Share News

కుడా ఆస్తులతో వ్యాపారం..!

ABN , Publish Date - Jul 20 , 2026 | 12:01 AM

పశు పరిశోధన క్షేత్రం అది.. ఒకనాడు ఆవుల మందలు.. పాడి పశువులు, ఆంబోతులతో కళకళలాడేది.

కుడా ఆస్తులతో వ్యాపారం..!

బనవాసి జెర్సీ పశు క్షేత్రంలో స్మార్ట్‌ టౌన్‌ షిప్‌

వైసీపీ హయాంలో 110 ఎకరాల్లో ప్లాట్లు

రూ.41.63 కోట్లతో వెంచర్‌ అభివృద్ధికి శ్రీకారం

త్వరంలో శంకుస్థాపనకు కుడా అధికారులు సన్నాహాలు

‘కుడా’కు వచ్చే ఆదాయం రూ.33.71 కోట్లు

పశు పరిశోధన క్షేత్రం అది.. ఒకనాడు ఆవుల మందలు.. పాడి పశువులు, ఆంబోతులతో కళకళలాడేది. అదే బనవాసి జెర్సీ పశు క్షేత్రం. మేలు జాతి పశు సంతతిని అభివృద్ధి చేయడం, పశువుల్లో పాడి దిగుబడి సామర్థ్యం పెండమే ఈ క్షేత్రం ప్రధాన ఆశయం. పాతికేళ్లుగా పాలకుల నిర్లక్ష్యానికి గురవుతోంది. పశు క్షేత్రం అభివృద్ధికి పాటు పడాల్సిన ప్రభుత్వమే స్థిరాస్తి వ్యాపారానికి సై అంటుంది. పశువుల మందలు ఉండాల్సిన చోట అపార్ట్‌మెంట్లు నిర్మాణాలకు రహదారులు వేస్తున్నారు. గత వైసీపీ ప్రభుత్వం హయాంలో ‘జగనన్న స్మార్ట్‌ టౌన్‌షిప్‌’ ఏర్పాటు చేస్తే.. కూటమి ప్రభుత్వం వచ్చాక ‘ఎన్టీఆర్‌ స్మార్ట్‌ టౌన్‌షిప్‌’గా పేరును మార్చారు. కుడా ఆధ్వర్యంలో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారానికి సై అంటున్నారు.

కర్నూలు, జూలై 19 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఎమ్మిగనూరు మండలం బనవాసి వద్ద 1975-76లో ‘బనవాసి జెర్సీ పశు క్షేత్రం’ స్థాపించారు. బళ్లారి - జడ్జర్ల వయా ఆదోని, ఎమ్మిగనూరు ప్రధాన జాతీయ రహదారి-126 పక్కనే సుమారుగా 2 వేల ఎకరాల్లో ఈ క్షేత్రం విస్తరించింది ఉంది. జెర్సీ జాతి రకం ఆవులు, మేలు జాతి పశు సంతతి అభివృద్ధి, పాడి దిగుబడి సామర్థ్యం పెంచడం ఈ క్షేత్రం ప్రధాన ఆశయం. పాతికేళ్లు వెనక్కి వెళితే.. వేలాది ఆవులు, పాడి గేదేలు, ఆంబోతులు, వాటి ఆరోగ్య సంరక్షణ, పోషణ కోసం శ్రమించే పశు వైద్యులు, ఉద్యోగులు, సిబ్బందితో కళకళలాడేది. పశులకు అవసరమైన పుశు గ్రాసం పెంచుతుండడంతో నిత్యం పచ్చధనం కనిపించేంది. ఆ తరువాత పాలకుల నిర్లక్ష్యానికి గురై.. క్షిణదశకు చేరుకుంది. ప్రస్తుతం 1986లో స్థాపించిన ఘనీకృత వీర్యోత్పత్తి కేంద్రం (సెమెన్‌ బ్యాంక్‌) ఒక్కటే ఉంది. వృథాగా ఉన్న ఆ భూముల్లో ఇప్పటికే కేంద్రీయ నవోదయ విద్యాలయం, ఏపీ గురుకుల పాఠశాల, జూనియర్‌ కళాశాల, శ్రీవెంకటేశ్వర వెటర్నరీ పాలిటెక్నిక్‌ కళాశాల, గొర్రెలు, మేకలు పరిశోధన కేంద్రం. కృషి విజ్ఞాన కేంద్రం.. వంటి ప్రభుత్వ రంగ సంస్థలు ఏర్పాటు చేశారు. వాటి కోసం దాదాపు 600 ఎకరాలు కేటాయించారు. నవోదయ విద్యాలయానికి ఎదురుగా దాదాపు వంద ఎకరాల్లో ఏపీఐఐసీ ఆధ్వర్యంలో టెక్స్‌టైల్స్‌ పార్క్‌ (ఎంఎస్‌ ఎంపీ పార్క్‌) అభివృద్ధి చేస్తున్నారు. ఇంత వరకు భాగానే ఉన్నా.. భవిష్య త్తులో ప్రభుత్వ రంగ సంస్థలకు ఉప యోగ పడే జెర్సీ పశు క్షేత్రం భూము ల్లో ప్రభుత్వమే రియల్‌ ఎస్టేట్‌ వ్యాపా రాలకు శ్రీకారం చుట్టింది. వైసీపీ ప్రభుత్వ హయాంలో ‘కుడా’ ఆధ్వ ర్యంలో స్మార్ట్‌ టౌన్‌షిప్‌ ఏర్పాటు చేస్తే, కూటమి ప్రభుత్వం కూడా అదే బాట లో పయనించడం విమర్శలకు తావిస్తుంది.

