సిబ్బంది కొరతతో ఇబ్బందులు
ABN , Publish Date - May 18 , 2026 | 12:35 AM
తహసీల్దార్ కార్యాలయంలో సిబ్బంది కొరత వేధిస్తోంది. ఖాళీ కుర్చీలతో దర్శనమిస్తూ కార్యాలయం వెలవెలబోతోంది. డిప్యూటీ తహసీల్దార్ మినహా మిగిలిన పోస్టులన్నీ ఖాళీగా ఉండటంతో ప్రజా సమస్యలు పేరుకుపోతున్నాయి. పనులన్నీ తహసీల్దార్, డీటీ చేసుకోవలసి వస్తుండటంతో వారు ప్రజలకు న్యాయం చేయలేకపోతున్నారు.
కొలిమిగుండ్ల తహసీల్దార్ కార్యాలయంలో పోస్టులన్నీ ఖాళీ
పరిష్కారం కాని ప్రజా సమస్యలు
కొలిమిగుండ్ల, మే 17 (ఆంధ్రజ్యోతి):తహసీల్దార్ కార్యాలయంలో సిబ్బంది కొరత వేధిస్తోంది. ఖాళీ కుర్చీలతో దర్శనమిస్తూ కార్యాలయం వెలవెలబోతోంది. డిప్యూటీ తహసీల్దార్ మినహా మిగిలిన పోస్టులన్నీ ఖాళీగా ఉండటంతో ప్రజా సమస్యలు పేరుకుపోతున్నాయి. పనులన్నీ తహసీల్దార్, డీటీ చేసుకోవలసి వస్తుండటంతో వారు ప్రజలకు న్యాయం చేయలేకపోతున్నారు.
ఇవీ ఖాళీలు..
జూనియర్ అసిస్టెంట్, సీనియర్ అసిస్టెంట్, రెవెన్యూ ఇన్స్‌పెక్టర్, వీఆర్‌వోలతో పాటు పదికిపైగా పోస్టులు ఖాళీగా ఉండటంతో ఏ ఒక్క పని ముందుకు సాగడం లేదనిప్రజలు ఆవేదన చెందుతున్నారు. కార్యాలయానికి ఎప్పుడు వచ్చినా ఖాళీ కుర్చీలు దర్శనమిస్తున్నామని మండల రైతులు, విద్యార్థులు నిరాశ చెందుతున్నారు.
సర్టిఫికెట్ల కోసం తిప్పలు
ఇప్పటికే పదో తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షల ఫలితాలు వచ్చాయి. తదుపరి కళాశాలలు, వృతి విద్యా కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు చేశారు. అయితే అడ్మిషన్ల కోసం వివిధ సర్టిఫికెట్లు అవసరమవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. జిల్లా ఉన్నతాధికారులు స్పందించి సిబ్బందిని నియమించాలని వారు కోరుతున్నారు
ఇప్పటికే ఉన్నతాధికారులకు నివేదించాం
కార్యాలయంలో సిబ్బంది కొరత తో ఇబ్బందులు పడుతున్నాం. కీలక పోస్టుల్లో ఉద్యోగులు లేకపోవడంతో పనిభారం అధికమవుతోంది. ప్రజా సమస్యలను పరిష్కరించడం కష్టంగా మారింది. ఈ విషయాన్ని ఇప్పటికే ఉన్నతాధికారులకు నివేదించాం. - సాయి విశ్వతేజ, ఇన్‌చార్జి తహసీల్దార్