Share News

శివ నామస్మరణతో మార్మోగిన దేవరగట్టు

ABN , Publish Date - Oct 25 , 2026 | 12:00 AM

రాష్ట్రంలో ప్రసిద్ధ చెందిన దేవరగట్టు శివనామస్మరణతో మార్మోగింది.

శివ నామస్మరణతో మార్మోగిన దేవరగట్టు
గొరవయ్య ప్రదర్శనను తిలకిస్తున్న భక్తులు

ఆకట్టుకున్న గొరవయ్యల నృత్యం

3వ ప్రయత్నంలో తెగిన ఇనుప గొలుసు

భారీగా దేవరగట్టుకు తరలివచ్చిన భక్తులు

నేటితో ముగియనున్న బన్ని ఉత్సవాలు

హొళగుంద, అక్టోబరు 24(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ప్రసిద్ధ చెందిన దేవరగట్టు శివనామస్మరణతో మార్మోగింది. మాళ మల్లేశ్వరస్వామి దసరా బన్ని ఉత్సవాల్లో భాగంగా శనివారం దేవరగట్టులో జరిగిన గొరవయ్యల నృత్య ప్రదర్శన భక్తుల కోలాహలం మధ్య కమనీయంగా సాగింది. అనంతరం వేదపండితులు నిర్ణయించిన సమయంలో సింహాసన కట్ట వద్ద బల్లూరుకు చెందిన రాఘవేంద్రస్వామి ఆధ్వర్యంలో మాళ మల్లేశ్వరస్వామి ఉత్సవమూర్తులకు ప్రత్యేక పూజలు చేశారు. గొరవయ్యల నృత్యం, డమరుకం నడుమ గొలుసు తెంపుట మహోత్సవంలో బల్లూరుకు చెందిన గొరవయ్య గాదిలింగస్వామి ఇనుప గొలుసును 3వ ప్రయత్నంలో తెంపి అందరి చూపును ఆకట్టుకున్నాడు. గొలుసు తెంపుట, గొరవయ్యలు భైరవుని రూపంలో పంచామృతం సేవించడం, నృత్య ప్రదర్శన కార్యక్రమాలను వీక్షించేందుకు ఆంధ్ర, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు రాష్ట్రాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. సాయంత్రం దేవదాసీల నృత్యాలు కూడా ఆకర్షణీయంగా సాగాయి. వసంతోత్సవంలో గొరవయ్యలు భక్తులపై రంగులు చల్లి ఘనంగా కంకణ విసర్జన గావించారు. అనంతరం ఉత్సవమూర్తులు గిరిపై చేరుకున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఆలూరు సీఐ రవిశంకర్‌రెడ్డి ఆధ్వర్యంలో ఎస్‌ఐ దిలీప్‌కుమార్‌ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆదివారం బన్ని ఉత్సవాలు ముగియనున్నాయి.

Updated Date - Oct 25 , 2026 | 12:00 AM