మిరపకు తెగులు..
ABN , Publish Date - Nov 12 , 2026 | 12:03 AM
మండలంలో సాగుచేసిన మిరప పంటకు తెగుళ్లు సోకడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఎల్‌నినో ప్రభావంతో ఇబ్బందులు పడుతూనే మిరప సాగుచేశామని తెగులు సోకడంతో ఏం చేయాలో తెలియడం లేదని ఆవేదన చెందుతున్నారు.
మొక్కలు ఎదగడం లేని రైతుల ఆవేదన
ప్రభుత్వం ఆదుకోవాలని వినతి
సంజామల, నవంబరు 11(ఆంధ్రజ్యోతి): మండలంలో సాగుచేసిన మిరప పంటకు తెగుళ్లు సోకడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఎల్‌నినో ప్రభావంతో ఇబ్బందులు పడుతూనే మిరప సాగుచేశామని తెగులు సోకడంతో ఏం చేయాలో తెలియడం లేదని ఆవేదన చెందుతున్నారు. ఈ ఖరీ్‌ఫలో మండల వ్యాప్తంగా 4500ఎకరాల్లో మిరప సాగు చేశారు. మేలు రకాలైన సూపర్ 10, 67 బ్యాడిగ సాగు చేసిన రైతులను ఎల్‌నినో ప్రభావం తీవ్ర నిరాశకు గురిచేసింది. వర్షాలు కురువకపోవడంతో సాగునీటి కష్టాలను ఎదుర్కొంటున్నారు.
బోర్ల కింద సాగు..
నీటి ఎద్దడంతో బోర్లు ఉన్న రైతులు మిరప సాగుచేశారు. అయితే తెగుళ్లు సోకడంతో మొక్కలు ఎదగడం లేదని అంటున్నారు. పంట సాగుచేసి నాలుగు నెలలు గడుస్తున్నా మొక్కల ఎదుగుదల ఆగిపోయిందని విలవిలలాడుతున్నారు. పంటకు బింగి, పండాకు, నల్లి వైరస్ తెగుళ్లు సోకడంతో ఖరీదైన మందులను పిచికారీ చేసినా తగ్గలేదని వాపోతున్నారు.
అప్పులు చేసి పెట్టుబడి..
ఇప్పటికే అప్పులు చేసి పెట్టుబడి పెట్టామని ఈ సమయానికి దిగుబడి రావలసి ఉండగా ఆగిపోయిందని అంటున్నారు. ప్రభుత్వం పరిహారం అందించి ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.