Share News

భూములిచ్చి మోసపోయాం.. న్యాయం చేయాలి

ABN , Publish Date - Jul 21 , 2026 | 12:38 AM

తమ పొలాల్లో విండ్‌ పవర్‌ (గాలి మరలు) ఏర్పాటు చేసే సమయంలో దారి రస్తాలకు పొలాలు ఇచ్చి మోసపోయామని, తమకు న్యాయం చేయాలని పెద్దహుల్తి, చిన్నహుల్తి రైతులు తహసీల్దార్‌ ఉసేన్‌ సాహెబ్‌కు మొర పెట్టుకున్నారు.

భూములిచ్చి మోసపోయాం.. న్యాయం చేయాలి
తహసీల్దార్‌తో వాగ్వాదం చేస్తున్న రైతులు

తహసీల్దార్‌తో రైతుల వాగ్వాదం

పత్తికొండ టౌన్‌, జూలై 20 (ఆంధ్రజ్యోతి): తమ పొలాల్లో విండ్‌ పవర్‌ (గాలి మరలు) ఏర్పాటు చేసే సమయంలో దారి రస్తాలకు పొలాలు ఇచ్చి మోసపోయామని, తమకు న్యాయం చేయాలని పెద్దహుల్తి, చిన్నహుల్తి రైతులు తహసీల్దార్‌ ఉసేన్‌ సాహెబ్‌కు మొర పెట్టుకున్నారు. స్థానికంగా జరిగిన స్పందన కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు వెంకటరామిరెడ్డి ఆధ్వర్యంలో పెద్దహుల్తి, చిన్నహుల్లి రైతులు విన్నవించారు. ఈ సందర్భంగా రైతులకు, తహసీల్దార్‌కు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. రైతులు మాట్లాడుతూ.. 2016లో పెద్దహుల్తి, చిన్నహుల్తి గ్రామ పొలాల్లో మైత్ర ఎనర్జీ కంపెనీ గాలిమరలను ఏర్పాటు చేసే సమయంలో దారి కావాలంటూ తమ దగ్గరకు కంపెనీ ప్రతినిధులు వచ్చారన్నారు. అప్పుడు తమ పొలాల్లో 20 సెంట్ల నుంచి 70 సెంట్ల వరకు ఆ కంపెనీలకు ఇచ్చామని, తీరా ఇవాళ తమకున్న పొలం అంతా కూడా ఆన్‌లైన్‌లో వారి పేరుపైనే 22-ఏ (1బి) కింద భూములు చూపించడం వల్ల తీరని అన్యాయం జరిగిందని అన్నారు. కేవలం సెంట్లలో స్థలం రస్తాల కోసం ఇస్తే తమకున్న ఆ సర్వే నంబర్లపైన ఉన్న భూమిని కూడా 22-ఏ (1బి) కింద చూపించడంతో అటు పొలాలకు ఇన్సూరెన్స్‌ కట్టాలన్నా, బ్యాంకులో తీసుకున్న అప్పు రుణానికి వడ్డీ చెల్లించాలన్నా నిషేధిత భూమిగా చూపిస్తోందన్నారు. దీంతో తమకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. గతంలో కంపెనీ వాహనాలను తమకు పొలాల మీదు రాకుండా అడ్డుకున్న సమయంలో రెవెన్యూ అధికారులు తమకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారని, నెలలు గడుస్తున్నా ఇంతవరకు తమకు న్యాయం జరగలేదన్నారు. ఇప్పటికైనా న్యాయం జరగకపోతే తహసీల్దార్‌ కార్యాలయం ముందు దీక్షలకు పూనుకుంటామని హెచ్చరించారు. స్పందించిన తహసీల్దార్‌ ఉసేన్‌సాహెబ్‌ మాట్లాడుతూ న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో రైతులు శాంతించారు. రైతులు జయకృష్ణ, వీరయ్య, చంద్రన్న, వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jul 21 , 2026 | 12:38 AM