వలస వెళ్లొద్దు..
ABN , Publish Date - Sep 24 , 2026 | 12:18 AM
దయచేసి వలసలు వెళ్ల వద్దు.. మీ సొంత గ్రామాల్లోనే పనులు కల్పిస్తామని డ్వామా ఏపీవో కాలిక్ రెండు చేతులెత్తి వేడుకున్నారు.
ఇక్కడే పనులు కల్పిస్తాం ఫ చేతులెత్తి వేడుకున్న ఏపీవో
కోసిగి, సెప్టెంబరు 23 (ఆంధ్రజ్యోతి): దయచేసి వలసలు వెళ్ల వద్దు.. మీ సొంత గ్రామాల్లోనే పనులు కల్పిస్తామని డ్వామా ఏపీవో కాలిక్ రెండు చేతులెత్తి వేడుకున్నారు. ఈ ఘటన కోసిగి ఆర్టీసీ బస్టాండులో బుధవారం చోటుచేసుకుంది. మండలంలోని కామనదొడ్డి తదితర గ్రామాల నుంచి కొంతమంది వ్యవసాయ కూలీలు కుటుంబాలతో కలిసి కర్ణాటకకు వలస వెళ్లేందుకు సిద్ధమయ్యారు. వలస కూలీల వాహనాలు కోసిగి బస్టాండులో ఉన్న విషయం తెలుసుకున్న ఏపీవో అక్కడికి చేరుకున్నారు. వలస వెళ్లకుండా స్థానికంగానే ఉపాధి పనులు కల్పిస్తామని సూచించారు. గ్రామాల్లోనే పనులు చేసుకుంటూ పిల్లలను పాఠశాలలకు పంపించాలని కోరారు. కర్ణాటకలో రైతుల వద్ద ముందస్తుగా ఒక్కో కుటుంబానికి రూ.20వేల నుంచి రూ.25వేల వరకు తీసుకున్నామని కూలీలు తెలిపారు. వారి ఆర్థిక పరిస్థితిని అర్థం చేసుకున్న ఏపీవో మాట్లాడుతూ మీ పిల్లల చదువులు, భవిష్యత్తు గురించి కూడా ఆలోచించాలని, వారి జీవితాలను నాశనం చేయవద్దని, ఇక్కడే ఉండాలని వేడుకున్నారు. తాము ఇప్పటికే డబ్బు తీసుకున్నామని, పనులు పూర్తయిన తర్వాత తిరిగి వచ్చి ఉపాధి పనులు చేసుకుంటామని కూలీలు తెలిపారు.