కల్లూరు, కోడుమూరు మండలాలకు తాగునీరు విడుదల చేయాలి
ABN , Publish Date - Jul 20 , 2026 | 11:35 PM
కల్లూరు, కోడుమూరు మండలాల్లోని గ్రామాలకు గాజులదిన్నె ప్రాజెక్టు ద్వారా తక్షణమే తాగునీరు విడుదల చేయాలని హంద్రీ పరివాహక పరిరక్షణ కమిటీ నాయకులు డిమాండ్ చేశారు.
హంద్రీ పరివాహక పరిరక్షణ కమిటీ డిమాండ్
కర్నూలు కల్చరల్, జూలై 20 (ఆంధ్రజ్యోతి): కల్లూరు, కోడుమూరు మండలాల్లోని గ్రామాలకు గాజులదిన్నె ప్రాజెక్టు ద్వారా తక్షణమే తాగునీరు విడుదల చేయాలని హంద్రీ పరివాహక పరిరక్షణ కమిటీ నాయకులు డిమాండ్ చేశారు. సోమవారం పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో, జిల్లా పరిషత్ కార్యాలయం నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించి, కలెక్టరేట్ ఎదుట నిరసన ధర్నా చేపట్టారు. పరిరక్షణ కమిటీ కన్వీనర్ శ్రీనివాస గౌడ్ అధ్యక్షత వహించిన ఈ ధర్నాకు వివిధ పార్టీలు, ప్రజా సంఘాల నాయకులు హాజరై తమ మద్దతు ప్రకటించారు. ప్రజాస్వామ్య సంఘాల ఐక్య వేదిక కన్వీనర్ రామకృష్ణారెడ్డి, రాయలసీమ విద్యావంతులు వేదిక నాయకుడు రత్నం ఏసేపు, సీపీఐఎం జిల్లా కార్యదర్శి గౌస్ దేశాయ్, సీపీఐ నగర కార్యదర్శి రామకృష్ణారెడ్డి మద్దతు తెలిపారు. వివిధ గ్రామాల ప్రజలు ఖాళీ బిందెలతో నిరసన వ్యక్తం చేశారు. ధర్నాలో రైతుకూలీ సంఘం నాయకులు సుంకన్న, రమణారెడ్డి, రైతు వేదిక నాయకుడు శివశంకర్ గౌడ్, రాయలసీమ సాగునీటి సాధన సమితి ఉపాధ్యక్షుడు చంద్రశేఖర్‌రెడ్డి, ఎస్‌డీపీఐ నాయ కుడు ఖాదర్ బాషా, బీసీ సంఘం నాయకుడు శేషఫణి, సీపీఎం మహిళా నాయకురాలు పి. నిర్మలమ్మ, వివిధ సంఘాల నాయకులు పాల్గొన్నారు.
కాంగ్రెస్ మద్దుతు
కర్నూలు అర్బన్: నగరంలోని కలెక్టరేట్ ఎదుట హంద్రీ పరివాహక పరిరక్షణ కమిటీ నాయకుడు సూర్యప్రకాష్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ధర్నాకు కాంగ్రెస్ నాయకులు మద్దతు ప్రకటించారు. డీసీసీ అధ్యక్షుడు బి. క్రాంతి నాయుడు, సాంబశివుడు, లాజరస్ తదితరులు పాల్గొన్నారు.