జనగణనలో పొరపాట్లు చేయకండి
ABN , Publish Date - Mar 27 , 2026 | 12:24 AM
జనగణన-2027 ప్రక్రియలో అధికారులు పొరపాట్లు చేయొద్దని కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి అన్నారు.
కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి
కర్నూలు ఎడ్యుకేషన, మార్చి 26(ఆంధ్రజ్యోతి): జనగణన-2027 ప్రక్రియలో అధికారులు పొరపాట్లు చేయొద్దని కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి అన్నారు. గురువారం స్థానిక జి.పుల్లయ్య ఇంజనీరింగ్ కాలేజీలో జనగణన తొలిదశలో నిర్వహించనున్న గృహ జాబితా జనగణన కార్యక్రమానికి సంబంధించిన ఫీల్డ్ ట్రైనర్స్ అధికారులకు శిక్షణ కార్యక్రమం జరిగింది. కలెక్టర్ మాట్లాడుతూ శిక్షణలో బోధించిన ప్రతి అంశాన్ని స్పష్టంగా అర్థం చేసుకుని అమలు చేయాలన్నారు. ఏమైనా సందేహాలుంటే వెంటనే నివృత్తి చేసుకోవాలన్నారు. ఎన్నికల నిర్వహ ణకు ఎంత ప్రాధాన్యం ఉంటుందో అదే స్థాయిలో జనగణన ప్రక్రి యకు కూడా ప్రాముఖ్యత ఉందన్నారు. హౌసింగ్ మ్యాపింగ్ ప్రక్రియ ను పకడ్బందీగా నిర్వహించాలన్నారు. ప్రతి ఇంటిని ఖచ్చితంగా గుర్తించి ఎటువంటి పొరపాట్లు లేకుండా మ్యాపింగ్ చేయాలని ఆదే శించారు. హ్యాండ్స్-అండ్ ట్రైనింగ్ ద్వారా పొందిన అనుభవాన్ని సమర్థవంతంగా ఉపయోగించుకోవాలని సూచించారు. ఫీల్డ్ ట్రైనర్స్ గా ఉన్న ఉపాధ్యాయులు తమ కింద పని చేసే ఇన్యుమరేటర్లకు సమగ్ర శిక్ష అందించి కింది స్థాయిలో ఖచ్చితంగా పర్యవేక్షణ చేయా లని ఆదేశించారు. కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి వెంకట నారాయణమ్మ, సెన్సెస్ అధికారి దీపక్ భరద్వాజ్ పాల్గొన్నారు.
కల్తీ ఆహారంపై తనిఖీలు నిర్వహించాలి: కల్తీ ఆహారంపై తనిఖీలు నిర్వహించి ప్రజారోగ్యాన్ని కాపాడాలని కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి ఆహార భద్రత అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ కార్యాలయంలో కర్నూలు జిల్లాలో ప్రజల ఆరోగ్యమే ప్రాధాన్యతగా తనిఖీల నిర్వహణకు సంబంధించి కార్యాచరణ ప్రణాళిక అమలుపై కలెక్టర్ సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ రెస్టారెంట్లలో బిర్యానీలలో కలర్లు కలపడం, అమ్ముడుపోని చికెన బిర్యానీ, చికెన ఫ్రైను ఫ్రిజ్‌లో పెట్టి, మరుసటి రోజు వేడి చేసి వినియోగదారులకు ఇవ్వకూడదన్నారు. వాడిన నూనెను మళ్లీ మళ్లీ వేడి చేసి వాడటం, స్ర్టీట్ ఫుడ్‌కు కలర్లు, చైనీస్ సాల్ట్ కలపడం వంటివి చేయకుండా నిరంతరం తనిఖీలు చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ రాజా గోపాల్, అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ కూర్మ పాల్గొన్నారు.