పశు రక్షేతంలో కుడా రియల్‌ వెంచర్‌

బనవాసి జెర్సీ పశు రక్షేతం భూముల్లో 2001-02లో ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ సీఎం చంద్రబాబు ప్రభుత్వం దాదాపు రూ.12 కోట్లు ‘రూరల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ డెవలప్‌మెంట్‌ ఫండ్‌ (ఆర్‌ఐడీఎఫ్‌)’ నిధులతో ఎర్రచందనం, టేకు, తపస్వి, నీలిగిరి, మామిడి, చింత వంటి అరుదైన వనాలు, ఆయుర్వేధ మొక్కలు పెంచారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో పచ్చదనం విధ్వంసం చేసి 110.10 ఎకరాల్లో జగనన్న స్మార్ట్‌ టౌన్‌షిప్‌ వెంచర్లు వేశారు. ప్రభుత్వ భూముల్లో ప్రభుత్వమే రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారాలు చేయడం అప్పట్లో పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేశారు. అయినా.. నాటి ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోకుండా కుడా ఆధ్వర్యంలో ప్లాట్ల విక్రయాలకు శ్రీకారం చుట్టారు. దాదాపు 125 ప్లాట్లు అప్పట్లోనే ఆన్‌లైన్‌ లాటరీ ద్వారా విక్రయాలు చేశారు. అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ నాయకులు పశు క్షేత్రంలో ప్లాట్లు వేసి విక్రయాలు చేపట్టడాన్ని పూర్తిగా వ్యతిరేఖించారు.

రూ.41.63 కోట్లతో టౌన్‌షిప్‌ అభివృద్ధి

బనవాసి స్మార్ట్‌ టౌన్‌షిప్‌లో మౌలిక వసతుల కల్పన కోసం 2023-24లో రూ.38.50 కోట్లతో టెండర్లు పిలిచారు. హైదరాబాద్‌కు చెందిన సింగన్‌ ప్రాజెక్ట్‌ లిమిటెడ్‌ సంస్థ టెండరు దక్కించుకుంది. అప్పటి వైసీపీ పాలకులు పెద్దఎత్తున వాటాలు డిమాండ్‌ చేయడం, పనులు చేస్తే బిల్లులు వస్తాయో రావో..? అనే భయంతో కాంట్రాక్టర్‌ పనులు చేపట్టలేదని తెలుస్తుంది. కూటమి ప్రభుత్వం వచ్చాక ఎన్టీఆర్‌ స్మార్ట్‌ టౌన్‌షిప్‌గా పేరు మార్చేరే తప్ప రెండేళ్లుగా అభివృద్ధికి నోచుకోలేదు. ఎట్టకేలకు కుడా పాలకవర్గం, అధికారులు పాత కాంట్రాక్ట్‌ సంస్థ సింగన్‌ ప్రాజెక్ట్‌ లిమిటెడ్‌ యాజమాన్యాన్ని ఒప్పించి రూ.41.63 కోట్లతో టౌన్‌షిప్‌ అభివృద్ధి పనులు చేపట్టేందుకు సన్నాహాలు చేస్తున్నారు. కుడా చైర్మన్‌ సోమిశెట్టి వెంకటేశ్వర్లు టౌన్‌షిప్‌ను పరిశీలించారు. ప్రధానంగా రూ.24.53 కోట్లతో 10.3 కిలోమీటర్లు బీటీ, సీసీ రోడ్లు, ఫుట్‌పాత్‌లు, సింగిల్‌ ఆర్మ్‌ ఎలక్ర్టికల్‌ సిస్టమ్‌, రూ.3.27 కోట్లతో 24 కిలోమీటర్లు స్మార్ట్‌ వాటర్‌ డ్రెయిన్‌ నెట్వర్క్‌, రూ.8.69 కోట్లతో ఎమ్మిగనూరు పట్టణం నీటి సరఫరా హెడ్‌ వర్క్‌ నుంచి పైపులైన్‌, నీటి సరఫరా నెట్వర్క్‌, రూ.3.70 కోట్లతో 11.6 కిలో మీటర్లు అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ (యూజీడీ) సౌకర్యం, రూ.కోటి రూపాయలతో 7.65 కిలో మీటర్లు ప్రహరీ నిర్మాణం, బోర్లు తవ్వకం.. వంటి పనులు చేయనున్నారు. తాగునీటి పైపులు కూడా వచ్చాయి. ఎమ్మిగనూరు ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డి అందుబాటులో ఉన్న రోజు శంకుస్థాపన చేసేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ నెల 25న సీఎం చంద్రబాబు ఆస్పరి పర్యటన ఉండడంతో 23 లేదా 26వ తేదిల్లో శంకుస్థాపన చేసే అవకాశం ఉందని కుడా చైర్మన్‌ సోమిశెట్టి వెంకటేశ్వర్లు తెలిపారు.

