రీసర్వేకు గ్రహణం
ABN , Publish Date - May 19 , 2026 | 11:31 PM
జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో రీసర్వేకు గ్రహణం పట్టింది. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూరీసర్వే పనులు గ్రామీణ ప్రాంతాల్లో వేగంగా సాగాల్సి ఉంది.
ఎస్సీ వర్గీకరణ జీవోకు పాతర
వివాదాస్పదంగా పోస్టింగ్‌లు, పదోన్నతుల వ్యవహారం
ఇబ్బందులు పడుతున్న రైతులు
కర్నూలు కలెక్టరేట్, మే 19 (ఆంధ్రజ్యోతి): జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో రీసర్వేకు గ్రహణం పట్టింది. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూరీసర్వే పనులు గ్రామీణ ప్రాంతాల్లో వేగంగా సాగాల్సి ఉంది. గ్రామాల్లో వీఆర్వోలు లేక ఇన్‌చార్జిలతో పనులు నడిపిస్తుండటంతో క్షేత్రస్థాయిలో సిబ్బంది, రైతులు ఇక్కట్లు పడుతు న్నారు. కొన్ని మండలాల్లో ఒక్కొక్క వీఆర్వోకు మూడు లేదా నాలుగు గ్రామాలకు అదనపు బాధ్యతలు కేటాయించారు. వీఆర్వోలు రైతుల భూములను తప్పులు తడకగా వెబ్‌ల్యాండ్‌లో నమోదు చేస్తున్నారు. సీసీఎల్‌ఏ నిబంధనలకు విరుద్ధంగా 11మంది గ్రేడ్-1 వీఆర్వోలు అనధికారికంగా విధులు నిర్వహిస్తున్నారు. కలెక్టరేట్‌లోని ఏ-సెక్షన్ కు చెందిన ఒకే ఒక్క ఉద్యోగి చక్రం తిప్పినట్లు రెవెన్యూ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది. ఉన్నతాధికారుల అండదండలతో సదరు వ్యక్తి నిబంధనలకు విరుద్ధంగా వ్యవహ రిస్తూ, ఫైళ్లను తన కిష్టమైన రీతిలో తిప్పు తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.
మ్యాపింగ్ కాలేదు
కర్నూలు అర్బన్‌లో ఆరుగురు, కల్లూరులో ఇద్దరు, గూడూరులో ముగ్గురు గ్రేడ్-1 వీఆర్వోలు స్వర్ణ వార్డు సచివాలయాల్లో ఎలాంటి మ్యాపింగ్ కాలేదు. అనధికారికంగా పని చేస్తున్న ఆగ్రేడ్-1 వీఆర్వోలను ప్రజల సంక్షేమం కోసం గ్రామీణ ప్రాంతాలకు డిప్యుటేషన్లను విధులు కేటాయించాలని ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ నెల 14న పదోన్నతులు పొందిన 83 గ్రేడ్-1 వీఆర్వోలు పోస్టింగులు కేటాయించారు. ఈ పదోన్నతులు, పోస్టింగుల వ్యవహారం వివాదాస్పదంగా మారింది. జిల్లా రెవెన్యూ శాఖ ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘించాయని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
షెడ్యూల్ కులాలకు అన్యాయం
ఎస్సీ వర్గీకరణ జీవో రాకముందే ఈ ప్రమోషన్లకు సంబంధించిన ఫైనల్ సీనియర్ లిస్టు, రోస్టర్ పాయింట్లను అధికారులు సిద్ధం చేశారు. దీని వల్ల కర్నూలు జిల్లాలో ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన పలువురు అర్హులైన ఉద్యోగులకు తీవ్ర అన్యాయం జరిగింది.
వింత పోకడలు
నంద్యాల జిల్లాలో కూడా ఇదే విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ల (వీఆర్వో) పదోన్నతులు, పోస్టింగుల ప్రక్రియ జరిగింది. ఎలాంటి వివాదాలు లేకుండా వీఆర్వోలందరికీ న్యాయం జరిగేలా అక్కడ పోస్టింగులు ఇచ్చారు. కర్నూలు జిల్లాకు వచ్చేసరికి మా త్రం పరిస్థితి పూర్తిగా భిన్నంగా మారింది. ఇక్కడ మాత్రమే ఎందుకు ఇన్ని పక్షపాతాలు, డిప్యుటేషన్ల వింత పోకడలు చోటు చేసుకున్నాయని ప్రజాసంఘాలు, ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు.
న్యాయం చేయాలి
ప్రభుత్వ నిబంధనలను, ఎస్సీ వర్గీకరణ జీవోను అతిక్రమించిన పోస్టింగుల పర్వంపై ఉన్నతాఽ దికారులు సమగ్ర విచారణ జరపాలని, అన్యాయం జరిగిన దళిత, వీఆర్వోలకు న్యాయం చేయాలని కోరుతూ జేసీ, కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు.