ట్రామడాల్ మందుల విక్రయాలపై దాడులు
ABN , Publish Date - Sep 19 , 2026 | 12:15 AM
తీవ్రమైన నొప్పి నివారణ కోసం మత్తు ప్రభావం కలిగించే ట్రామడాల్ మందుల వినియోగంపై జిల్లా ఔషధ నియంత్రణ శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. డ్రగ్స్ డైరెక్టర్ జనరల్ పి. అరుణబాబు ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా మెడికల్ షాపులు, ఏజెన్సీలపై కర్నూలు అర్బన్ డ్రగ్ ఇన్‌స్పెక్టర్ పి. హనుమన్న, కర్నూలు రూరల్ డ్రగ్ ఇన్‌స్పెక్టర్ ఎస్. జయరాముడు ఇటీవల దాడులు చేశారు.
కర్నూలులో మూడు మెడికల్ షాపులు, రెండు ఏజెన్సీలకు నోటీసులు
కర్నూలు హాస్పిటల్, సెప్టెంబరు 18 (ఆంధ్రజ్యోతి): తీవ్రమైన నొప్పి నివారణ కోసం మత్తు ప్రభావం కలిగించే ట్రామడాల్ మందుల వినియోగంపై జిల్లా ఔషధ నియంత్రణ శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. డ్రగ్స్ డైరెక్టర్ జనరల్ పి. అరుణబాబు ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా మెడికల్ షాపులు, ఏజెన్సీలపై కర్నూలు అర్బన్ డ్రగ్ ఇన్‌స్పెక్టర్ పి. హనుమన్న, కర్నూలు రూరల్ డ్రగ్ ఇన్‌స్పెక్టర్ ఎస్. జయరాముడు ఇటీవల దాడులు చేశారు. ఈ దాడుల్లో కర్నూలు నగరంలోని మూడు మెడికల్ షాపులు, రెండు మెడికల్ ఏజెన్సీల్లో సెల్ బిల్లుల్లో అక్రమాలు, నిబంధనలకు విరుద్ధంగా ఉన్నట్లు గుర్తించారు. బళ్లారి చౌరస్తాలోని రెండు మెడికల్ షాపులు, ఒక మెడికల్ షాపు, పాతబస్టాండులో రెండు ఏజెన్సీలు, ఉన్నాయి. నిబంధనలకు విరుద్ధంగా ట్రామడాల్ మందులు ఎలాంటి బిల్లులు లేదా డాక్టర్ ప్రిస్కిప్షన్ లేకుండా విక్రయిస్తున్నట్లు గుర్తించారు. పాతబస్టాండులోని ఓ మెడికల్ షాపులో డాక్టర్ ప్రిస్కిప్షన్‌తోనే మందులు అమ్ముతున్నా మిగిలిన నిబంధనలు పాటించలేదని దాడుల్లో వెల్లడైంది. బళ్లారి చౌరస్తాలోని ఓ మెడికల్ షాపులో హార్డ్‌కాఫీలు చూపెట్టడం లేదని తనిఖీలో గుర్తించారు. మరీ కొన్ని చోట్ల ఫార్మాసిస్టులు లేకుండా మందులు అమ్ముతున్నట్లు తనిఖీలో బయటపడింది. దీంతో సెల్ బిల్లులులో అవకతవకలు ఇతర నిబంధనలు పాటించనందుకు మూడు మెడికల్ షాపులు, రెండు మెడికల్ ఏజెన్సీలకు జిల్లా ఔషధ నియంత్రణ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ హరిహరతేజ తెలిపారు.
డాక్టర్ల ప్రిస్కిప్షన్‌తోనే మందులు అమ్మాలి
మందులన్నీ డాక్టర్ల ప్రిస్కిప్షన్లతో అమ్మాలి. మత్తు కలిగించే ఔషధాలను అక్రమంగా నిల్వ చేస్తే చర్యలు తీసుకుంటాం. మెడికల్ షాపులన్నీ ఫార్మాసిస్టు ఆధ్వర్యంలో మందులు విక్రయించాలి. ట్రామడాల్ మందులు హోల్‌సేల్ ఏజెన్సీలు డాక్టర్ అటాచ్ మెడికల్ కౌంటర్లకు సరఫరా చేయాలి. - హరిహరతేజ, అసిస్టెంట్ డైరెక్టర్ జిల్లా ఔషధ నియంత్రణశాఖ