గైర్హాజరైన వారిపై క్రమశిక్షణ చర్యలు
ABN , Publish Date - Nov 28 , 2026 | 11:06 PM
నంద్యాల జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికల విధులకు గైర్హాజరైన ఉద్యోగులపై కలెక్టర్ రాజకుమారి కొరడా ఝళిపించారు.
95 మందికి షోకాజ్ నోటీసులు
శిక్షణకు గైర్హాజరైన 310 మందికి కూడా...
ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యం సహించేది లేదు
కలెక్టర్ రాజకుమారి
నంద్యాల హాస్పిటల్/ నూనెపల్లి, నవంబరు 28, (ఆంధ్రజ్యోతి) : నంద్యాల జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికల విధులకు గైర్హాజరైన ఉద్యోగులపై కలెక్టర్ రాజకుమారి కొరడా ఝళిపించారు. రెండో విడత గ్రామపంచాయతీ ఎన్నికల్లో విధులకు గైర్హాజరైన 95 మంది ఉద్యోగులపై ఎన్నికల నిబంధనల ప్రకారం క్రమశిక్షణ చర్యలు చేపట్టారు. ఎన్నికల కోసం ఉదయం 7 గంటలకు హాజరు కావాలనే ఆదేశాలు ఉన్నా 95 మంది సంబంధిత మండల పరిషత్ అభివృద్ధ్ది అధికారుల కార్యాలయాలకు హాజరు కాకపోవడంతో కలెక్టర్ షోకాజ్ నోటీసులు జారీ చేశారు. అధికారుల ఆదేశాలు పాటించకుండా విధులకు గైర్హాజరైన మహానంది, బండి ఆత్మకూరు, వెలుగోడు, గడివేముల, ఆత్మకూరు మండలాలకు చెందిన కొందరు ఉద్యోగులు ఎన్నికల విధులకు డుమ్మా కొట్టారు. నియామకపు ఉత్తర్వులు అందుకొని స్పెషల్ డ్యూటీ ఆప్షన్ తీసుకొని ఫేషియల్ హాజరు నమోదు చేసిన అనంతరం సంబంధిత ఎంపీడీఓ కార్యాలయాలకు చేరుకొని పోలింగ్ సామగ్రిని తీసుకోకుండా గైర్హాజరయ్యారు. దీంతో ఎన్నికల నిర్వహణకు తీవ్ర అంతరాయం కలిగింది. పోలింగ్ సామగ్రిని సంబంధిత పోలింగ్ కేంద్రాలకు తరలించే ప్రక్రియలో ఎంపీడీవోలు ఇబ్బందులు పడ్డారు. అలాగే జిల్లాలో గ్రామపంచాయతీ ఎన్నికల 3వ విడత శిక్షణకు గైర్హాజరైన 310 మంది ఉద్యోగులపై క్రమశిక్షణ చర్యలు జిల్లా కలెక్టర్ తీసుకుంటున్నారు. జిల్లాలో 3వ విడతలో ప్యాపిలి, డోన్, నందికొట్కూరు, జుపాడుబంగ్లా, పాములపాడు, కొత్తపల్లి, పగిడ్యాల, మిడుతూరు మండలాలకు చెందిన 310 మంది ఉద్యోగులు పీవోగా నియమితులైనప్పటికీ శిక్షణకు గైర్హాజరయ్యారు. వీరికి కలెక్టర్ షోకాజ్ నోటీసులు జారీ చేశారు ఎన్నికల విధుల్లో అలసత్వాన్ని సహించమని అన్నారు.