Share News

సిలిండర్‌ కోసం తిప్పలు

ABN , Publish Date - Mar 18 , 2026 | 12:01 AM

పట్టణంలో గ్యాస్‌ కష్టాలు మొదలయ్యాయి. అమెరికా, ఇరాన్‌ యుద్దం ప్రభావంతో సిలిండర్‌ బుక్‌ చేసినా రావడం లేదని వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు బపడుతున్నారు. గ్యాస్‌ ఏజెన్సీ వద్ద వినయోగదారులు క్యూ కడుతున్నారు.

సిలిండర్‌ కోసం తిప్పలు
శిరివెళ్లలో వాహనాన్ని చుట్టుముట్టిన వినియోగదారులు

ఖాళీ సిలిండర్లతో ఏజెన్సీ వద్దకు వినియోగదారులు

కొరత లేదు, ఆందోళన చెందవద్దు : శిరివెళ్ల తహసీల్దార్‌ విజయశ్రీ

డోన్‌ రూరల్‌, మార్చి 17 (ఆంధ్రజ్యోతి): పట్టణంలో గ్యాస్‌ కష్టాలు మొదలయ్యాయి. అమెరికా, ఇరాన్‌ యుద్దం ప్రభావంతో సిలిండర్‌ బుక్‌ చేసినా రావడం లేదని వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు బపడుతున్నారు. గ్యాస్‌ ఏజెన్సీ వద్ద వినయోగదారులు క్యూ కడుతున్నారు. చాలామంది వినియోగదారులు ఖాళీ సిలిండర్లతో ఏజెన్సీ, గౌడౌన్‌ వద్ద పడిగాపులు కాస్తున్నారు. పట్టణంలో భారత్‌ గ్యాస్‌, హెచ్‌పీ గ్యాస్‌ ఏజెన్సీలు ఉన్నాయి. బుక్‌ చేసిన వారంలోపు సిలిండర్‌ ఇస్తున్నట్లు ఏజెన్సీ డిస్ట్రిబ్యూటర్లు అంటున్నారు. కాగా పట్టణ ప్రాంతంలోని వినియోగదారులకు సిలిండర్‌ ఇచ్చేందుకు ప్రాధాన్యమిస్తున్నామని, అనంతరం గ్రామాల వినియోగదారులకు ఇస్తామని డిస్ట్రిబ్యూటర్లు అంటున్నారు.

శిరివెళ్ల: మండల కేంద్రంలో హెచ్‌పీ కంపెనీ డిస్ట్రిబ్యూటర్‌ ఉన్నారు. పశ్చిమాసియాలో యుద్ధం ప్రారంభమైనప్పటినుంచి గృహ, వాణిజ్య వినియోగదారులు గ్యాస్‌ సిలిండర్ల కోసం ఇబ్బందులు పడుతున్నారు. యుద్ధం కారణంగా గ్యాస్‌ కొరత ఏర్పడిందని, రానున్న రోజుల్లో మరింత తీవ్రతరం అవుతుందని సోషల్‌ మీడియాలో వస్తున్న నిరాధార వార్తలతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. హెచ్‌పీ గ్యాస్‌ ఏజెన్సీ వెంకటేశ్వర డిస్ర్టిబ్యూటర్‌ పరిధిలో 18వేల కనెక్షన్లు ఉన్నాయని నిర్వాహకులు తెలిపారు.

కృత్రిమ కొరత సృష్టిస్తే కఠిన చర్యలు

గ్యాస్‌ ఏజెన్సీ నిర్వాహకులు సిలిండర్ల కృత్రిమ కొరత సృష్టిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తహసీల్దార్‌ విజయశ్రీ హెచ్చరించారు. మంగళవారం ఆమె శిరివెళ్ల మెట్ట వద్ద ఉన్న వెంకటేశ్వర గ్యాస్‌ ఏజెన్సీని తనిఖీ చేశారు. గోడౌన్‌లోని నిల్వ, రికార్డులను పరిశీలించారు. ఏజెన్సీ పరిధిలోని గ్రామాల వినియోగదారులకు గ్యాస్‌ సిలిండర్లను తప్పనిసరిగా డోర్‌ డెలివరీ చేయాలని ఆదేశించారు. అనంతరం ఏజెన్సీ వద్ద ఉన్న వినియోగదారులతో మాట్లాడి, గ్యాస్‌ బుకింగ్‌ చేసుకున్న ప్రతి ఒక్కరికీ సిలిండర్లు అందేలా చర్యలు తీసుకుంటామని, ఆందోళన చెందవద్దని కోరారు.

వినియోగదారులు 150, వచ్చిన సిలిండర్లు 50

రుద్రవరం: మండలంలో భారత్‌ గ్యాస్‌ డిస్ట్రిబ్యూటర్‌ ఉన్నారు. కాగా శిరెవెళ్లలోని హెచ్‌పీ గ్యాస్‌, ఆళ్లగడ్డ నుంచి ఇండేన్‌ గ్యాస్‌ కనెక్షన్ల వినియోగదారులు ఉన్నారు. మంగళవారం చిన్నకంబలూరు మెట్ట వద్దకు గ్యాస్‌ డెలివరీ వాహనం రావడంతో చిన్నకంబలూరు, పెద్దకంబలూరు, యల్లావత్తుల, కోటకొండ గ్రామాల వినియోగదారలుఉ ఖాలీ సిలిండర్లను తీసుకుని వచ్చారు. 50 సిలిండర్లు తీసుకురాగా, మొత్తం 150మంది వినియోగదారులు రావడతో వంద మంది నిరాశతో వెనక్కు తిరిగారు. కాగా సిలండర్‌కు రూ.1,030 చొప్పున తీసుకున్నట్లు వినియోగదారులు ఆరోపించారు.

Updated Date - Mar 18 , 2026 | 12:01 AM