న్యాయం చేయాలి
ABN , Publish Date - Jun 03 , 2026 | 12:21 AM
కోర్టులో కేసు ఉన్నా స్థలంలోకి రానివ్వకుండా ఆక్రమించుకునే ప్రయత్నం చేస్తున్నారని, న్యాయం చేయాలని వృద్ధ దంపతులు కోరారు. తన పేరుమీద ఉన్న స్థలాన్ని తన చెల్లెలికి మాయమాటలు చెప్పి రిజిస్ట్రేషన్ చేయించుకొని తమను స్థలంలోకి రానివ్వడం లేదంటూ పట్టణంలో వృద్ధుడు, ఆయన భార్య పెట్రోల్, పురుగుల మందుతో ఆందోళనకు దిగారు
కేసు కోర్టులో ఉన్నా టీడీపీ నాయకుడు స్థలాన్ని ఆక్రమించే ప్రయత్నం చేస్తున్నారు
పెట్రోల్, పురుగుల మందుతో వృద్ధ దంపతుల నిరసన
ఒంటిపై పెట్రోల్ పోసుకున్న వృద్ధురాలు.. అడ్డుకున్న పోలీసులు
నందికొట్కూరు, జూన్ 2 (ఆంధ్రజ్యోతి): కోర్టులో కేసు ఉన్నా స్థలంలోకి రానివ్వకుండా ఆక్రమించుకునే ప్రయత్నం చేస్తున్నారని, న్యాయం చేయాలని వృద్ధ దంపతులు కోరారు. తన పేరుమీద ఉన్న స్థలాన్ని తన చెల్లెలికి మాయమాటలు చెప్పి రిజిస్ట్రేషన్ చేయించుకొని తమను స్థలంలోకి రానివ్వడం లేదంటూ పట్టణంలో వృద్ధుడు, ఆయన భార్య పెట్రోల్, పురుగుల మందుతో ఆందోళనకు దిగారు. వృద్ధ దంపతుల కథనం మేరకు.. పట్టణానికి చెందిన సుభద్రాబాయికి ఆరుగురు సంతానం కాగా.. అందులో నలుగురు చనిపోయారు. 1982లో శేషారాంసింగ్ తల్లి సుభద్రాబాయికి ప్రభుత్వం 3 సెంట్ల స్థలం ఇచ్చింది. ఆమె 18 సంవత్సరాల క్రితం మరణించారు. 2011లో శేషారాంసింగ్ తన పేరుమీద పట్టా తీసుకున్నారు. వీరు ఇతర ప్రాంతాలకు వలస వెళ్లి వస్తుంటారు. శేషారాంసింగ్ మరో చెల్లెలు లక్ష్మీబాయి ఇక్కడే గుడిసెలో ఉంటున్నారు. అయితే ఆమెకు మాయమాటలు చెప్పి మాజీ కౌన్సిలర్, టీడీపీ నాయకుడు అబ్దుల్లా తన తండ్రి సన్నాహుల్లా పేరుపై రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. తన పేరున ఉన్న స్థలాన్ని తన చెల్లెలి ద్వారా ఎలా రిజిస్ట్రేషన్ చేయించుకుంటారని శేషారంసింగ్ కోర్టుకు వెళ్లారు. కోర్టు స్టే విధించడంతో ఆ స్థలంలో బోర్డు ఏర్పాటు చేశారు. అయితే రెండుసార్లు సన్నాహుల్లా ఆ బోర్డును తొలగించారు. కోర్టులో ఉండగా బోర్డు ఎలా తొలగిస్తారని ప్రశ్నిస్తే... ఈ స్థలం వద్దకు వస్తే చంపేస్తామని... నానా దుర్భాషలాడుతూ బెదిరింపులకు గురిచేస్తున్నారు.’ అని ఆరోపించారు. న్యాయం చేయాలని మంగళవారం శేషారాంసింగ్ ఆయన భార్య మీరాబాయి, చెల్లెలు తులసీబాయితో కలిసి ఆందోళనకు దిగారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వారి నుంచి పురుగుల మందు డబ్బాను, పెట్రోల్ బాటిల్‌ను తీసుకునే ప్రయత్నం చేశారు. మీరాబాయి పెట్రోల్ మీద పోసుకొని ఆత్మహత్యాయత్నం చేస్తుండగా పోలీసులు ఆ బాటిల్‌ను లాక్కున్నారు. వీరిని పోలీసు స్టేషన్‌కు తీసుకెళ్లి కౌన్సిలింగ్ ఇచ్చారు.