Share News

రైతు బజార్‌లో.. దుకాణాల వివాదం

ABN , Publish Date - Jan 18 , 2026 | 12:11 AM

కర్నూలు నగరంలోని సీ.క్యాంపు రైతుబజారులో పూర్తయిన మూడు షాపుల విషయంలో అధికార పార్టీ నాయకులు లేవదీసిన వివాదం పరిష్కరించలేక మార్కెటింగ్‌ శాఖ అధికారులు తలపట్టుక్కూర్చున్నారు.

రైతు బజార్‌లో.. దుకాణాల వివాదం
వివాదం లేవదీసిన సి.క్యాంపు రైతుబజారులోని షాపులు ఇవే

నేతల మధ్య రగిలిన చిచ్చు

ఎవరి మాట వినాలో దిక్చుతోచని స్థితిలో మార్కెటింగ్‌ అధికారులు

కర్నూలు అగ్రికల్చర్‌, జనవరి 17 (ఆంధ్రజ్యోతి): కర్నూలు నగరంలోని సీ.క్యాంపు రైతుబజారులో పూర్తయిన మూడు షాపుల విషయంలో అధికార పార్టీ నాయకులు లేవదీసిన వివాదం పరిష్కరించలేక మార్కెటింగ్‌ శాఖ అధికారులు తలపట్టుక్కూర్చున్నారు. సొంత నిర్ణయం తీసుకునే అధికారం ఉండి కూడా నాయకులకు భయపడి షాపుల కేటాయింపు తమ వల్ల కాదని మీరే ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని జిల్లా మార్కెటింగ్‌ శాఖ అధికారులు మార్కెటింగ్‌ శాఖ కమిషనర్‌ విజయ సునీతకు ఇటీవల నివేదిక పంపారు. ఒక కీలక నేత తన అనుచరుడికి తప్పనిసరిగా షాపు కేటాయించాని సిఫారసు చేశాడు. ఆ అనుచరుడి చేత గ్రీవెన్స్‌ సెల్స్‌లో దరఖాస్తును కలెక్టర్‌కు ఇప్పించారు. నిబంధనల ప్రకారం ఎవరికైనా షాపులు కేటాయించాలంటే వేలం టెండర్‌ ద్వారా వేయాలి. టెండరులో ఎక్కువ అద్దెను చెల్లిస్తామని ముందుకు వస్తారో వారికే ఆ షాపును కట్టబెట్టాలి. అయితే ఇక్కడ షాపును కీలక నేత చెప్పిన వ్యక్తికి ఇస్తున్నారనే విషయం అధికార పార్టీలోని మరో నేతకు తెలిసింది. దీంతో హుటాహుటిన ఆ అధికారి మార్కెటింగ్‌ శాఖ అధికారులకు, రైతుబజార్ల అధికారులకు ఫోన్‌లు చేసి కొత్త షాపులు తమ అనుచరులకే కట్టబెట్టాలంటూ హుకుం జారీ చేసినట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఈ గొడవలో తాము బలి కావలసి వస్తుందని అధికారులు సొంత నిర్ణయం తీసుకోకూడదని మార్కెటింగ్‌ శాఖ కమిషనర్‌ విజయ సునీతకు నివేదికను పంపినట్లు విశ్వసనీయ సమాచారం వచ్చింది.

షాపుల కేటాయింపుపై నిర్ణయం కమిషనర్‌ దే

సీ.క్యాంపు రైతుబజారులో నిర్మించిన షాపులను కేటాయించే విషయంలో మేం ఎటువంటి నిర్ణయం తీసుకోవడం లేదు. కమిషనర్‌కు నివేదిక పంపించాం.

- నారాయణమూర్తి, ఏడీఎం

Updated Date - Jan 18 , 2026 | 12:11 AM