ఉరు చెరువును తవ్వి మట్టిని కొల్లగొట్టి..
ABN , Publish Date - Apr 18 , 2026 | 11:44 PM
ఊరు చెరువు తవ్వి నల్లమట్టిని దోచేసి అక్రమార్జనకు పాల్పడుతున్నారు అధికార పార్టీ నేతలు. రోజురోజుకూ వీరి ఆగడాలు మితిమీరి పోతున్నాయి.
రెచ్చిపోతున్న అధికార పార్టీ నేతలు
30 టిప్పర్లతో నల్లమట్టి దోపిడీ
లక్షలకు పడగలెత్తుతున్న అక్రమార్కులు
అడ్డుకున్న గంజహళ్లి గ్రామస్థులు
రైతులపై దాడిచేసిన పోలీసులు
అనుమతులుముగిసినా యథాతథంగా తవ్వకాలు
ఊరు చెరువు తవ్వి నల్లమట్టిని దోచేసి అక్రమార్జనకు పాల్పడుతున్నారు అధికార పార్టీ నేతలు. రోజురోజుకూ వీరి ఆగడాలు మితిమీరి పోతున్నాయి. ప్రభుత్వం తమదే కావడంతో అడిగే నాథుడే ఉండరని మరింత రెచ్చిపోతు న్నారు. గోనెగండ్ల మండలంలోని గంజహళ్లి గ్రామాంలోని ఊరు చెరువులోని నల్లమట్టిని అక్రమంగా తవ్వి లక్షలాది రూపాయలు అక్రమా ర్జన చేస్తున్నా రు. అక్రమార్కుల వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతోంది. కొందరు అఽధికారులు తెలిసినప్పటికీ చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారు. చెరువు మొత్తం గుంతల మయంగా మారిపోయింది. అక్రమా ర్కులు నల్లమట్టి దోచుకోవడంలో అధికారులు కూడా తమ వంతు సహాయ సహకారాలు అందించారనే ఆరోణపలున్నాయి.
గోనెగండ్ల, ఏప్రిల్ 18(ఆంధ్రజ్యోతి): నల్లమట్టికి మార్కెట్లో విపరీతమైన డిమాండ్ ఉంది. ఎమ్మిగనూరు చుట్టుపక్కల గ్రామాల్లో నల్లమట్టితో ఇటుకలను తయారు చేస్తారు. ఇక్కడ ఇటుకల తయారీ కేంద్రాలు చాలా ఉన్నాయి. గోనెగండ్ల మండలంలోని గంజహళ్లి గ్రామంలో 369/2 అనే సర్వే నెంబర్‌లో 71 ఎకరాల్లో ఊరు చెరువు ఉంది. అక్కడ నల్లమట్టి ఎక్కువగా ఉంది. ఈ మట్టిని ఇటుకల తయారీలో ఉపయోగిస్తారు. దీంతో అధికార పార్టీ నాయకుల కన్ను ఈచెరువు పై పడింది. మైనింగ్ అధికారుల దృష్టికి తీసుకెళ్లడం వెంటనే వీరికి 1000 క్యూబిక్ మీటర్లలో ఇటుక కోసం మట్టిని తవ్వుకు నేందుకు అనుమతులిచ్చారు. దీన్ని 10-4-2026 నుంచి 17-4-2026 వరకు అనుమతి ఇచ్చారు. అధికారపార్టీ నేతలు ఇక 30 టిప్పర్లతో రాత్రి, పగలు అనే తేడా లేకుండా చెరువులోని నల్లమట్టిని తవ్వి ఎమ్మిగ నూరు, కోడుమూరు, గూ డూరు, సి.బెళగల్ మండలా ల్లోని ఇటుకల బట్ట్టీలకు అమ్మకాలు మొదలుపెట్టారు. దీంతో రోజుకు లక్షల్లో ధనం ఆర్జించారు. అనుమతి ఇచ్చిన గడువు అయిపోయినప్పటికీ అధికార బలంతో నల్లమట్టిని తవ్వడం మానలేదు.
