కాల్వను కాజేసి...
ABN , Publish Date - Mar 06 , 2026 | 11:13 PM
పొలాలకు సాగునీరు అందించే హంద్రీనీవా పిల్ల కాల్వలను, వంకలను సైతం భూకబ్జాదా రులు వదలడం లేదు.
హంద్రీనీవా పిల్ల కాల్వలు కబ్జా
వంకపై అక్రమంగా బ్రిడ్జి నిర్మాణం
చోద్యం చూస్తున్న అధికారులు
పత్తికొండ టౌన్, మార్చి 6 (ఆంధ్రజ్యోతి): పొలాలకు సాగునీరు అందించే హంద్రీనీవా పిల్ల కాల్వలను, వంకలను సైతం భూకబ్జాదా రులు వదలడం లేదు. పత్తికొండ శివారులోని ఆదోని రోడ్డులో సిద్ధ య్య పెట్రోల్ బంకు వెనకభాగాన సర్వేనంబర్ 118లో 18.46 ఎకరాలు వంక పోరంబోకు స్థలం ఉంది. అదే సమీపంలో 113/2 సర్వేనంబర్‌లో 83సెంట్లు, 114/2లో 37సెంట్ల విస్తీర్ణంలో 34 మీటర్ల వెడల్పుతో హంద్రీనీవా పిల్ల కాలువను తవ్వారు. 119/121/1 లో పట్టా భూమిని కొనుగోలు చేసిన ఓ రియల్ వ్యాపారి ఏకంగా వంక, హంద్రీనీవా పిల్ల కాలువపైన కన్నేసి దర్జాగా కబ్జా చేశాడన్న ఆరోపణలున్నాయి.
అక్రమాలకు తెర..
119 సర్వేంబర్‌లో 3.73 ఎకరాలు, 120/1 ససర్వేనంబర్‌లో 4.54 ఎకరాలను ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి కొనుగోలు చేశాడు. 118 సర్వేనంబర్‌లో వంకను, 13/2, 114/2లో పిల్ల కాల్వలను ఆక్రమించుకుని, వెంచర్ ద్వారా దర్జాగా ప్లాట్లను అమ్ముకునేందుకు ఓ రియల్ వ్యాపారి అక్రమాలకు తెరలేపాడు.
కాల్వ నామ రూపాలు లేకుండా..
పందికోన రిజర్వాయర్ కింద ఉన్న ఎడమ కాలువకు అనుసంధానంగా ఉప కాలువ (పిల్ల కాలువ) సర్వేనంబర్ 113/2లో 83 సెం ట్లు, 114/2 సర్వేనంబర్‌లో 37 సెంట్లు విస్తీర్ణంలో 34 మీటర్ల వెడల్పుతో హంద్రీనీవా పిల్ల కాల్వను అధికారులు తవ్వారు. దీని ద్వారా చిన్నహుల్తి, పెద్దహుల్తి, హోసూరు గ్రామాల పొలాలకు సాగునీరు అందించాల్సి ఉంది. కొన్నేళ్లుగా ఆ కాల్వ నిర్మాణ పనులు నిలిచిపోవడంతో రియల్ వ్యాపారి ఆకాలువపై కన్నేసి జేసీబీతో చదును చేసి కాల్వ నామ రూపాలు లేకుండా చేశాడన్న ఆరోపణలున్నాయి.
దర్జాగా వంకపై బ్రిడ్జి నిర్మాణం
సర్వేనంబర్ 118లో 18.46 ఎకరాల వంక పోరంబోకు స్థలం ఉంది. అక్కడ వెంచర్ వేసిన ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి ఏకంగా అధికారులు అనుమతులు లేకుండా వంకపై బ్రిడ్జి నిర్మించాడు. వర్షాకాలంలో పత్తికొండ నుంచి మురుగు, వర్షపునీరు ఈ వంక ద్వారానే చాలా పెద్ద వెడల్పుతో ప్రవహిస్తూ కింద లోతట్టు ప్రాంతాలకు నీరు చేరుకుంటుంది. అంతపెద్దగా ప్రవహించే వంకను కేవలం చిన్న వెడ ల్పుతో బ్రిడ్జి నిర్మాణం చేపడితే భవిష్యత్‌లో ఈవంక ద్వారా అధిక వర్షపునీరు ఎలా ప్రవహిస్తుందన్న ప్రశ్న పట్టణవాసుల్లో నెలకొంది.
రెండు రోజులైనా..
వంక పోరంబోకు స్థలంలో అనుమతులు లేకుండా బ్రిడ్జి కడుతున్నారన్న సమాచారం అందుకున్న తహసీల్దార్ ఉసేన్‌సాహెబ్, రెవెన్యూ అధికారులు అక్కడికి చేరుకుని నిర్మాణ పనులను పరిశీలించారు. బ్రిడ్జిలు ఎలా కడతారని భూ కబ్జాదారులను అధికారులు నిలదీసినట్లు సమాచారం. రెండు రోజులైనా ఇంతవరకు ఎలాంటి చర్యలు చేపట్టకపోవడంతో రెవెన్యూ అధికారులపైనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
చర్యలు తీసుకుంటాం
సర్వేనంబర్ 118లో అనుమతులు లేకుండా వంకపై బ్రిడ్జి నిర్మా ణం చేపట్టారు. పిల్ల కాలువలను తవ్వేశారన్న దానిపై వివరణ కోర గా, సర్వేయర్‌తో సమగ్రంగా సర్వే జరిపించి ఆక్రమణలకు పాల్పడి ఉంటే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం.
ఉసేన్‌సాహెబ్, తహసీల్దార్, పత్తికొండ