అంచనాకు మించి వచ్చిన భక్తులు
ABN , Publish Date - Feb 11 , 2026 | 11:24 PM
మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో తొలి రోజుల్లోనే అంచనాకు మించి రెట్టింపు స్థాయిలో భక్తులు వచ్చారని, అందుకు తగిన ఏర్పాట్లను చేసినట్లు కలెక్టర్ రాజకుమారి అన్నారు.
కలెక్టర్ రాజకుమారి
శ్రీశైలం, ఫిబ్రవరి 11 (ఆంధ్రజ్యోతి): మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో తొలి రోజుల్లోనే అంచనాకు మించి రెట్టింపు స్థాయిలో భక్తులు వచ్చారని, అందుకు తగిన ఏర్పాట్లను చేసినట్లు కలెక్టర్ రాజకుమారి అన్నారు. బుధవారం కమాండ్ కంట్రోల్ రూంలో ఎస్పీ సునీల్ షెరాన్, ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ పోతుగుంట రమే్‌షనాయుడు, ఈవో శ్రీనివాసరావులతో కలిసి మీడియాతో మాట్లాడారు. బ్రహ్మోత్సవాల దృష్ట్యా ప్రధాన శాఖలైన అటవీ, దేవదాయ, రెవెన్యూ, పోలీస్, ఆరోగ్యశాఖ అధికారుల మధ్య సమన్వయ లోపాలు తలెత్తకుండా సమగ్ర చర్యలు చేపట్టామన్నారు. పాదయాత్ర వచ్చే భక్తుల సంఖ్య గణనీయంగా పెరిగిందని మంగళవారం ఒక్కరోజే 71 వేల మంది భక్తులు దర్శించుకున్నారు. భక్తుల రద్దీ అధికంగా ఉన్నందున దర్శనానికి సుమారు 4 నుంచి 5 గంటల సమయం పట్టే అవకాశం ఉన్నందున ప్రతి ఒక్కరూ సంయమనంతో ఉండాలని కోరారు. క్షేత్రానికి వచ్చే ప్రతి భక్తుడు ఆధ్యాత్మిక భావనతో వస్తారని దర్శనం పూర్తయ్యే వరకు అదేవిధంగా కొనసాగాలని కలెక్టర్ ఆకాంక్షించారు. భక్తుల కోసం 460 బస్సులను అందుబాటులో ఉంచినట్లు తెలిపారు.