మధ్యాహ్నం ఓపీలో ఉండాల్సిందే
ABN , Publish Date - Jan 14 , 2026 | 12:33 AM
బోధనాసుపత్రుల్లో మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఓపీలో ప్రొఫెసర్లు, వైద్యులు ఖచ్చితంగా ఉండి సేవలు అందించాలని డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (డీఎంఈ) డా.జి. రఘునందన్ ఆదేశించారు.
పేపర్ లెస్ విధానం వంద శాతం జరగాలి
డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ రఘునందన్
కర్నూలు హాస్పిటల్, జనవరి 13 (ఆంధ్రజ్యోతి): బోధనాసుపత్రుల్లో మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఓపీలో ప్రొఫెసర్లు, వైద్యులు ఖచ్చితంగా ఉండి సేవలు అందించాలని డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (డీఎంఈ) డా.జి. రఘునందన్ ఆదేశించారు. మంగళవారం ఆయన కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలను తనిఖీ చేశారు. అనంతరం కర్నూలు మెడికల్ కాలేజీలోని కౌన్సిల్ హాలులో వివిధ విభాగాల అధిపతులతో ప్రిన్సిపాల్ డా.కే. చిట్టినరసమ్మ అధ్యక్షతన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎంఈ మాట్లాడుతూ అన్ని ప్రభుత్వ బోధనాసుపత్రులు, మెడికల్ కాలేజీలో ఈ-ఆఫీసు, రోగులకు సంబంధించిన డిజిటలైజేషన్ పూర్తి చేయాలని ఆదేశించారు. అలాగే ఆసుపత్రులో ఫార్మసీ, ల్యాబ్‌లు డిజిటైలేజేషన్ చేయాలని, అన్ని ఆన్‌లైన్‌లో జరగాలన్నారు. పేపర్‌లెస్ పని విధానం వంద శాతం జరగాలనే ప్రభుత్వ లక్ష్యాన్ని సాధించాలని అన్నారు. ప్రతిరోగికి ఒక ఐడీని కేటాయిస్తున్నామనీ, అందులో రోగికి అందించే వైద్య ప్రక్రియను అప్‌లోడు చేయడం వల్ల వైద్యుల పనితీరును పర్యవేక్షించవచ్చునని అన్నారు.
సెక్యూరిటీ ఏజెన్సీకి షోకాజ్ నోటీసు:
ఆసుపత్రిలో ఉదయం షిప్టులో ఉండాల్సిన 100 మంది సెక్యూరిటీ సిబ్బందికిగాను 81 మంది మాత్రమే ఉన్నారని, దీనిపై ఈగల్ హంటర్ ఏజెన్సీకి షోకాజ్ నోటీసు జారీ చేయాలని డీఎంఈ ఆదేశించారు. అలాగే ఎస్‌పీటీ నిర్వహణ కోసం 2 సంవత్సరాల ప్రాతిపదికన సిబ్బందికి కంప్యూటర్లు కొనుగోలుకు అనుమతులు జారీ చేశామన్నారు. ఈ సమీక్షలో కర్నూలు జీజీహెచ్ సూపరింటెండెంట్ డా.కే. వెంకటేశ్వర్లు, కంటి ఆసుపత్రి సూపరింటెండెంట్ డా.ఎం. సత్యనారాయణ రెడ్డి, వైస్ ప్రిన్సిపాల్ డా. విజయానందబాబు పాల్గొన్నారు.