కుడా ఆదాయం రూ.33.71 కోట్లు

పశు సంవర్ధక శాఖ 110 ఎకరాలు ఎకరానికి రూ.35 లక్షలు చొప్పున కర్నూలు అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (కుడా)కు అప్పగిస్తూ గత వైసీపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 60 అడుగులు ప్రధాన బీటీ రోడ్డు, 40 అడుగుల ఇంటర్నల్‌ సీసీ రోడ్లు, డ్రైనేజీ, విద్యుత్‌, ఉద్యానవనాలు (పార్కులు) వంటి మౌళిక సౌకర్యాలకు ఎకరాకు 51 సెంట్లు పోతే.. 49 సెంట్లలో పాట్లు వేశారు. 110 ఎకరాల్లో 1,100 ప్లాట్లతో స్మార్ట్‌ టౌన్‌షిప్‌ వెంచరు వేశారు. మూడు కేటగిరీలుగా మూడు సెంట్లు ప్లాట్లు, 450, నాలుగు సెంట్ల ప్లాట్లు 460, ఐదు సెంట్ల ప్లాట్లు 190 ప్లాట్లు వేశారు. గత ప్రభుత్వం సెంటు రూ.2.75 లక్షలు ధర నిర్ణయించింది. ఈ ప్రకారం ప్లాట్లు అమ్మకాలు చేస్తే కుడాకు రూ.113.85 కోట్లు వరకు వస్తుంది. అందులో ఎకరం రూ.35 లక్షలు చొప్పున రూ.38.50 కోట్లు పశు సంవర్ధక శాఖకు, మౌళిక వసతుల కల్పనకు రూ.41.63 కోట్లు ఖర్చు చేసినా, కుడా రూ.33.71 కోట్లు ఆదాయం వస్తుందని రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు అంచనా వేస్తున్నారు. ఇది కాదని, జాతీయ రహదారికి అనుకోని వాణిజ్య అవసరాల కోసం కొంత భూమిని కేటాయించారు. ఆ భూమిని ప్లాట్లు వేసి విక్రయిస్తే కుడాకు వచ్చే ఆదాయం మరింత పెరిగే అకాశం ఉంది.

టెండర్‌ ద్వారా ప్లాట్ల కేటాయింపు

లాటరీ విధానంలో ప్లాట్లు కేటాయిస్తుండడంతో ప్రజలు ఆసక్తి చూపడం లేదు. మొత్తం ప్లాట్లను మూడు కేటగిరీలు విభజిస్తారు. జాతీయ రహదారి, ప్రధాన రోడ్డుకు దగ్గరగా ఉండే ప్లాట్ల ధరలను 15-20 శాతం పెంచనున్నారు. లాటరీ విధానం కాకుండా ఆన్‌లైన్‌ టెండర్లు ద్వారా ప్లాట్లు కేటాయించే విధానం అమలు చేయనున్నారు. కుడా నిర్ణయించిన ధర కంటే ఆన్‌లైన్‌లో ఎవరు ఎక్కువ ధర కోడ్‌ చేస్తారో వారికే ఆ ప్లాట్‌ కేటాయించేలా నిబంధనలు సడలిస్తున్నట్లు జాయింట్‌ కలెక్టర్‌, కుడా వైస్‌ చైర్మన్‌ నూరుల్‌ ఖమర్‌ ఆంధ్రజ్యోతికి వివరించారు. ఉదా: ప్రధాన రోడ్డు పక్కన కార్నర్‌ ప్లాట్‌ చదరపు అడుగు రూ.6 వేలు కుడా ధర నిర్ణయించింది అనుకుందాం. ఆ ప్లాట్‌ కోసం ఆన్‌లైన్‌ పోటీ పడి అత్యధికంగా ఒక వ్యక్తి చదరపు అడుగు రూ.10 వేలకు ధర కోడ్‌ చేశారనుకుంటే ఆ వ్యక్తే ఆ ప్లాట్‌ కేటాయిస్తారు. దీని వల్ల కుడా ఆదాయం, కొనుగోలుదారులకు కోరుకున్న ప్లాట్‌ దక్కే అవకాశం ఉంది.

Updated Date - Jul 20 , 2026 | 12:01 AM