నరక యాతన..
ABN , Publish Date - Jul 16 , 2026 | 12:14 AM
మండల కేంద్రంలో రోడ్డు విస్తరణ పనులు నిలిచిపోవడంతో స్థానికులు నరకయాత పడుతున్నారు. పనులు ప్రారంభించిన కాంట్రాక్టర్ ఓ వైపు మాత్రమే కట్టడాలను తొలగించి, రెండోవైపు మాత్రం అలాగే వదిలేశారు. కాల్వల ఏర్పాటుకు తవ్వి వదిలేశారు.
సంజామలలో ఆగిపోయిన రహదారి విస్తరణ పనులు
కాలువ కోసం తవ్వి వదిలేసిన కాంట్రాక్టర్
సంజామల, జూలై 15 (ఆంధ్రజ్యోతి): మండల కేంద్రంలో రోడ్డు విస్తరణ పనులు నిలిచిపోవడంతో స్థానికులు నరకయాత పడుతున్నారు. పనులు ప్రారంభించిన కాంట్రాక్టర్ ఓ వైపు మాత్రమే కట్టడాలను తొలగించి, రెండోవైపు మాత్రం అలాగే వదిలేశారు. కాల్వల ఏర్పాటుకు తవ్వి వదిలేశారు.
ఒకవైపే విస్తరణ?
సాధారణంగా రహదారిని విస్తరించాలంటే రోడ్డుకు ఇరువైపులా కట్టడాలను తొలగించి పనులు చేస్తారు. అయితే సంజామలలో మాత్రం ఒక వైపు మాత్రమే తొలగించి మరోవైపు కట్టడాలను తొలగించకుండా అలాగే వదిలేయడంతో స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అదుపు తప్పితే గుంతలోకే..
కట్టడాలు తొలగించిన అనంతరం కాలువ నిర్మాణానికి నెల క్రితం గుంతలు తీసిన కాంట్రాక్టర్ అలాగే వదిలేశాడు. దీంతో ప్రజలు కాలువ గుంతలపై తాత్కాలికంగా గ్రిల్, బండలు వేసుకుని దాటుతున్నారు. ఏ మాత్రం అదుపు తప్పినా అయిదు అడుగులకుపై ఉన్న గుంతలో పడే ప్రమాదం ఉంది. ఇక వృద్ధులు, మహిళలు, చిన్నపిల్లలకు ప్రమాదం పొంచి ఉంది. తాగునీరు, సరుకులు, కూరగాయలు తెచ్చుకోవాలన్నా, పిల్లలు బడికి వెళ్లాలన్నా అవస్థలు పడుతున్నామని, అధికారులు స్పందించి పనులు వెంటనే పూర్తిచేసేలా చూడాలని ప్రజలు కోరుతున్నారు.
బయటకు వెళ్లాలంటే కష్టంగా ఉంది.
నేను, నా భర్య ఇద్దరం వృద్ధులం. సరుకులు, కూరగాయలు, తాగునీరు తెచ్చుకోవాలంటే భయపడుతున్నాం. బండలపై నడిచే సమయంలో ఏమాత్రం అదుపు తప్పినా గుంతలో పడే ప్రమాదం ఉంది. అధికారులు స్పందించాలి. - మునెయ్య, విశ్రాంత ఉపాధ్యాయుడు
స్థానికులు సహకరించడం లేదు
రహదారి విస్తరణకు స్థానికులు సహకరించడం లేదు. కట్టడాలను తొలగింపుకు ప్రజలు అభ్యంతరం తెలపడంతో కాంట్రాక్టర్ పనులను ఆవేశాడు. కాంట్రాక్టర్, ప్రజలతో మాట్లాడి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటాం. - రెడ్డి గోవిందు, డీఈ, ఆర్‌అండ్‌బీ