పోతిరెడ్డిపాడు నుంచి తాగునీరు
ABN , Publish Date - Aug 06 , 2026 | 11:26 PM
పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్ నుంచి దిగువకు తాగునీటి అవసరాల నిమిత్తం నీరు విడుదల చేస్తున్నట్లు నీటిపారుదల శాఖ ఎస్‌ఈ శివశంకరరెడ్డి, ఈఈ సుబ్రహ్మణ్యంరెడ్డి తెలిపారు.
జూపాడుబంగ్లా, ఆగస్టు 6 (ఆంధ్రజ్యోతి) : పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్ నుంచి దిగువకు తాగునీటి అవసరాల నిమిత్తం నీరు విడుదల చేస్తున్నట్లు నీటిపారుదల శాఖ ఎస్‌ఈ శివశంకరరెడ్డి, ఈఈ సుబ్రహ్మణ్యంరెడ్డి తెలిపారు. గురువారం ఉదయం పోతిరెడ్డిపాడు 5, 6 గేట్లకు పూజలు చేసి స్వీచ్ ఆన్ చేసి దిగువకు నీరు విడుదల చేశారు. అనంతరం కృష్ణమ్మకు జలహారతి ఇచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు దిగువకు తాగునీటి అవసరాల కోసం 2వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు చెప్పారు. శ్రీశైలం జలాశయంలోకి ఎగువ ప్రాంతం నుంచి ఇన్‌ఫ్లో పెరిగినట్లయితే ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు నీటివిడుదల పెంచుతామని అన్నారు. నీటిని వృథా చేయకుండా వినియోగించుకోవాలని అన్నారు. శ్రీశైలం జలాశయంలోకి ఎగువప్రాంతం నుంచి 2 లక్షల క్యూసెక్కులకుపైగా వస్తున్నాయని అన్నారు. సాయంత్రం శ్రీశైలం జలాశయంలోకి 871 అడుగుల మేరకు చేరడంతో మరో 2వేల క్యూసెక్కుల నీటిని పెంచి మొత్తం 4వేల క్యూసెక్కులను పెంచినట్లు అధికారులు తెలిపారు. దిగువకు విడుదల చేసిన మొత్తం నీటిని బానకచర్ల క్రాస్‌హెడ్‌రెగ్యులేటర్ నుంచి తెలుగుగంగ కాల్వకు మళ్లించినట్లు అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో డీఈ నగేష్, ఏఈ విష్ణువర్ధన్‌రెడ్డి పాల్గొన్నారు.