కోసిగిలో కుక్కల బెడద
ABN , Publish Date - May 04 , 2026 | 12:09 AM
మండల కేంద్రమైన కోసిగిలో వీధి కుక్కలు స్వైర్య విహారం చేస్తున్నాయి. ఎప్పుడు ఎటువైపు నుంచి కుక్కలు దాడి చేస్తాయో తెలియక ప్రయాణికులు, పాదచారులు వణికిపోతున్నారు.
ఒక్క నెలలోనే 140 మందిపై దాడి
భయం గుప్పిట్లో ప్రజలు
కోసిగి, మే 3(ఆంధ్రజ్యోతి): మండల కేంద్రమైన కోసిగిలో వీధి కుక్కలు స్వైర్య విహారం చేస్తున్నాయి. ఎప్పుడు ఎటువైపు నుంచి కుక్కలు దాడి చేస్తాయో తెలియక ప్రయాణికులు, పాదచారులు వణికిపోతున్నారు. గత నెల రోజుల్లోనే సుమారు 120 నుంచి 140 మంది కుక్కకాటుకు గురై ఆసుపత్రి పాలయ్యారని వైద్యులు పేర్కొంటున్నారు. కోసిగిలోని ప్రధాన రహదారులు, మార్కండేయస్వామి ఆలయం, చౌడమ్మ వీధి, నాడిగేని కాలనీ, అలకూరప్ప మఠం, కింద మారెమ్మ ఆలయం కాలనీల్లో కుక్కలు గుంపు లు గుంపులుగా తిరుగుతున్నాయి. ప్రధాన రోడ్డుపై మటన్, చికెన్‌షాపుల ముందు ముఖ్యంగా ద్విచక్ర వాహనదా రులను వెంటాడి కరుస్తున్నాయి. చిన్నపిల్లలు, వృద్ధులు బయటకు రావాలంటేనే జంకుతున్నారు. కుక్కల దాడిలో గాయపడిన వారు ప్రభుత్వ ఆసుపత్రితో పాటు ప్రైవేట్ క్లినిక్‌లకు క్యూ కడుతున్నారు. సాధారణంగా అక్కడక్కడా కుక్క కాటు కేసులు నమోదు కావడం సహజమే అయినా కోసిగిలో మాత్రం ఈ సంఖ్య ఆందోళన కలిగిస్తోంది. ఒక్క నెలలోనే 140 కేసులు నమోదు కావడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఆసుపత్రికి వస్తున్న బాధితుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోందని వైద్యవర్గాలు చెబుతున్నారు. పత్రికల్లో వార్తలు వస్తున్నా, ప్రజలు మొరపెట్టుకుంటున్నా అధికారులు మాత్రం తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారని స్థానికులు మం డిపడుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి కుక్కల బెడద నుంచి తమను కాపాడాలని ప్రజలు కోరుతున్నారు.
కుక్కలను వేరే చోటుకు తరలిస్తాం
కోసిగిలో కుక్కలు అధిక సంఖ్యలో ఉన్నాయన్న మాట వాస్తవమే. త్వరలోనే కోసిగిలోని రోడ్లపై ఉన్న వీధి కుక్కలను పట్టి వేరే చోటుకు తరలిస్తాం. కుక్కలను పట్టి ప్రత్యేక వాహనంలో తరలించేలా చర్యలు తీసుకుంటాం. - ఎం.వరప్రసాద్, కోసిగి మేజర్ పంచాయతీ స్పెషల్ అధికారి