Share News

డాక్యుమెంట్‌ రైటర్ల పెన్‌డౌన్‌

ABN , Publish Date - Jul 20 , 2026 | 11:37 PM

ఉమ్మడి కర్నూలు, నంద్యాల జిల్లా వ్యాప్తంగా సబ్‌ రిజిస్ట్రేషన్‌ కార్యాలయాలు వెలవెలబోతున్నాయి.

డాక్యుమెంట్‌ రైటర్ల పెన్‌డౌన్‌
వెలవెలబోతున్న సబ్‌ రిజిస్ర్టార్‌ కార్యాలయం

జిల్లా వ్యాప్తంగా సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలు వెలవెల

రిజిస్ట్రేషన్లకు అంతరాయం..ప్రభుత్వ ఆదాయానికి గండి

సేవలు అందక వెనక్కిపోతున్న ప్రజలు

రిజిస్ట్రేషన్‌ సేవా కేంద్రాల జీవో. 396ను ఉప సంహరించాలని డిమాండ్‌

ఉమ్మడి కర్నూలు, నంద్యాల జిల్లా వ్యాప్తంగా సబ్‌ రిజిస్ట్రేషన్‌ కార్యాలయాలు వెలవెలబోతున్నాయి. ప్రభుత్వం జారీ చేసిన జీవో. 396ను తక్షణమే ఉపసంహరించు కోవాలని డాక్యుమెంట్‌ రైటర్లు ఆందోళన బాట పట్టారు. జిల్లా వ్యాప్తంగా ఈనెల 20 నుండి 31 వరకు ప్రభుత్వ జీవో. 396కు వ్యతిరేకంగా డాక్యుమెంట్‌ రైటర్లు పెన్‌డౌన్‌ కార్యక్రమానికి పిలుపునిచ్చారు. దీంతో జిల్లా వ్యాప్తంగా సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్‌ సేవలు తీవ్రంగా ప్రభావితమవుతున్నాయి.

-కల్లూరు, జూలై 20 (ఆంధ్రజ్యోతి)

విధులకు దూరంగా డాక్యుమెంట్‌ రైటర్లు

డాక్యుమెంట్‌ రైటర్లు విధులకు దూరంగా ఉండటంతో ఉమ్మడి కర్నూలు, నంద్యాల జిల్లాల వ్యాప్తంగా సబ్‌ రిజిస్ర్టార్‌ కార్యాలయాలు బోసిపోయాయి. ఏళ్ల తరబడి డాక్యుమెంట్‌ రైటర్లపై ఆధారపడిన సబ్‌ రిజిస్ర్టార్‌ కార్యాలయాల్లో సేవలు గగనమయ్యాయి. రిజిస్ర్టేషన్‌ కోసం వచ్చిన ప్రజలు వేచి చూసి పనులు జరగక నిరాశతో వెనుతిరుగుతున్నారు. వినియోగదారులు సొంతంగా రిజిస్ర్టేషన్‌ కోసం డాక్యుమెంట్లు తయారు చేసుకుని రిజిస్ర్టేషన్‌ చేసుకునే అవకాశం ఉన్నా అధికారులు ఆ దిశగా అవగాహన కల్పించక పోవడంతో ప్రజలకు అవస్థలు తప్పడం లేదు. సబ్‌ రిజిస్ర్టార్‌ కార్యాలయాల్లో అందుకు అవసరమైన సాంకేతిక మౌలిక సదుపాయాలు, శిక్షణ మార్గదర్శక వ్యవస్థను పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకురాకపోవడంతో ప్రజల్లో అయోమయం నెలకొంది. పీడీ(పబ్లిక్‌ డాటా ఎంట్రీ), ఆన్‌లైన్‌ ద్వారా పత్రాలు సిద్ధం చేసి రిజిస్ర్టేషన్‌కు వెళ్లే విధానం అచరణలో సరిగా అమలు కాకపోవడంతో సమస్య మరింత తీవ్రంగా మారింది.

అరకొరగా ప్రత్యామ్నాయం.....ప్రభుత్వ ఆదాయానికి గండి

స్టాంపులు రిజిస్ర్టేషన్ల శాఖ ఉన్నతాధికారులు సబ్‌ రిజిస్ర్టార్‌ కార్యాలయాల్లో ప్రత్యామ్నాయ ఏర్పాటు కల్పిచడంలో ఘోరంగా విఫలం అయ్యారని ప్రజలు ఆరోపిస్త్తున్నారు. స్థిరాస్తుల రిజిస్ర్టేషన్‌ కోసం సెలవులు పెట్టుకుని వచ్చిన వినియోగదారులు పనులు కాక వెనుదిరగాల్సి వచ్చింది. కర్నూలు జిల్లాలో 400-450, నంద్యాల జిల్లాలో 350-400 రిజిస్ర్టేషన్లు జరిగేవని, ఉమ్మడి జిల్లాలో ప్రతి రోజు దాదాపు 2.5 నుండి 3 కోట్లు ప్రభుత్వానికి ఆదాయం సమకూరేదని సమాచారం. రోజువారీ రిజిస్ర్టేషన్లు భారీగా తగ్గడంతో ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతున్నట్లు తెలుస్తోంది.

డేటా ఎంట్రీ కేంద్రాల ఏర్పాటు: డాక్యుమెంట్‌ రైటర్ల పెన్‌డౌన్‌ కారణంగా రిజిస్ర్టేషన్‌ సేవలకు అంతరాయం కలగకుండా సబ్‌ రిజిస్ర్టార్‌ కార్యాలయాల్లో డేటాఎంట్రీ కేంద్రాలకు అందుబాటులోకి తెచ్చామని ఆ శాఖ డిప్యూటీ ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌ కిరణ్‌కుమార్‌ ఒక ప్రకటనలో తెలిపారు. ఈమేరకు ఆయా సబ్‌ రిజిస్ర్టార్‌ కార్యాలయాల్లో డేటా ఎంట్రీ, స్లాట్‌ బుకింగ్‌ మొదలైన అన్ని రకాల సేవను అందించేందుకు ప్రత్యేకంగా కౌంటర్లు ఏర్పాటు చేశామన్నారు. రిజిస్ర్టేషన్‌ సేవల్లో ఏమైనా ఇబ్బందులుంటే తమ దృష్టికి తీసుకరావాలని ఆయన కోరారు.

ఉపాధిని దూరం చేయవద్దు

స్థిరాస్తి రిజిస్ర్టేషన్లు సవ్యంగా జరిగేలా వినియోగదారులకు ఏళ్ల తరబడి సేవలు అందిస్తున్న డాక్యుమెంట్‌ రైటర్ల ఉపాధిని దూరం చేయవద్దని కర్నూలు డాక్యుమెంట్‌ రైటర్ల సంక్షేమ సంఘం నాయకులు కోరుతున్నారు. రిజిస్ర్టేషన్‌ సేవాకేంద్రాల ఏర్పాటుకు ప్రభుత్వం ఇచ్చిన జీవో.396ను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. అందులో భాగంగా సోమవారం నుండి డాక్యుమెంట్‌ రైటర్లు ఈనెల 31 వరకు పెన్‌డౌన్‌కు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో గౌరవ అధ్యక్షుడు ఎస్‌.ఏ. రహమాన్‌, అధ్యక్షుడు మహమ్మద్‌రఫీ, రామకృష్ణ, చందు, హనుమంతరావు, శేషు, మస్తాన్‌సాహెబ్‌ తదితరులు ఉన్నారు.

Updated Date - Jul 20 , 2026 | 11:37 PM