Share News

అనుమతి లేని వెంచర్లలో ప్లాట్లు కొనవద్దు

ABN , Publish Date - Aug 20 , 2026 | 12:30 AM

ఆంధ్రప్రదేశ్‌ రియల్‌ ఎస్టేట్‌ రెగ్యులేటరీ అథారిటీ (ఏపీ రెరా) అనుమతి లేని వెంచర్లలో ప్లాట్లు కొనవద్దు అని చైర్మన్‌ శివారెడ్డి సూచించారు. బుధవారం నగర శివారులో జి. పుల్లారెడ్డి ఇంజినీరింగ్‌ కళాశాల సమీపంలోని హోటల్‌ కె. ఫార్చ్యూన్‌ సమావేశ హాలులో, నగరపాలక సంస్థ కమిషనర్‌ చల్లా ఓబులేసు ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు

అనుమతి లేని వెంచర్లలో ప్లాట్లు కొనవద్దు
మాట్లాడుతున్న రెరా చైర్మన్‌ శివారెడ్డి

ఏపీ రెరా చైర్మన్‌ శివారెడ్డి

కర్నూలు కల్చరల్‌, ఆగస్టు 19 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌ రియల్‌ ఎస్టేట్‌ రెగ్యులేటరీ అథారిటీ (ఏపీ రెరా) అనుమతి లేని వెంచర్లలో ప్లాట్లు కొనవద్దు అని చైర్మన్‌ శివారెడ్డి సూచించారు. బుధవారం నగర శివారులో జి. పుల్లారెడ్డి ఇంజినీరింగ్‌ కళాశాల సమీపంలోని హోటల్‌ కె. ఫార్చ్యూన్‌ సమావేశ హాలులో, నగరపాలక సంస్థ కమిషనర్‌ చల్లా ఓబులేసు ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. కర్నూలు, అనంతపురం జిల్లాలకు చెందిన రియల్‌ ఎస్టేట్‌ రంగ ప్రతినిధులు, డెవలపర్లు, ఏజెంట్లు, ఇంజనీర్లు, ఆర్కిటెక్చర్లు హాజరయ్యారు. వీరికి రెరా నిబంధనలపై చైర్మన్‌ అవగాహన కల్పించారు. ఆయన మాట్లాడుతూ రియల్‌ ఎస్టేట్‌ రంగంలో పారదర్శకత, జవాబుదారీతనం పెంపొందించడంతో పాటు కొనుగోలుదారుల ప్రయోజనాలను పరిరక్షించేందుకు రెరా నిబంధనలను ప్రతి ఒక్కరూ పాటించాలని కోరారు. ఏపీ రెరాలో ఇప్పటి వరకు తమ ప్రాజెక్టులను నమోదు చేసుకోని నిర్మాణదారులు, డెవలపర్లు వెంటనే ప్రాజెక్టులను నమోదు చేసుకోవాలని సూచించారు. రియల్‌ ఎస్టేట్‌ ప్రాజెక్టులు, ఏజెంట్ల నమోదు, నిబంధనల అమలు విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం చేయవద్దని స్పష్టం చేశారు. కొనుగోలుదారులు ప్లాట్లు కాని, ఇతర రియల్‌ ఎస్టేట్‌ ఆస్తులు కాని కొనుగోలు చేసే ముందు సంబంధిత ప్రాజెక్టుకు రెరా అనుమతి, నమోదు ఉందా? లేదా? పరిశీలించుకోవాలని సూచించారు. రెరా నిబంధనలకు అనుగుణంగా ఉన్న ప్రాజెక్టులనే ఎంపిక చేసుకోవడం ద్వారా భవిషత్తులో ఎదురయ్యే సమస్యలను నివారించవచ్చని చెప్పారు. రియల్‌ ఎస్టేట్‌ రంగానికి సంబంధించిన చట్టాలు, నిబంధనలు, ప్రాజెక్టుల నమోదు, కొనుగోలుదారుల హక్కులపై అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నట్లు చైర్మన్‌ పేర్కొన్నారు.

Updated Date - Aug 20 , 2026 | 12:30 AM