అత్యవసర సేవలకు ఇబ్బందులు కలిగించొద్దు
ABN , Publish Date - Aug 14 , 2026 | 11:52 PM
జూనియర్ డాక్టర్ల సమ్మెతో ఎట్టి పరిస్థితుల్లోనూ అత్యవసర సేవలకు ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని జీజీహెచ్ సూపరింటెండెంట్ డా.కే.వెంకటేశ్వర్లు ఆదేశించారు.
జీజీహెచ్ సూపరింటెండెంట్ డా.కే.వెంకటేశ్వర్లు
కర్నూలు హాస్పిటల్, ఆగస్టు 14 (ఆంధ్రజ్యోతి): జూనియర్ డాక్టర్ల సమ్మెతో ఎట్టి పరిస్థితుల్లోనూ అత్యవసర సేవలకు ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని జీజీహెచ్ సూపరింటెండెంట్ డా.కే.వెంకటేశ్వర్లు ఆదేశించారు. శుక్రవారం కేఎంసీ కాన్ఫరెన్స్ హాలులో జూనియర్ డాక్టర్ల సమ్మెపై వివిధ విభాగాల హెచ్‌వోడీలతో ప్రిన్సిపాల్ డా.కే.చిట్టినరసమ్మతో కలిసి ఆయన సమీక్ష నిర్వహించారు. సోమవారం నుంచి జూనియర్ డాక్టర్లు సమ్మెలో వెళ్తున్న నేపథ్యంతో సమ్మెను ఎదుర్కొవడానికి సిద్ధంగా ఉన్నట్లు ఆయన తెలిపారు. మెడిసిన్, గైనిక్, అనస్థీషియా విభాగాలతో పాటు రేడియాలజీ విభాగం ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. ఆయా విభాగాలు జాబితాను ఇవ్వాలని, దాని ప్రాతిపదికన సోమవారం లోపు రోస్టర్ తయారుచేసి రోగులకు ఓపీ, అత్యవసర సేవలకు ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేస్తామన్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఇబ్బందులు రాకూడదని అందుకు తగ్గట్లుగా సిబ్బంది పోస్టింగ్‌లు ఉండాలన్నారు. రోగులకు ఇబ్బందులు కలగకుండా వైద్యులకు సంబంధించి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ నుంచి ఆదేశాలున్నాయని కర్నూలు మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ డా.కే.చిట్టినరసమ్మ తెలిపారు. సమీక్షలో వైస్ ప్రిన్సిపాళ్లు డా.డి.శ్రీరాములు, డా.విజయానందబాబు, హాస్పిటల్ అడ్మినిస్ర్టేటర్ పి.సింధూ సుబ్రహ్మణ్యం, సీఎ్‌సఆర్‌ఎంవో డా.పి.పద్మజ, ఆర్‌ఎంవో డా.వెంకటరమణ పాల్గొన్నారు.
సెలవులు రద్దు
హౌస్ సర్జన్లు, పీజీలు సమ్మెలోకి వెళ్లడంతో సూపర్ స్పెషాలిటీ లో పని చేస్తున్న వైద్యులకు సెలవులను రద్దు చేస్తున్నట్లు సూపరింటెండెంట్ తెలిపారు. మెటర్నిటీ మినహా ఎలాంటి సెలవులు పెట్టకూడదని ఆదేశించారు. వైద్యసిబ్బందికి ఎవరికి సెలవులు అనుమతించమని, వైద్యులు ఎవరికైనా మెడికల్ లీవ్‌లు కావాలంటే వారిని మెడికల్ బోర్డుకు రెఫర్ చేస్తానని హెచ్చరించారు. సమ్మెతో మెడిసిన్ రెండు మూడు యూనిట్లు కలిపి ఒకే వార్డు ఉండేలా అవసరమైతే ఏర్పాట్లు చేసుకోవాలన్నారు.