తొలి అడుగులోనే అవరోధం
ABN , Publish Date - Oct 28 , 2026 | 11:52 PM
కేఈ రుద్రఫణికి తొలి అడుగులోనే అవరోధం కలిగింది. కుటుంబ రాజకీయ నేపథ్యం.. తండ్రి రాజకీయ అనుభవం, పలుకుబడి.. పార్టీ అధినేత ఆశీస్సులు.. అన్ని అనుకూలించాయి. జడ్పీ చైర్మన్ పీఠం దాదాపు ఖాయమనే అంచనాలు వెలువడ్డాయి. కేఈ వర్గీయుల్లో ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ఓటర్ల జాబితాలో పేరుండాలనే నిబంధన వారి ఆశలను తలకిందలు చేశాయి.
అందినట్లే అంది చేజారిన జడ్పీ పీఠం
కేఈ రుద్రఫణికి షాక్ ఇచ్చిన ఎన్నికల నిబంధనలు
కేఈ వర్గీయుల్లో నిరాశ
కర్నూలు, అక్టోబరు 28 (ఆంధ్రజ్యోతి): కేఈ రుద్రఫణికి తొలి అడుగులోనే అవరోధం కలిగింది. కుటుంబ రాజకీయ నేపథ్యం.. తండ్రి రాజకీయ అనుభవం, పలుకుబడి.. పార్టీ అధినేత ఆశీస్సులు.. అన్ని అనుకూలించాయి. జడ్పీ చైర్మన్ పీఠం దాదాపు ఖాయమనే అంచనాలు వెలువడ్డాయి. కేఈ వర్గీయుల్లో ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ఓటర్ల జాబితాలో పేరుండాలనే నిబంధన వారి ఆశలను తలకిందలు చేశాయి. ప్రత్యక్ష ఎన్నికల రాజకీయాల్లో అడుగుపెట్టేందుకు సిద్ధమైన ఈకే రుద్రఫణికి అనూహ్య ఎదురుదెబ్బ తగిలింది. పోటీ చేయకముందే అభ్యర్థిత్వం తిరస్కరణకు గురికావడంతో.. చేతికందినట్టే కనిపించిన జడ్పీ చైర్మన్ పీఠం చేజారిపోయింది. రాజకీయాల్లో అదృష్టం ఎప్పుడు తలుపు తడుతుందో.. ఎప్పుడు వెనక్కి వెళ్లిపోతుందో చెప్పలేమనేందుకు ఈ పరిణామనే నిదర్శనం.
దశాబ్దాల రాజకీయ నేపథ్యం..
టీడీపీలో పెద్దాయనగా గుర్తింపు కలిగిన మాజీ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి సోదరుడు మాజీ మంత్రి కేఈ ప్రభాకర్ తనయుడు కేఈ రుద్రఫణి దశాబ్దాల రాజకీయ నేపథ్యంతో వచ్చిన యువనేత. ఇన్నాళ్లూ ప్రత్యక్ష ఎన్నికల బరిలోకి దిగని ఆయనకు.. తాజా జడ్పీటీసీ ఎన్నికలు రాజకీయ అరంగ్రేటానికి వేదికగా మారాయి. జడ్పీ చైర్మన్ పీఠం బీసీ జనరల్‌కు కేటాయించడంతో.. ఇదే సరైన సమయమని భావించిన మాజీ మంత్రి కేఈ ప్రభాకర్ తన కుమారుడు కేఈ రుద్రఫణిని కృష్ణగిరి జడ్పీటసీ స్థానం నుంచి టీడీపీ అభ్యర్థిగా బరిలో సిద్ధమయ్యారు. టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు కూడా సానుకూలంగా స్పందించడం, కృష్ణగిరి జడ్పీటీసీ టీడీపీ అభ్యర్థిగా కేఈ రుద్రఫణి పేరును అధికారికంగా ప్రకటించారు. ఆయన టీడీపీ అభ్యర్థిగా నామినేషన్ పత్రాలను ఎన్నికల రిటర్నింగ్ అధికారి సుధాకరెడ్డికి అందజేశారు. కృష్ణగిరి జడ్పీటీసీగా గెలిచి, జడ్పీ చైర్మన్ పీఠం అధిరోహించడం లాంఛనమేనన్న ప్రచారం రాజకీయ వర్గాల్లో జోరుగా సాగింది. టీడీపీలో జడ్పీ చైర్మన్ పీఠం ఆశించిన ఇతర నాయకులు సైతం కేఈ రుద్రఫణి రంగంలోకి రావడంతో ఆశలు వదులుకున్నారు.
