Share News

విధుల్లో అలసత్వం వద్దు

ABN , Publish Date - Oct 31 , 2026 | 11:47 PM

నగర పాలక సంస్థ ఎన్నికల నేపథ్యంలో పోలింగ్‌ ప్రశాంతంగా, స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా జరిగేలా పోలీసు అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా విధులు నిర్వర్తించాలని, అలసత్వం వద్దని ఎస్పీ విక్రాంత్‌ పాటిల్‌ తెలిపారు

విధుల్లో అలసత్వం వద్దు
సిబ్బందితో మాట్లాడుతున్న కర్నూలు ఎస్పీ విక్రాంత్‌ పాటిల్‌

ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా చర్యలు తీసుకోవాలి

పోలీసు అధికారులకు కర్నూలు ఎస్పీ సూచనలు

కర్నూలు క్రైం, అక్టోబరు 31 (ఆంధ్రజ్యోతి): నగర పాలక సంస్థ ఎన్నికల నేపథ్యంలో పోలింగ్‌ ప్రశాంతంగా, స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా జరిగేలా పోలీసు అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా విధులు నిర్వర్తించాలని, అలసత్వం వద్దని ఎస్పీ విక్రాంత్‌ పాటిల్‌ తెలిపారు. నగరంలోని గుత్తి పెట్రోల్‌ బంకు సమీపంలోని అథీనా పాఠశాల డిస్ర్టిబ్యూషన్‌ కేంద్రం వద్ద శనివారం ఎన్నికల బందోబస్తు విధులకు హాజరైన పోలీసు అధికారులు, సాయుధ బలగాలు, సిబ్బందికి ఎన్నికల విధులపై సూచనలు చేశారు. ఎస్పీ మాట్లాడుతూ పోలింగ్‌ కేంద్రాల వద్ద వంద మీటర్ల పరిధిలో ఎన్నికల నిబంధనలను పకడ్బందీగా అమలు చేయాలని, స్ర్టాంగ్‌ రూమ్‌లు, కౌంటింగ్‌ కేంద్రాల వద్ద పటిష్ట భద్రత కొనసాగించాలని ఆదేశించారు. సమస్యాత్మక ప్రాంతాల్లో నిరంతరం నిఘా ఉంచుతూ, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. విధి నిర్వహణలో ఏ చిన్న సమస్య తలెత్తినా వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం అందించాలన్నారు. సున్నిత, అత్యంత సున్నిత పోలింగ్‌ కేంద్రాలపై కూడా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలన్నారు. పోలింగ్‌ కేంద్రాల్లో సీసీ కెమెరాల ద్వారా నిరంతర పర్యవేక్షణ చేపట్టాలన్నారు. పోలింగ్‌ కేంద్రాల లోపల, బయట ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అవసరమైన చోట్ల వీడియోగ్రాఫర్లను నియమించి ఎన్నికల ప్రక్రియను పర్యవేక్షించాలన్నారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని పకడ్బందీగా అమలు చేస్తూ ప్రతి ఒక్కరూ నిష్పక్షపాతంగా బాధ్యతాయుతంగా వ్యవహరించాలన్నారు. ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు నిరంతరం అప్రమత్తంగా ఉంటూ ప్రజలు నిర్భయంగా ఓటు హక్కును వినియోగించుకునేలా సమన్వయంతో విధులు నిర్వహించాలని ఆయన ఆదేశించారు. కార్యక్రమంలో సదరన్‌ రీజియన్‌ హోంగార్డ్స్‌ కమాండెంట్‌ హనుమంతు, అడిషనల్‌ ఎస్పీ హుస్సేన్‌పీరా, డీఎస్పీలు రాఘవేంద్ర, దుర్గాప్రసాద్‌, సీఐలు, ఎస్‌ఐలు, సాయుధ బలగాలు, స్పెషల్‌ పార్టీ పోలీసులు పాల్గొన్నారు.

Updated Date - Oct 31 , 2026 | 11:47 PM