చివరి మజిలీకి ఇబ్బందులు
ABN , Publish Date - May 08 , 2026 | 12:01 AM
మండలంలోని ముద్దవరం, గోర్లగుట్ట, కొలుములపల్లె, ఆర్‌ఎస్ రంగాపురం గ్రామాల్లో శ్మశాన వాటిక లేక దళితులు ఇబ్బందులు పడుతున్నారు. చనిపోయినవారి మృతదేహాలను పూడ్చేందుకు కూడా స్థలం లేక ఏమిచేయాలో అర్థం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు
బేతంచెర్ల మండలంలో శ్మశాన స్థలం లేక దళితుల అవస్థలు
పట్టించుకోని ప్రజా ప్రతినిధులు, అధికారులు
బేతంచెర్ల, మే 7 (ఆంధ్రజ్యోతి): మండలంలోని ముద్దవరం, గోర్లగుట్ట, కొలుములపల్లె, ఆర్‌ఎస్ రంగాపురం గ్రామాల్లో శ్మశాన వాటిక లేక దళితులు ఇబ్బందులు పడుతున్నారు. చనిపోయినవారి మృతదేహాలను పూడ్చేందుకు కూడా స్థలం లేక ఏమిచేయాలో అర్థం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఒకదానిపైనే మరొకటి..
స్థలం సరిపోకపోవడంతో ఒక మృతదేహంపైనే మరో మృతదేహాన్ని పూడ్చి వేయాల్సి వస్తోందని వాపోతున్నారు. ఉన్న కొద్దిపాటి స్థలంలో పూడ్చేందుకు ఇబ్బందులు ఉన్నాయని, చుట్టుపక్కన ఇళ్లు రావడంతో ఇది కూడా కష్టంగా మారిందని అంటున్నారు. శ్మశానికి వెళ్లేందుకు దారి కూడా సరిగా లేదని, చివరకు చేతులపైనే మృతదేహాన్ని తరలించాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
స్పందించని ప్రజా ప్రతినిధులు, అధికారులు
తమకు శ్మశాన స్థలం కేటాయించాలని పలుమార్లు ప్రజా ప్రతినిధులు, అధికారులకు విన్నవించినా పట్టించుకోవడం లేదని గ్రామాల ప్రజలు ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికైనా రెవెన్యూ అధికారులు, ప్రజా ప్రతినిధులు స్పందించి, స్థలాన్ని కేటాయించాలని కోరుతున్నారు.
ఇబ్బందులు పడుతున్నాం
మా గ్రామంలోని దళితవాడలో ఎవరైనా మృతి చెందితే అంత్యక్రియలు చేసేందుకు ఇబ్బంది పడుతున్నాం. ఒక శవంపైనే మరో శవాన్ని పూడ్చాల్సి వస్తోంది. అధికారులు సమస్యను పరిష్కరించాలి. - అయ్యన్న, ముద్దవరం
ప్రహరీ నిర్మించాలి
కొలుములపల్లె గ్రామంలోని దళితుల శ్మశాన వాటికకు ప్రహరీ నిర్మించాలి. పక్కనే ఇళ్లు ఉన్నాయి, ప్రహరీ లేకపోవడంతో చుట్టుపక్కల వారు అభ్యంతరం తెలుపుతున్నారు. ఈ విషయమై ప్రజా ప్రతినిధుల దృష్టికి తీసుకువెళ్లినా పట్టించుకోవడం లేదు. - రంగడు, కొలుములపల్లె