రైతును కొట్టిన పోలీసులు
శనివారం తెల్లవారుజామున గ్రామానికి చెందిన కొంతమంది రైతులు చెరువులోని మట్టిని ట్రాక్టర్లతో తీసుకొని తమ పొలాల వైపు వెళ్తున్నారు. దీన్ని గమనించిన పోలీసులు దివాకర్ అనే రైతును వెంటబడి కొట్టారు. చెరువులోని మట్టిని ఎలా తీసుకొని నీ పొలంలో వేసు కుంటావు. అనుమతి ఉందా అని వేధించారు. అతడు ఉదయం గ్రామంలోకి వెళ్లి మన గ్రామం మట్టిని మన పొలంలో వేసుకునేందుకు పర్మిషన్ కావాలని పోలీసులు కొడుతున్నారని గ్రామస్థులకు చెప్పడంతో శనివారం ఉదయం గ్రామంలోని దాదాపు 300 మంది రైతులు, యువకులు మా గ్రామం మట్టిని మాకు కాకుండా ఎక్కడికో ఎలా తీసుకెళ్తారని ప్రశ్నించారు.
దారికి అడ్డంగా ట్రాక్టర్లు
అనుమతులు లేవని గ్రామస్థులు మట్టితో ఉన్న టిప్పర్లను అడ్డగించారు. దారికి అడ్డంగా తమ ట్రాక్టర్లు పెట్టారు. అధికారులు రావాలి అక్రమంగా నల్లమట్టిని తవ్వి తీసుకెళ్తున్న టిప్పర్లపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తూ నిరసనకు దిగారు. గోనెగండ్ల సీఐ చంద్రబాబు సంఘటనా స్థలానికి చేరుకొని ప్రజలకు శాంతింపజే సే ప్రయత్నం చేశారు. అనుమతి లేకుండా ఉన్న టిప్పర్ల పై కేసు నమోదు చేస్తామని ప్రజలకు హామీ ఇచ్చారు. మీ గ్రామంలోని నల్లమట్టిని మీరు తోలుకుంటే మాకు ఎలాంటి ఇబ్బంది లేదని ప్రజలకు తెలపడంతో వారు శాంతించారు.
నిబంధనలకు నీళ్లు
1000 క్యూబిక్ మీటర్లలోని నల్లమట్టిని తవ్వుకో వాలని మైనింగ్ అధికారులు అనుమతులను ఇస్తే దాన్ని అడ్డు పెట్టుకొని రాత్రిపగలు అన్న తేడా లేకుండా 30 టిప్పర్లతో ఇటుక తయారీ కేంద్రాలకు అమ్మకాలు జరిపారు. వారం రోజుల్లో రూ.50లక్షల మేర డబ్బును సంపాదించినట్లు సమాచారం. మైనింగ్ అధికారులకు మాత్రమ 1000 క్యూబిక్ మీటర్లకు రూ. 1,08,900 చలానా ద్వార ప్రభుత్వంకు చెల్లించారు.
పోలీసులు చితకబాదారు
మాగ్రామ చెరువులోని మట్టిని పొలంలో వేసుకునేందుకు తీసుకు వెళ్తుంటే పోలీసులు చితకబాదారు. చెరువులోని మట్టిని ఎలా తీసుకెళ్తావని ప్రశ్నించారు. మా గ్రామం మట్టిని మేము తీసుకోరాదా?
దివాకర్, రైతు, గంజహళ్లి
అక్రమంగా మట్టిని తోలుతున్నారు
మా గ్రామ చెరువు నుంచి అక్రమంగా మట్టిని తోలుతున్నారు. అమ్మకాలు చేసేందుకు రాత్రిపగలు తోలుకోవచ్చు కానీ రైతులు పొలాలకు తోలుకుంటే కేసు పెడతారు.
మల్లెష్, రైతు, గంజహళ్లి.
కొట్టి సెల్‌ఫోన్లు తీసుకెళ్లారు
ఇటుక తయారీకి మట్టి తోలుకోవచ్చునంట. మా పొలాలకు తీసుకెళ్లితే పోలీసులు కొట్టి సెల్‌ఫోన్లు లాక్కెళ్లారు. ఇక్కడ రైతులకు ఒక న్యాయం, అధికారపార్టీ నాయకులకు ఒక న్యాయం ఉంది.
వెంకటేష్, రైతు, గంజహళ్లి.
మరో సారి అనుమతి ఇవ్వలేదు
గంజహళ్లి చెరువులో ఇటుకల తయారీకి గాను 10వ తేదీ నుంచి 17వ తేదీ వరకు మాత్రమే 1000 క్యూబిక్ మీటర్లకు అనుమతి ఇచ్చాం. రెండోవ సారి ఇటుకల తయారీకి చెరువులో నల్లమట్టిని తవ్వడానికి అనుమలు ఇవ్వలేదు.
జిలానీబాషా, డీఈ, మైనర్ ఇరిగేషన్