వైద్యులకు నైపుణ్య శిక్షణ అవసరం
ABN , Publish Date - Sep 11 , 2026 | 11:23 PM
వైద్యులకు నైపుణ్య శిక్షణ అవసరమని కర్నూలు మెడికల్ కాలేజీ ఇన్‌చార్జి ప్రిన్సిపాల్ డాక్టర్ పి.హరిచరణ్ అన్నారు.
కేఎంసీ ఇన్‌చార్జి ప్రిన్సిపాల్ డాక్టర్ హరిచరణ్
ప్రారంభమైన రాష్ట్ర ఈఎన్‌టీ వైద్యుల సదస్సు
కర్నూలు హాస్పిటల్, సెప్టెంబరు 11(ఆంధ్రజ్యోతి): వైద్యులకు నైపుణ్య శిక్షణ అవసరమని కర్నూలు మెడికల్ కాలేజీ ఇన్‌చార్జి ప్రిన్సిపాల్ డాక్టర్ పి.హరిచరణ్ అన్నారు. కర్నూలు మెడికల్ కాలేజీలో 44వ రాష్ట్ర ఈఎన్‌టీ వైద్యుల సదస్సు శుక్రవారం ప్రారంభమైంది. కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ కె.వెంకటేశ్వర్లు సూక్ష్మమైన ఎండోస్కోపి శస్త్ర చికిత్స విధానాన్ని పరిశీలించారు. అనంతరం ఇన్‌చార్జి ప్రిన్సిపాల్ డా.పి.హరిచరణ్ సదస్సును పరిశీలించారు. మొదటి రోజు 5 అంశాలపై వర్క్‌షాపును నిర్వహించినట్లు ఈఎన్‌టీ వైద్యుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డా.బి.జయప్రకాష్ రెడ్డి, ఆర్గనైజింగ్ చైర్మన్ డా.పి.హరికృష్ణ, కోశాధికారి డా.ఎం.మహేంద్ర కుమార్ తెలిపారు. గొర్రెతలపై ఎండోస్కోపిక్, గొర్రె ఊపిరితిత్తులు, కృత్రిమ నమూనాలపై బ్రాంకోస్కోపి, గొర్రె తలపై నియంత్రణ కణజాల తొలగింపు కృత్రిమ నమూనాలపై సైలెండోస్కోపి లాలాజల గ్రంథులకు సంబంధించిన సమస్యలకు పెద్ద కోతలు లేకుండా సూక్ష్మమైన ఎండోస్కోప్ సహాయంతో ఆపరేషన్ చేసే అధునాతన పద్దతులపై శిక్షణ ఇచ్చినట్లు తెలిపారు. శని, ఆదివారల్లో నగర శివారులోని కే.ఫార్చూన్ హోటల్‌లో మహాసభలు నిర్వహించనున్నట్లు తెలిపారు. 25 ఏళ్ల తర్వాత కర్నూలులో జరిగే రాష్ట్ర సదస్సుకు కర్ణాటక, ఏపీ, తెలంగాణ, తమిళనాడు నుంచి 514 మంది ఈఎన్‌టీ వైద్యులు హాజరైనట్లు తెలిపారు.