Share News

నెత్తురోడిన దేవరగట్టు

ABN , Publish Date - Oct 22 , 2026 | 11:18 PM

సంప్రదాయం.. ఆచారం.. భక్తి.. వీటన్నింటి మధ్య దేవరగట్టు బన్ని ఉత్సవం రక్తసిక్తమైంది.

నెత్తురోడిన దేవరగట్టు
దేవరగట్టులో కర్రల సమరం

రక్తసిక్తమైన కర్రల సమరం

తొక్కిసలాటలో ఆలూరుకు చెందిన వ్యక్తి మృతి

100 మందికి పైగా భక్తులకు గాయాలు

ప్రేక్షకులుగా పోలీసులు

ఆలూరు/హొళగుంద, అక్టోబరు 22 (ఆంధ్రజ్యోతి): సంప్రదాయం.. ఆచారం.. భక్తి.. వీటన్నింటి మధ్య దేవరగట్టు బన్ని ఉత్సవం రక్తసిక్తమైంది. కర్నూలు జిల్లా హొళగుంద మండలంలోని దేవరగట్టు మాళ మల్లేశ్వరస్వామి ఆలయం వద్ద బుధవారం అర్ధరాత్రి నుంచి గురువారం ఉదయం వరకు జరిగిన బన్ని ఉత్సవంలో కర్రల సమరం హోరాహోరీగా సాగింది. జైత్రయాత్ర సమయంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో రాళ్లు రువ్వుకోవడం, అగ్గి కాగడాలు విసురుకోవడం వంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. ఈ క్రమంలో జరిగిన తొక్కిసలాటలో ఆలూరుకు చెందిన పోతురాజు(35) మృతిచెందగా, వంద మందికి పైగా భక్తులు గాయపడినట్లు సమాచారం. దీంతో ఉత్సవ ప్రాంగణంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

కర్రల సమరంలో ఉద్రిక్తత

బుధవారం అర్ధరాత్రి 1.30 గంటలకు ప్రారంభమైన బన్ని ఉత్సవంలో అరికెర, నెరణికి, నెరణికి తండా, బిలేహాల్‌ గ్రామాలకు చెందిన భక్తులు వేర్వేరు బృందాలుగా కర్రల సమరంలో పాల్గొన్నారు. జైత్రయాత్రలో భాగంగా దేవతామూర్తులను గ్రామాలకు తీసుకెళ్లే క్రమంలో కొన్ని బృందాల మధ్య ఉద్రిక్తత చోటు చేసుకున్నాయి. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. లక్షలాదిగా తరలివచ్చిన భక్తులు దేవరగట్టు బన్ని ఉత్సవాన్ని తిలకించేందుకు ఆంధ్రప్రదేశ్‌తో పాటు కర్ణాటక, మహారాష్ట్ర నుంచి భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. దీంతో దేవరగట్టు పరిసర ప్రాంతాలన్నీ భక్తులతో కిక్కిరిసిపోయాయి. అర్ధరాత్రి ప్రారంభమైన ఉత్సవం, స్వామివారి కల్యాణోత్సవం జరిగింది. జైత్రయాత్ర గురువారం ఉదయం 7 గంటల వరకు కొనసాగింది.

బందోబస్తు ఉన్నా.. తప్పని ప్రమాదాలు

బన్ని ఉత్సవంలో అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు సుమారు వెయ్యి మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పా టు చేశారు. ఎస్పీ విక్రాంత్‌ పాటిల్‌తో పాటు పో లీసు ఉన్నతాధికారులు భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించారు. అయినప్పటికీ ఘర్షణలను నివారించలేకపోయారు. తొక్కిసలాటలో ఒకరు మృతిచెందారు. వంద మందికి పైగా గాయపడినట్లు సమాచారం. దీంతో భద్రతా ఏర్పాట్లపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

సంప్రదాయం మాటున

భక్తి విశ్వాసాలతో నిర్వహించే ఉత్సవం విషాదంగా మారకుండా ఉండాలంటే రానున్న రోజుల్లో జనసందోహ నియంత్రణ, అత్యవసర వైద్య సేవలు, ఘర్షణల నివారణపై మరింత పటిష్టమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ వేడుకల్లో ఆదోని, పత్తికొండ ఆర్డీవోలు అరుణాదేవి, ఓబులేసు, ఏఎస్పీ జయశర్మ, డీఎస్పీ వంశీధర్‌ గౌడ్‌, ఆలూరు సీఐ రవిశంకర్‌రెడ్డి, ఎస్‌ఐ దిలీప్‌కుమార్‌, దేవరగట్టు ఆలయ చైర్మన్‌ వీరనాగప్ప పాల్గొన్నారు.

Updated Date - Oct 22 , 2026 | 11:18 PM