ఎల్‌నినో ఎఫెక్ట్.. ఎండిన బోర్లు
ABN , Publish Date - Oct 27 , 2026 | 12:38 AM
ఎల్‌నినో ప్రభావంతో బోర్లు ఎండిపోయి రైతులకు అదనపు భారం పడుతోంది. నూతన బోరు వేసేందుకు ఒక్కో బోరుకు రూ.లక్ష వరకు అవుతుండటంతో రైతులు ఆవేదన చెందుతున్నారు. జిల్లాలో 300 బోర్లకు సుమారు రూ.3కోట్ల భారం రైతులపై పడింది.
నూతన బోర్లు వేయిస్తున్న రైతులు
ఒక్కో బోరుకు రూ.లక్ష
తమకు అదనపు భారమని రైతుల ఆవేదన
రుద్రవరం, అక్టోబరు 26 (ఆంధ్రజ్యోతి): ఎల్‌నినో ప్రభావంతో బోరుబావుల్లో భూగర్భజలాలు తగ్గిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. నూతన బోర్లు వేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆళ్లగడ్డ నియోజకవర్గంలో రుద్రవరం, ఉయ్యాలవాడ, దొర్నినపాడు ఆళ్లగడ్డ, చాగలమర్రి, శిరివెళ్ల మండలాల్లో సుమారు 300 బోర్లు వేయగా, 150 బావులకు నీరు రాలేదు. 150 బోరుబావులకు మాత్రమే భూగర్భజలం అందిందని రైతుల సమాచారం.
ఎల్‌నినో ప్రభావమే కారణం
ఎల్‌నినో ప్రభావంతో వాతావరణం వేడిగా మారడంతో భూగర్భజాలాలు అడుగంటాయి. దీంతో పంటలను కాపాడుకునే మార్గం లేక రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే వర్షాలు కురవక పంటలు నష్టపోయామని ఇక బోర్లలో కూడా నీరు రాకపోతే ఎలా అని వాపోతున్నారు.
రైతులపై రూ.3కోట్ల అదనపు భారం
పంట పెట్టుబడి కాకుండా బోరుబావులు తవ్వేందుకు రైతులపై రూ.3కోట్లు మేర అదనపు భారం పడినట్లు లెక్కలు ఉన్నాయి. ఒక్కో రైతు పొలంలో 2 నుంచి 3 బావులు తవ్వగా, ఒక బావిలో మాత్రమే నీరు లభిస్తోంది. మిగిలిన రెండు బావులు వృథాగా మారాయి. దీంతో తమపై అదనపు భారం పడిందని రైతులు అంటున్నారు. ఇప్పటికే వరి, మినుము, మొక్కజొన్న సాగు చేశామని, వాటిని రక్షించుకోడానికే నూతన బోర్లు వేశామంటున్నారు. ఒక్కో బోరు వేసేందుకు రూ.లక్ష ఖర్చు అవుతోందని రైతులు తెలిపారు. ఈ లెక్కన 300 బోర్లకు రూ.3కోట్లు పెట్టుబడి అదనపు భారం వారిపై పడుతోంది.
మూడు బోరుబావులు వేయించా
నా పొలంలో మూడు బోరుబావులు వేయించా. అయితే ఒక దానిలో మాత్రమే నీరు వచ్చింది. మరో రెండు బోరుబావుల ఖర్చు వృథాగా మారింది. ఇదు నాకు భారంగా మారింది. - సుబ్రహ్మణ్యం, రైతు
రైతుకు అదనపు బారం
ఉన్నవి ఎండిపోయి, కొత్త బోర్లు తవ్వేందుకు రైతుకు అదనపు భారం పడుతోంది. ఇప్పటికే సాగుకు పెట్టుబడులు అధికమయ్యాయి. ఖర్చు భరించలేకున్నాం. రెండు బోర్లు వేయిస్తే ఒకదాంట్లో మాత్రమే నీరు పడింది. - శ్రీనివాసులు, రైతు