విపత్తు నివారణ చర్యలు చేపట్టాలి
ABN , Publish Date - Sep 26 , 2026 | 11:52 PM
రాబోయే సీజన్‌ను దృష్టిలో ఉంచుకొని జిల్లాలోని సమస్యాత్మక ప్రాంతాలను ముందుగానే గుర్తించి, ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం సంభవించకుండా అవసరమైన విపత్తు నివారణ చర్యలు చేపట్టాలని జేసీ సూరజ్ ధనుంజయ్ సంబంధిత అధికారులను ఆదేశించారు.
జేసీ సూరజ్ ధనుంజయ్
నంద్యాల నూనెపల్లి, సెప్టెంబరు 26 (ఆంధ్రజ్యోతి) : రాబోయే సీజన్‌ను దృష్టిలో ఉంచుకొని జిల్లాలోని సమస్యాత్మక ప్రాంతాలను ముందుగానే గుర్తించి, ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం సంభవించకుండా అవసరమైన విపత్తు నివారణ చర్యలు చేపట్టాలని జేసీ సూరజ్ ధనుంజయ్ సంబంధిత అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో అడిషనల్ ఎస్పీ సుస్మిత స్వామినాథన్, డీఆర్వో రామునాయక్ పలు శాఖల అధికారులతో విపత్తు నిర్వహణ ముందస్తు చర్యలపై సమావేశం నిర్వహించారు. జేసీ మాట్లాడుతూ కెనాల్ గట్లు బలహీనంగా ఉన్న ప్రాంతాలను గుర్తించి మరమ్మతులు చేపట్టాలన్నారు. కాలువలు పొంగిపొర్లే ప్రాంతాల్లో కరకట్టల పటిష్టత, సైడ్ లైనింగ్ పనులపై నివేదిక అందించాలన్నారు. ప్రాజెక్టుల మెకానికల్ గేట్ల పనితీరును పరిశీలిస్తూ, అత్యవసర పరిస్థితుల్లో సక్రమంగా పనిచేసేలా చర్యలు తీసుకోవాలన్నారు.
ఉద్యానవన హబ్‌గా తీర్చిదిద్దడమే..
రాయలసీమ ప్రాంతాన్ని దేశంలోనే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో పోటీ పడగలిగే ప్రపంచ స్థాయి ఉద్యానవన హబ్‌గా తీర్చిదిద్దడమే రాయలసీమ హార్టికల్చర్ హబ్ ప్రధాన లక్ష్యమని జేసీ తెలిపారు. ఉద్యానవన, నీటిపారుదల, రోడ్లు-భవనాలు, రవాణా శాఖల సమన్వయంతో సమగ్ర అభివృద్ధి కార్యక్రమాన్ని అమలు చేయనున్నట్లు పేర్కొన్నారు. జిల్లాలో ఆర్‌ఐహెచ్‌డీపీ కింద 15 క్లస్టర్లను 309 రైతు సేవా కేంద్రాల పరిధిలో అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు.
అభిప్రాయాలను తక్షణమే సమర్పించాలి
రాబోయే చీఫ్ సెక్రటరీల కాన్ఫరెన్స్‌లో ప్రధానమంత్రి సమక్షంలో చర్చించనున్న అంశాలకు సంబంధించి ప్రభుత్వం రూపొందించిన కాన్సెప్ట్ నోట్‌పై కలెక్టర్లు తమ సూచనలు, అభిప్రాయాలను తక్షణమే సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయిప్రసాద్ పేర్కొన్నారు. ఆయన అన్ని జిల్లాల కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించగా జాయింట్ కలెక్టర్ సూరజ్ ధనుంజయ్ పాల్గొన్నారు. ప్రస్తుతం అమలులో ఉన్న విధానాలను మరింత సమర్థవంతంగా తీర్చిదిద్దేందుకు తీసుకోవాల్సిన చర్యలు, వినూత్న ఆలోచనలు, మెరుగైన విధానాలపై సూచనలు సేకరించి నివేదికలో పొందుపరచాలని ఆదేశించారు.