తాగునీటి సమస్య రాకుండా చూడాలి
ABN , Publish Date - Apr 19 , 2026 | 11:56 PM
నియోజకవర్గంలో వేసవిలో తాగునీటి సమస్య తలెత్తకుండా అధికారులు సమన్వయంతో పనిచేయాలని రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి ఆదేశించారు.
బనగానపల్లె, ఏప్రిల్ 19 (ఆంధ్రజ్యోతి): నియోజకవర్గంలో వేసవిలో తాగునీటి సమస్య తలెత్తకుండా అధికారులు సమన్వయంతో పనిచేయాలని రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి ఆదేశించారు. ఆదివారం పట్టణంలోని ఎంపీడీవో కార్యాలయంలో ఆర్‌డబ్ల్యుఎస్, ఎంపీడీవో, పంచాయితీ సెక్రటరీలు, ఆర్‌డబ్ల్యుఎస్ ఏఈలతో సమీక్ష నిర్వహించారు. బోర్లకు మరమతులు చేయించాలని, పైప్‌లైన్ లీకేజీలు అరికట్టాలన్నారు. నిధుల సమస్య ఉంటే తన దృష్టికి తేవాలన్నారు. గైర్హాజరైన పంచాయతీ కార్యదర్శులకు నోటీసులు జారీ చేయాలని ఎంపీడీవోలను మంత్రి ఆదేశించారు. ఆర్‌డబ్ల్యూఎస్ ఈఈ శ్రీనివాసులు, బనగానపల్లె డీఈ మధుసూధన్, ఏఈలు సాయికృష్ణ, కరీముల్లా, సాయిరాజు, హరీశ్‌కుమార్, ఎంపీడీవోలు నాగరాజు, దస్తగిరిబాబు, కృష్ణవేణి, సాల్మాన్‌రాజు, వరప్రసాదరావు పాల్గొన్నారు.
ఇల్లూరు కొత్తపేట ప్రజల రుణం తీర్చుకోలేనిది
ఇల్లూరు కొత్తపేట ప్రజల రుణం తీర్చకోలేనిదని రోడ్లు భవనాల శాఖామంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి తెలిపారు. ఆదివారం సాయంత్రం రూ.1.21 కోట్లతో నిర్మించిన సీసీ రోడ్డు, అండర్‌డ్రైనేజీ కాల్వనిర్మాణం పనులను మంత్రి ప్రారంభించారు. గ్రామంలో టీడీపీ శ్రేణులు మంత్రికి ఘన స్వాగతం పలికారు. గ్రామంలో రూ.81లక్షల వ్యయంతో ఊరివాకిలి నుంచి ఎస్సీ కాలనీ వరకుసీసీ రోడ్డు, అండర్ డ్రైనేజీ నిర్మాణం పనులు, అంగన్‌వాడీ కేంద్రం నుంచి ముస్లిం కాలనీ వరకు ఎన్‌ఆర్‌ఈజీఎ్‌స నిధులు రూ.40లక్షలతో భూగర్భకాల్వ నిర్మాణం పనులను ప్రారంభించారు. బహిరంగ సభలో మంత్రి మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత సంక్షేమ,అభివృద్ది కార్యక్రమాలు చేస్తున్నామన్నారు. పింఛన్ రూ.4వేలు చేశామని, ఉచితగ్యాస్ ఇస్తున్నామని, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, తల్లికి వందనం, రైతులకు అన్నదాత సుఖీభవ పథకం అమలు చేశామన్నారు. వైసీపీ హయాంలో గ్రామం పట్ల వివక్ష చూపారన్నారు. తనను ప్రతి ఎన్నికల్లో కన్న బిడ్డలా ఆదరించారని, ప్రతి ఎన్నికల్లో భారీ మెజార్టీ ఇచ్చారన్నారు. వైసీపీ 5 ఏళ్లు కక్షసాధింపు చర్యలకు పాల్పడిందన్నారు. టీడీపీ కక్షలు, కార్పణ్యాలకు దూరమని, ప్రజలు ప్రశాంతంగా జీవించాలన్నదే తమ ధ్యేయమన్నారు. ఉన్నత పాఠశాలకు గదులు, మినరల్‌వాటర్ ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తామన్నారు. ఎస్సీ కాలనీకి డ్రైనేజీ సౌకర్యం కల్పిస్తామన్నారు. నియోజకవర్గం అభివృద్దిపై చర్చకు రావాలని ఈనెల 30 తర్వాత ఎప్పుడైనా శని, ఆదివారాల్లో చర్చకు తాను సిద్ధంగా ఉన్నట్లు సవాల్ విసిరారు. మాజీ సర్పంచ్ రామిరెడ్డి, తులసిరెడ్డి, రామచంద్రుడు, రామ మద్దిలేటిరెడ్డి రామ్మోహన్‌రెడ్డి, మదన్‌మోహన్‌రెడ్డి, బాలనాయుడు, మహేశ్వరరెడ్డి, శేఖర్, రాజా, చాంద్‌భాష, బాలుడు, తదితరులు పాల్గొన్నారు.