రోడ్డుపైన ధాన్యం ఆరబోత
ABN , Publish Date - Mar 29 , 2026 | 12:10 AM
కొంతమంది రైతులు తమ పంట ఉత్పత్తులను రోడ్డుపైనే ఆరబెట్టుతున్నారు
వాహనదారులకు పొంచి ఉన్న ప్రమాదం
చాగలమర్రి, మార్చి 28 (ఆంధ్రజ్యోతి): కొంతమంది రైతులు తమ పంట ఉత్పత్తులను రోడ్డుపైనే ఆరబెట్టుతున్నారు. నడిరోడ్లపైనే ధాన్యం ఆరబెట్టడంతో వాహనదారులు ప్రమాదాల బారిన పడుతున్నారు. మండలంలో కిలోమీటర్ల పొడవునా సగం రోడ్డుపై ఆరబెడుతుండటంతో వాహనాల రాకపోలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. ఆళ్లగడ్డ నియోజకవర్గంలో ప్రభుత్వం గోదాములు ఏర్పాటు చేయకపోవడంతో ఇలా రోడ్లపై ఆరబెట్టుకోవలసి వస్తోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం గోదాములు, కలాలు ఏర్పాటు చేయాలని రైతులు కోరుతున్నారు.
రహదారులపై ధాన్యం ఆరబెడితే చర్యలు
తహసీల్దార్ విజయ్‌కుమార్
రహదారులపై మొక్కజొన్న తదితర పంట ఉత్పత్తులను ఆరబెడితే చర్యలు తప్పవని తహసీల్దార్ విజయ్‌కుమార్ హెచ్చరించారు. శనివారం మాట్లాడుతూ చాగలమర్రి నుంచి అహోబిలం రహదారిలో నిత్యం అధిక సంఖ్యలో వాహనాలు రాకపోకలు ఉంటాయని, కొందరు రైతులు రహదారిపైనే మొక్కజొన్న ధాన్యం ఆరబెట్టడం వల్ల ప్రమాదాలు చోటుచేసుకునే అవకాశం ఉందని అన్నారు. రైతులు గమనించి, సహకరించాలని కోరారు.