Share News

సిద్ధాపురాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేస్తాం

ABN , Publish Date - Feb 04 , 2026 | 12:40 AM

ఉమ్మడి కర్నూలు జిల్లాలోనే అతిపెద్ద చెరువుగా పేరుగాంచిన సిద్దాపురం లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్ట్‌ను పర్యాటకంగా అభివృద్ధి చేస్తామని నంద్యాల కలెక్టర్‌ రాజకుమారి అన్నారు.

సిద్ధాపురాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేస్తాం
పనుల ప్రణాళికను పరిశీలిస్తున్న కలెక్టర్‌, ఎమ్మెల్యే

కలెక్టర్‌ రాజకుమారి

ఆత్మకూరు/ఆత్మకూరు రూరల్‌, ఫిబ్రవరి 3(ఆంధ్రజ్యోతి): ఉమ్మడి కర్నూలు జిల్లాలోనే అతిపెద్ద చెరువుగా పేరుగాంచిన సిద్దాపురం లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్ట్‌ను పర్యాటకంగా అభివృద్ధి చేస్తామని నంద్యాల కలెక్టర్‌ రాజకుమారి అన్నారు. మంగళవారం శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డితో కలసి కలెక్టర్‌ సిద్ధాపురం ప్రాజెక్టును పరిశీలించారు. ముందుగా దివంగత నేతలు ఎన్టీఆర్‌, బుడ్డా వెంగళరెడ్డి జ్ఞాపకార్థంగా వారి విగ్రహాలను ఏర్పాటు చేయనున్న ప్రదేశాన్ని పరిశీలించారు. ఆ తర్వాత చెరువు కట్టపై ప్రయాణించిన కుడి, ఎడమ ప్రధాన కాల్వలు, డెలివరీ పాయింట్‌ స్థితిగతులను స్వయంగా వీక్షించారు. అక్కడి నుంచి అటవీమార్గంలో స్టేజ్‌-2 పంప్‌హౌస్‌ మీదుగా స్టేజ్‌-1 పంప్‌హౌస్‌ వద్దకు చేరుకుని అక్కడున్న వెలుగోడు బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌ అప్రోచ్‌ కెనాల్‌ను, ఎత్తిపోతల ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ రాజకుమారి మాట్లాడుతూ.. సీఎం చంద్రబాబు పిలుపునిచ్చిన మన నీరు.. మన భవిష్యత్‌ కార్యక్రమంలో భాగంగా సిద్దాపురం ఎత్తిపోతల పథకాన్ని అభివృద్ధి చేసేందుకు అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ప్రాజెక్ట్‌ పూర్తి ఆయకట్టు సుమారు 23వేల ఎకరాలు ఉండగా అందులో కేవలం 10వేల ఎకరాల వరకు మాత్రమే సాగునీరు అందుతుండటంతో పూర్తి ఆయకట్టుకు నీరందించేలా రూ.88.46కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేసి పనులను కూడా చేపట్టినట్లు వివరించారు. ఇవేకాకుండా తెలుగుగంగ లైనింగ్‌ పనుల కోసం రూ.21.6 కోట్లను ఖర్చు చేయనున్నట్లు తెలిపారు. శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా మాట్లాడుతూ.. 2018 జనవరి 7వ తేదిన సీఎం చంద్రబాబు చొరవతో సిద్దాపురం ఎత్తిపోతల పథకానికి రైతులకు అంకితం చేయడం జరిగిందని అన్నారు. ఆ సమయంలోనే ప్రస్తుతం ఉన్న 23వేల ఎకరాల ఆయకట్టుతో పాటు అదనంగా ఇందిరేశ్వరం, శ్రీపతిరావుపేట, వెంకటాపురం, అమలాపురం, కృష్ణాపురం గ్రామాల పరిధిలో 5వేల ఎకరాల ఆయకట్టును పెంచేందుకు ఆమోదం లభించినట్లు తెలిపారు. అయితే 2019లో వైసీపీ అధికారంలోకి రావడంతో సిద్దాపురం పథకాన్ని సర్వనాశనం చేసిందని ఆరోపించారు. మెయిన్‌ కెనాల్స్‌తో పాటు బ్రాంచ్‌, ఫీల్డ్‌ కెనాల్స్‌ను నిర్మించి పూర్తి ఆయకట్టుకు నీరందించనున్నట్లు తెలిపారు. త్వరలోనే పనులకు టెండర్లను పిలిచి 2027 చివరిలోగా పనులను పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఆత్మకూరు ఆర్డీవో నాగజ్యోతి, తహసీల్దార్‌ రత్నరాధిక, డిప్యూటీ తహసీల్దార్‌ ఆంజనేయులు, టీడీపీ నాయకులు యుగంధర్‌రెడ్డి, వేణుగోపాల్‌, రవీంద్రబాబు, శివప్రసాద్‌రెడ్డి, షాబుద్దిన్‌, అబ్దుల్లాపురం బాషా, నజీర్‌అహ్మద్‌, కమతం శంకర్‌, శివశంకరచౌదరి, సురేష్‌, ఉల్లిమధు, నరసింహారెడ్డి, కృష్ణారెడ్డి తదితరులు ఉన్నారు.

Updated Date - Feb 04 , 2026 | 12:40 AM