జిల్లాపై అసంతృప్తి ప్రజా సంతృప్తి ర్యాంక్ 21
ABN , Publish Date - May 08 , 2026 | 11:23 PM
ప్రభుత్వ శాఖల పని తీరు.. పౌర సేవల్లో జిల్లా వెనుకబడిందా? వివిధ శాఖల పనితీరుపై ప్రజల్లో అసంతృప్తి పెరుగుతుందా..? కలెక్టర్ల సమావేశంలో సీఎం చంద్రబాబు వెల్లడించిన అంకెలు అందుకు తార్కాణంగా నిలిచాయి.
నిరాశాజనకంగా పలు శాఖల పనితీరు
జలధార-జల హారతి పురోగతి అంతంతే
కలెక్టర్ల సమావేశంలో సీఎం చంద్రబాబు
హాజరైన మంత్రి టీజీ భరత్, కలెక్టర్ సిరి, ఎస్పీ విక్రాంత్ పాటిల్
కర్నూలు, మే 8 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ శాఖల పని తీరు.. పౌర సేవల్లో జిల్లా వెనుకబడిందా? వివిధ శాఖల పనితీరుపై ప్రజల్లో అసంతృప్తి పెరుగుతుందా..? కలెక్టర్ల సమావేశంలో సీఎం చంద్రబాబు వెల్లడించిన అంకెలు అందుకు తార్కాణంగా నిలిచాయి. ప్రభుత్వ పని తీరుపై ప్రజల సంతృప్తి (పబ్లిక్ పాజిటివ్ రెస్పాన్స్)లో జిల్లా 21వ ర్యాంక్‌తో సరిపుచ్చుకోవాల్సి వచ్చింది. కీలకమైన పలు శాఖల పనితీరుపై ప్రజల్లో అసంతృప్తి పెరిగింది. వీటిపై ఫోకస్ పెట్టి లోపాలను సరిదిద్దడం ద్వారా ప్రజా సంతృప్తిని పెంచేందుకు కలెక్టర్లు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. భూగర్భ జలాల సంరక్షణే ప్రధాన ఆశయంగా కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జలధార-జల హారతి పురోగతి అంతంతగానే ఉంది. పంచాయతీరాజ్ శాఖ అమలు చేస్తున్న ‘పల్లె పండుగ’ పనుల్లో పురోగతి సూపర్ అంటూ లెక్కలు చెబుతున్నాయి. ఆగస్టు 15 నాటికి జిల్లాలో 12 వేలకు పైగా పక్కా ఇళ్లు పూర్తి చేసి గృహ ప్రవేశాలు చేయించాలని సీఎం చంద్రబాబు లక్ష్యాలను నిర్దేశించారు. శుక్రవారం సీఎం చంద్రబాబు అధ్యక్షతన రెండో రోజు
కలెక్టర్ల సమావేశం జరిగింది. జిల్లా మంత్రి టీజీ భరత్‌గుప్త, కలెక్టర్ డాక్టర్ ఎ.సిరి, ఎస్పీ విక్రాంత్ పాటిల్ హాజరయ్యారు.
జిల్లాలో వివిధ ప్రభుత్వ శాఖల పనితీరుపై ప్రజల్లో అసంతృప్తి పెరుగుతోంది. రాష్ట్రంలో వివిధ జిల్లాలో ప్రభుత్వ శాఖల పనితీరు, సంక్షేమ పథకాల అమలు తీరుపై ప్రభుత్వం సర్వేలు చేయించింది. ప్రజా సంతృప్తిలో జిల్లా 21వ ర్యాంక్‌తో సరిపుచ్చుకోవాల్సి వచ్చింది. గతేడాది డిసెంబరు నుంచి ఫిబ్రవరి వరకు మూడు నెలల్లో ప్రజల సంతృప్తి (పాజిటివ్) 68 శాతం ఉంటే, మార్చి, ఏప్రిల్ నెలల్లో 71.1 శాతానికి పెరిగింది. అంటే.. 3.1 శాతం మెరుగుపడింది. ప్రభుత్వ అమలు చేస్తే 39 సేవలు, సంక్షేమ పథకాలు అమలు తీరుపై వివిధ సర్వేలు ద్వారా ప్రభుత్వం నివేదికలు తెప్పించుకుంది. డిసెంబరు, జనవరి, ఫిబ్రవరి మూడు నెలలతో పోలిస్తే, మార్చి, ఏప్రిల్ నెలల్లో ఉచిత బియ్యం పంపిణీ, వైద్య సేవలు, వీధిదీపాలు/తాగునీరు, పాఠశాల విద్యా, దీపం-2, మధ్యాహ్న భోజన పథకం, పారిశుద్ధ్యం, మహిళలపై పెరుగుతున్న నేరాలు, పంచాయతీ సేవలు.. వంటి కీలక సేవలపై ప్రజల్లో సంతృప్తి స్థాయిలు తగ్గుదల నమోదు చేసుకుని అసంతృప్తి పెరిగింది. దీంతో ఆయా విభాగాలపై ప్రత్యేక దృష్టి పెట్టి సేవలు మెరుగుపడేలా చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు.
జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని సద్వినియోగం చేసుకొని భూగర్భ జలాల సంరక్షణ లక్ష్యంగా కూటమి ప్రభుత్వం జలధార-జలహారతి కార్యక్రమం ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. జిల్లాలో 74 చెరువుల్లో లక్ష క్యూబిక్ మీటర్లు మట్టి (పూడిక) తీయాలని లక్ష్యంగా కాగా, 12 చెరువుల్లో మాత్రమే పనులు మొదలు పెట్టి 5 వేల క్యూబిక్ మీటర్లు మట్టిని తొలగించారు. 590 నీటి కుంటల్లో (ఫారం పాండ్స్) 6 లక్షల క్యూబిక్ మీటర్లు మట్టి తీత పనులు చేయాలని లక్ష్యం కాగా 188 కుంటల్లో పనులు చేపట్టి 66 వేల క్యూబిక్ మీటర్ల పనులు చేశారు. 1712 ఫీడర్ ఛానల్స్‌లో 31 లక్షల క్యూబిక్ మట్టి పనులు చేయాల్సి ఉండగా 679 ఫీడర్ చానల్స్‌లో పనులు చేపట్టి 2.81 లక్షల క్యూబిక్ మీటర్లు పనులు చేశామని రికార్డుల్లో చూపారు. కీలకమైన మైనర్ ఇరిగేషన్ చెరువుల్లో మట్టితీత పనులు మొదలు పెట్టలేదు.
పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ చేపట్టిన పల్లె పండుగ కార్యక్రమంలో పనుల పురోగతిపై సీఎం చంద్రబాబు సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రతి శాఖ ఇదే తరహాలో పురోగతి సాధించాలని దిశా నిర్దేశం చేశారు.
ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్) ద్వారా వచ్చే వివిధ ఫిర్యాదులు, సమస్యల పరిష్కారంలో జిల్లా యంత్రాంగం ప్రజల నుంచి 85 శాతం సంతృప్తి రాబట్టింది. 15 శాతం ఫిర్యాదుదారులు అసంతృప్తి వ్యక్తం చేశారు. జవనరి 31 నుంచి మే 1 వరకు వ్యక్తిగత సమస్యలపై 7,548 ఫిర్యాదులు అందాయి. 4,104 పరిష్కరించారు. 3,444 ఫిర్యాదులు పెండింగులో పెట్టారు. 2,558 సమస్యలు పరిశీలన దశలో ఉన్నాయి. కమ్యూనిటీ ఫిర్యాదులు 1,828 రాగా, 650 పెండింగ్‌లో ఉంచారు. 1,178 పరిష్కరించారు. 882 పరిశీలనలో ఉన్నాయి. ఏప్రిల్ 2 నుంచి ఈ నెల ఒకటి వరకు నెల రోజుల్లో కమ్యూనిటీ ఫిర్యాదులు 232 వచ్చాయి. వాటిలో 192 వివిధ కారణాలతో పెండింగ్‌లో ఉంచారు.
జిల్లాలో రెవెన్యూ రికార్డుల్లో 22ఏ జాబితా నుంచి భూములు తీసేసి న్యాయం చేయాలంటూ 426 మంది రైతులు దరఖాస్తులు చేశారు. 113 దరఖాస్తులకు ఆమోదం లభించగా, 70 దరఖాస్తులను వివిధ కారణాలతో తిరస్కరించారు. 183 దరఖాస్తులు పరిష్కరించారు. ఈ అంశంలో ప్రజల సంతృప్తి 42.96 శాతమే.
జిల్లాలో 2025-26 ఆర్థిక సంవత్సరంలో వివిధ అభివృద్ధి పనులకు అందుబాటులో రూ.423 కోట్లు నిధులు ఉంటే, అందులో రూ.409 కోట్లు ఖర్చు చేశారు.
జిల్లాలో 588 అంగన్‌వాడీ కేంద్రాల్లో మరుగుదొడ్లు నిర్మాణ పనులు చేపడితే 488 కేంద్రాల్లో పనులు పూర్తి చేసి 82.99 శాతం పురోగతి సాధించారు. 696 అంగన్‌వాడి కేంద్రాలకు తాగునీటి సరఫరా పనులు చేపట్టారు. 620 కేంద్రాల్లో పనులు పూర్తి చేసి 89.08 శాతం పురోగతి సాధించారు.
జిల్లాలో అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా అందుతున్న సేవలపై ప్రభుత్వ లబ్ధిదారులకు ఫోన్లు చేసి ప్రజల సంతృప్తి స్థాయిని తెలుసుకుంది. గర్భిణిలు, తల్లులు తమకు అందుతున్న సేవలపై మార్చిలో 75.9 శాతం సంతృప్తి వ్యక్తం చేస్తే, ఏప్రిల్‌లో 75.3 శాతం వ్యక్తం చేశారు. అంటే.. 0.6 శాతం సంతృప్తి తగ్గింది. 6 నెలల నుంచి 36 నెలల పిల్లల్లో 0.2 శాతం, 3 నుంచి 6 ఏళ్లలోపు పిల్లలకు అందుతున్న సేవల్లో ఒక శాతం సంతృప్తి పెరిగింది.
జిల్లా వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా గత నెలలో 65,105 సేవలు అందించి రాష్ట్రంలో 3వ ర్యాంక్ సాధించింది. గత వారం రోజుల్లో 14,185 సేవలు అందించి రాష్ట్రంలో ప్రథమ స్థానంలో నిలిచింది. ఈ విషయంపై జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ. సిరిని సీఎం చంద్రబాబు అభినందించారు.