అదృష్టం అంచుల దాకా వచ్చి..
కుటుంబ రాజకీయ నేపథ్యం, పలుకుబడి, పార్టీ మద్దతు ఉన్నా.. ఎన్నికల నిబంధనల ముందు అవేవి పని చేయవని ఈ ఉదంతం స్పష్టం చేస్తుంది. తొలి ఎన్నికల్లోనే జిల్లా ప్రథమ పౌరుడు, క్యాబినెట్ హోదాతో సమానమైన జడ్పీ చైర్మన్ పగ్గాల చేపట్టే అవకాశాలు ఉన్నాయని భావించిన రుద్రఫణికి.. బరిలోకి దిగకముందే నిరాశ ఎదురైంది. ఓ చిన్న సాంకేతిక అంశం రాజకీయ భవిషత్తుకు కీలకమైన అవకాశాన్ని దూరం చేసింది.
కొంప ముంచిన ఓటు హక్కు
జడ్పీటీసీ ఎన్నికలు ఈ ఏడాది జనవరి ఒకటో తారీఖు నాటికి సిద్ధంగా ఉన్న ఓటర్ల జాబితా ప్రకారం నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్‌లో స్పష్టంగా పేర్కొంది. ఆ జాబితానే అధికారికంగా ఎన్నికల రిటర్నింగ్ అధికారులకు అందజేశారు. ఆ సమయానికి కృష్ణగిరి టీడీపీ జట్పీటీసీ అభ్యర్థి కేఈ రుద్రఫణి ఓటు ఆ జాబితాలో లేదు. ఆయన ఓటు కర్నూలు నగరపాలక సంస్థ (అర్బన) పరిధిలో ఉంది. అర్బన్ పరిధిలో ఓటు హక్కు కలిగిన వ్యక్తులు గ్రామీణ ప్రాంతాల్లో జరిగే ఏ ఎన్నికల్లోనూ పోటీ చేయడానికి అనర్హులని ఎన్నికల అధికారులు అంటున్నారు. ఈ విషయం ముందే తెలియడంతో.. కర్నూలు అర్బన్ నియోజకవర్గం పరిధిలో ఉన్న తన ఓటును తొలగించి.. పత్తికొండ నియోజకవర్గం పరిధిలోని స్వగ్రామైన కృష్ణగిరి మండలం కంబాలపాడు గ్రామంలో ఓటు హక్కు కల్పించాలని కోరుతూ సెప్టెంబరు 9న దరఖాస్తు చేసుకోగా, కేంద్ర ఎన్నికల సం ఘం అదే నెల 16న పత్తికొండ నియోజకవర్గంలోకి ఆయన ఓటును మార్చింది. సర్ ప్రక్రియ మొదలైన తరువాత కొత్త ఓటర్ల జాబితాను అధికారికంగా ప్రకటించకపోవడంతో 2026 జనవరి 1నాటి జాబితానే ఎన్నికల అధికారులు పరిగణలోకి తీసుకొని ఆయన నామినేషన్ తిరస్కరించారు. న్యాయస్థానాన్ని ఆశ్రయించినా అనుకూలంగా తీర్పు రాకపోవడంతో నామినేషన్ తిరస్కరణకు గురైంది. జడ్పీ చైర్మన్ పీఠంపై పెట్టుకున్న ఆశలు ఆవిరయ్యాయి.