డబ్బు కోసం పరిగెత్తకండి
ABN , Publish Date - Sep 19 , 2026 | 11:55 PM
డబ్బు కోసం పరిగెత్తకండి.. మంచి పేరు తెచ్చుకోడానికి సేవ చేయండి.. అని హైదరాబాదు అపోలో క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ డైరెక్టర్ పద్మశ్రీ అవార్డు గ్రహీత డా.పి. విజయ్ ఆనంద్‌రెడ్డి పేర్కొన్నారు.
వైద్య రంగంలో సేవ, ప్రేమ ముఖ్యం
పద్మశ్రీ అవార్డు గ్రహీత డాక్టర్ విజయ్ ఆనంద్ రెడ్డి
కర్నూలులో రేడియేషన్ అంకాలజీ వైద్యుల రాష్ట్ర సదస్సు
కర్నూలు హాస్పిటల్, సెప్టెంబరు 19(ఆంధ్రజ్యోతి): డబ్బు కోసం పరిగెత్తకండి.. మంచి పేరు తెచ్చుకోడానికి సేవ చేయండి.. అని హైదరాబాదు అపోలో క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ డైరెక్టర్ పద్మశ్రీ అవార్డు గ్రహీత డా.పి. విజయ్ ఆనంద్‌రెడ్డి పేర్కొన్నారు. కర్నూలు మెడికల్ కాలేజీలోని న్యూ లెక్చరర్ గ్యాలరీలో అసోసియేషన్ ఆఫ్ రేడియేషన్ ఆంకాలజిస్టు ఆఫ్ ఇండియా ఏపీ చాప్టర్ ఆధ్వర్యంలో 7వ రాష్ట్ర స్థాయి రెండు రోజుల వైద్యుల సదస్సు శనివారం ప్రారంభమైంది. ఈ సదస్సుకు అసోసియేషన్ ఆఫ్ రేడియేషన్ ఆంకాలజిస్టు ఆఫ్ ఇండియా రాష్ట్ర అధ్యక్షురాలు డా.ఎన్. సుజాత అధ్యక్షతన వహించారు. ఈ సందర్భంగా అపోలో క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ డైరెక్టర్ డా.పి. విజయ్ ఆనంద్ రెడ్డి మాట్లాడుతూ రోగులకు తగిన సమయం కేటాయించాలని వైద్యులకు సూచించారు. వైద్యవృత్తి ఇతర వృత్తుల కంటే ఎంతో ప్రత్యేకమైందని, మానవ ప్రాణాలతో ముడిపడిన ఈ వృత్తిలో జ్ఞానంతో పాటు, ప్రేమ, కరుణ, దయ, మానవత్వం, సేవాభావం అవసరమన్నారు.
పరిశోధనలకు రూ.13 కోట్లు
వైద్య పరిశోధనలకు రూ.13 కోట్లు కేటాయించినట్లు డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ రిజిస్ర్టార్ డా.టి. సాయిసుధీర్ పేర్కొన్నారు. ప్రొఫెసర్లు అసోసియేట్, అసిస్టెంట్ ప్రొఫెసర్లకు రూ.10 కోట్లు, వైద్య విద్యార్థులకు రూ.3 కోట్లు కేటాయించామని ఈ నిధులను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కర్నూలు మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ డా.కే. చిట్టినరసమ్మ, కర్నూలు జీజీహెచ్ సూపరింటెండెంట్ డా.కే. వెంకటేశ్వర్లు మాట్లాడుతూ రూ.125 కోట్లతో ప్రారంభించిన స్టేట్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్‌ను డైరెక్టర్ డా.సీఎ్‌సకే ప్రకాష్ అభివృద్ధిలోకి తీసుకుని వచ్చారన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ డా.పి. చంద్రశేఖర్ సదస్సు ఆర్గనైజింగ్ చైర్‌పర్సన్ డా.సీఎ్‌సకే ప్రకాష్, సెక్రటరీలు డా. ప్రశాంతి, డా.బి. శ్వేత, కోశాధికారులు డా. ఉమామహేశ్వరరెడ్డి, డా.శ్వేత తదితరులు పాల్గొన్నారు.