విలీనం వద్దేవద్దు..!
ABN , Publish Date - Mar 31 , 2026 | 11:05 PM
ఎమ్మిగనూరుకు చేనేతపురిగా ఖ్యాతిని తెచ్చిపెట్టిన ‘ది ఎమ్మిగనూరు చేనేత సహకార ఉత్పత్తి, విక్రయ సంఘం(వైడబ్ల్యుసీఎస్)’ విక్రయ కేంద్రాలను ఆప్కోలో విలీనం చేసే తీర్మానాన్ని సభ్యులు ముక్తకంఠంగా తిరస్కరించారు.
పోలీస్ పహారాలో చేనేత సొసైటీ సర్వసభ్య సమావేశం
సొసైటీలోకి వెళ్లేందుకు యత్నించిన వైసీపీ, కాంగ్రెస్, వామపక్షాలు
అడ్డుకున్న పోలీసులు
ఎమ్మిగనూరు, మార్చి 31 (ఆంధ్రజ్యోతి): ఎమ్మిగనూరుకు చేనేతపురిగా ఖ్యాతిని తెచ్చిపెట్టిన ‘ది ఎమ్మిగనూరు చేనేత సహకార ఉత్పత్తి, విక్రయ సంఘం(వైడబ్ల్యుసీఎస్)’ విక్రయ కేంద్రాలను ఆప్కోలో విలీనం చేసే తీర్మానాన్ని సభ్యులు ముక్తకంఠంగా తిరస్కరించారు. ఎమ్మిగనూరు పట్టణంలోని వైడబ్ల్యూసీఎస్ సొసైటీ ప్రధాన కార్యాలయంలో ఆదోని సబ్‌కలెక్టర్, సొసైటీ ప్రత్యేక అధికారి అజయ్ కుమార్ అధ్యక్షతన మంగళవారం సర్వసభ్య సమావేశం ఉత్కంఠ, ఉద్రిక్తతల నడుమ సాగింది. సంఘం విక్రయ కేంద్రాలను ఆప్కోలో విలీనం చేసేందుకు చేనేత జౌళి శాఖ కమిషనర్ నిర్ణయాన్ని చేనేత కార్మికులు వ్యతిరేకించారు. 225 మంది సభ్యులు సమావేశానికి హాజరు కాగా 210 మంది తీర్మానానికి వ్యతిరేకంగా సంతకాలు చేశారు. మరో 15మంది నిర్ణయాన్ని తెలపకుండా వెళ్లిపోయారు. సమావేశం ప్రారంభమైన వెంటనే ఏడీహెచ్ నాగరాజరావు విక్రయకేంద్రాల విలీన ఆవశ్యకతను వివరిస్తుండగా సభ్యులు అడ్డుకున్నారు. ఎట్టి పరస్థితుల్లోనూ విలీనాన్ని ఒప్పుకోమని తేల్చి చెప్పారు. దీంతో ఒక్కసారిగా సమావేశంలో తీవ్ర గందరగోళం ఏర్పడింది. సబ్‌కలెక్టర్ అజయ్‌కుమార్, సీఐ శ్రీనివాసులు కలుగజేసుకొని ‘మీ నిర్ణయం మేరకే జరుగుతుంది..’ అని సభ్యులను శాంతింపజేశారు. విక్రయ కేంద్రాలు ఆప్కోలో విలీనానికి వ్యతిరేకంగా ఉన్నట్లు గ్రహించిన అధికారులు, విలీనం వల్ల కలిగే లాభాలను వివరించేందుకు ప్రయత్నించారు. అయినప్పటికీ వారు ఏమాత్రం పట్టించుకోలేదు. దీంతో చేసేదేమీ లేక ఎన్నడూలేని విదంగా తీర్మానం పుస్తకంలో తమదైన శైలి లో తీర్మానాన్ని రాసి అనుకూలమా? లేక తిరస్కారమా? అని రాయాలని నిర్ణయించారు. ఒక్కొక్కరు తమ అభిప్రాయాన్ని తెలిపి సంతకాలు చేయాలని చెప్పారు. కొంతమంది చదువు రాదని చెప్పినా కూడా వేలిముద్రలు వేయాలని సూచించారు. అధికారుల నిర్ణయం మేరకు సభ్యులు తీర్మానం పుస్తకంలో తమ నిర్ణయాన్ని నమోదు చేశారు. ఉదయం 10 గంటలకు ప్రారంభమైన సమావేశం సాయంత్రం 4 గంటల వరకు సాగింది. ఎట్టకేలకు చేనేత సొసైటీకి చెందిన 16 విక్రయ కేంద్రాలు విలీనం కాకుండా తీర్మానం వీగిపోయినందుకు సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు.
విపక్షాల ఆందోళన..
సమావేశం ప్రారంభానికి ముందు మాజీ ఎంపీ, కర్నూలుపార్లమెంటు వైసీపీ సమన్వయకర్త బుట్టా రేణుక, సీనియర్ నాయకులు బుట్టా శివ నీలకంఠ, కాంగ్రెస్ నాయకులు కాశీంవలి, షబ్బీర్ దేశాయ్, వైసీపీ ఇన్‌చార్జి రాజీవ్‌రెడ్డి, నాయకులు జగన్మోహన్ రెడ్డి, సీపీఐ, సీపీఎం నాయకులు రంగన్న, గోవిందు, సీఐఎంఎల్ నాయకులు రాజు, ఏసేపు, చేనేత, ప్రజాసంఘాల నాయకులు శంకరన్న, నీలకంఠ, ఎల్లే్‌ష,గణేష్, మాజీ మున్సిపల్ వైస్‌చైర్మన్ నజీర్, చేనేత మల్లి తదితరులు సొసైటీ కార్యాలయం ఎదుట బైఠాయించి ఆందోళన చేశారు. వామపక్షాల నాయకులు సొసైటీ కార్యాలయం గేటును తోసి లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో పోలీసులకు, వామపక్ష పార్టీల నాయకుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. పోలీసులు వారిని బలవంతంగా బయటకు పంపారు. దీంతో కాసేపు గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. బుట్టా రేణుక మాట్లాడుతూ ఈ విలీన కుట్రవెనక ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర్ రెడ్డి ఉన్నాడని, నిన్నటి ఎమ్మెల్యే ప్రెస్‌మీట్‌తో ఈ విషయం బహిర్గతం అయిందన్నారు. మొదటగా విక్రయ కేంద్రాలను విలీనం చేసి తర్వాత అప్పులు ఉన్నాయంటూ ఆస్తులు లాక్కునే ఎత్తుగడలో భాగమే విలీన ప్రక్రియ చేపట్టారని ఆరోపించారు. దీన్ని కాపాడుకునేందుకు ఎంతవరకైనా న్యాయపోరాటం చేస్తామన్నారు. ఎట్టకేలకు సొసైటీ విక్రయకేంద్రాల విలీనం తీర్మానం వీగిపోవటంతో సభ్యులు బాణసంచా పేల్చి సంబరాలు జరుపుకున్నారు.