే 1 (ఆంధ్రజ్యోతి): ఆ విద్యార్థిని ప్రైవేటు పాఠశాలలో చదివింది. కానీ హా జరు మాత్రం ప్రభుత్వ పాఠశాలలో ఉండేది. వింటేనే విడ్డూరంగా ఉన్న ఈఘటన కొలిమిగుండ్ల మండలంలో చోటుచేసుకుంది. ప్రైవేటు స్కూల్‌ విద్యార్థికి ప్రభుత్వ పాఠశా లలో హాజరు పడేలా ఉపాధ్యాయులు సహకారం అందించారు. ప్రస్తుతం ఈ ఘటన చర్చనీయాంశంగా మారింది. మండలంలోని ఎర్రగుడి జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో ఎర్రగుడికి చెందిన పోలు ప్రవల్లిక అనే అమ్మాయి ఇదే స్కూల్‌ నుంచి పదో తరగతిలో 481మార్కులు సాధించి, ప్రథమ స్థానంలో నిలిచినట్లు హెచ్‌ఎం ప్రకటించారు. అదే పాఠశాలలో చదివిన నాగేంద్రనాయక్‌ 465మార్కులు సాధించాడు. ప్రవల్లిక అనే విద్యా ర్థిని ఎర్రగుడి పాఠశా లకు ఏరోజు రాలేదని, అమ్మాయిని పాఠశాల పది విద్యార్థులు ఎప్పూడూ చూడలేదని, తాడిపత్రి ప్రైవేటు పాఠశాలలో చదివిన విద్యార్థికి స్కూల్‌ ప్రథమ స్థానం అని ప్రకటించడం తగదంటూ వీడియోను విడుదల చేయడంతో శుక్రవారం బయటపడింది. ఇది సోషల్‌ మీడియాలో షేర్‌ అవుతూ వైరల్‌గా మారింది. దీనిపై విద్యాశాఖ మంత్రి చర్యలు తీసుకోవాలని విద్యార్థి నాగేంద్రనాయక్‌ ఆ వీడియోలో కోరాడు. ఎర్రగుడి పాఠశాల నుంచి మొత్తం 19మంది విద్యార్థులు పదవతరగతి పరిక్షలు రాసినట్లు అధికారులు నమోదు చేశారు. అయితే ఎక్కడో ప్రైవేటు పాఠశాలలో విద్యనభ్యసిస్తున్న విద్యార్థినికి ఎర్రగుడి జడ్పీహెచ్‌ఎ్‌సలో పేరు నమోదు చేసుకొని హాజరు వేయడం తీవ్ర వివాదస్పదంగా మారింది. దీనిపై సమగ్ర విచారణ జరిపి గట్టి చర్యలు తేసుకోవాలన్న చర్చ సర్వత్రా వినిపిస్తోంది.

పొంతనలేని సమాధానాలు

సోషల్‌ మీడియాలో వచ్చిన వీడియోపై ఆరా తీశాం. ఆరోగ్యం బాగాలేక విద్యార్థిని పాఠశాలకు రాలేదని, పరీక్షలు రాసిందని హెచ్‌ఎం పొంతనలేని సమాధానాలు చెబు తున్నారు. ఉన్నతాధికారుల ఆదేశాలమేరకు విచారణ చేపట్టి, బాధ్యులపై అధికారులు చర్యలు తీసుకుంటారు. - అబ్దుల్‌ కలాం, ఎంఈవో, కొలిమిగుండ్ల

Updated Date - May 02 , 2026 | 12:23 AM