మా గ్రామాల్లోకి రావొద్దు..!
ABN , Publish Date - Jan 05 , 2026 | 12:21 AM
ఆదోని-2 మండలంలోని పెద్దహరివాణం గ్రామ ప్రజలు సంచలన నిర్ణయం తీసుకున్నారు.
రాజకీయ పార్టీలకు పెద్దహరివాణం ప్రజల హుకుం
ఆదోని రూరల్, జనవరి 4 (ఆంధ్రజ్యోతి): ఆదోని-2 మండలంలోని పెద్దహరివాణం గ్రామ ప్రజలు సంచలన నిర్ణయం తీసుకున్నారు. అతి పెద్ద గ్రామంగా కొనసాగుతున్న పెద్దహరివాణంను మండలంగా ప్రకటించే వరకూ ఏ ఒక్క రాజకీయ పార్టీ నాయకుడికి తమ ప్రాంతంలో అడుగు పెట్టడానికి అర్హత లేదంటూ ఏకంగా ఓ బోర్డును పెట్టారు. ఈ బోర్డు ఏర్పాటులో గ్రామానికి చెందిన ప్రజలంతా ఏకమై నిర్ణయం తీసుకోవడం విశేషం. ‘పెద్దహరివాణాన్ని మండలంగా ప్రకటించేంతవరకు మా గ్రామంలోకి ఏ రాజకీయ పార్టీ నాయకులు రాకూడదు..’ అని గ్రామ శివారులో బోర్డును ఏర్పాటుచేశారు. ఆందోళనలో భాగంగా ఆదివారం గ్రామానికి చెందిన పలువురు మండల ఏర్పాటు కోసం నిరాహార దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా మండల సాదన కమిటీ అధ్యక్షుడు ఆదినారాయణ రెడ్డి, మధులు మాట్లాడుతూ... ఏ పార్టీ రాజకీయ నాయకుడు తమ గ్రామంలోకి రావడానికి వీల్లేదని హుకుం జారీ చేశారు. తమ గ్రామాన్ని మండలంగా ప్రకటించి గెజిట్ నోటిఫికేషన్ వదిలి ఇప్పుడు ఆదోని-1, ఆదోని-2 మండలాలుగా ప్రకటించడం దారుణమన్నారు. కావున నాయకులు తమను, తమ గ్రామాన్ని మోసం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.