బాక్సుల్లో భవితవ్యం
ABN , Publish Date - Nov 02 , 2026 | 12:28 AM
పట్టణ పాలకులను ఎన్నుకునేందుకు ఓటర్లు తీర్పు ఇచ్చారు.
గూడూరులో ఓటెత్తారు.. 83.73 శాతం నమోదు
అత్యల్పంగా ఆదోనిలో 53.59శాతం పోలింగ్
చిన్నపాటి ఘర్షణలు.. ఇరు పార్టీల కార్యకర్తల వాగ్వాదం
గెలుపుపై అభ్యర్థుల్లో మొదలైన ఉత్కంఠ
స్ర్టాంగ్ రూములకు చేరిన బ్యాలెట్ బాక్సులు
జిల్లా వ్యాప్తంగా పోలింగ్ ప్రశాంతం
ఊపిరి పీల్చుకున్న అధికారులు
పట్టణ పాలకులను ఎన్నుకునేందుకు ఓటర్లు తీర్పు ఇచ్చారు. ఓటర్ల తీర్పు బ్యాలెట్ బాక్సుల్లో నిక్షిప్తమైంది. అభ్యర్థుల భవితవ్యం తేలేందుకు కౌంట్‌డౌన్ మొదలైంది. గెలుపుపై ఎవరి అంచనాలు వారివి. పోలింగ్ ముగిసిన కొద్దిసేపటికే రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ మొదలైంది. జిల్లాలో కర్నూలు నగరపాలక సంస్థ, ఆదోని, ఎమ్మిగనూరు మున్సిపాలిటీలు, గూడూరు నగర పంచాయతీలో ఆదివారం పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. కర్నూలు నగరం, కల్లూరు అర్బన్ వార్డుల్లో పలు చోట్ల చిన్నపాటి ఘర్షణలు మినహా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోలేదు. పోలింగ్ ప్రశాంతంగా ముగియడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.
కర్నూలు, నవంబరు 1 (ఆంధ్రజ్యోతి): మున్సిపల్ ఎన్నికల్లో అభ్యర్థుల భవితవ్యం ప్రస్తుతం బ్యాలెట్ బాక్సుల్లో నిక్షిప్తమైంది. ఆదివారం జిల్లాలోని కర్నూలు నగరపాలక సంస్థ, ఆదోని, ఎమ్మిగనూరు మున్సిపాలిటీలు, గూడూరు నగర పంచాయతీల్లో పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. కర్నూలు నగరం, కల్లూరు అర్బన్ వార్డుల్లో చిన్నపాటి ఘర్షణలు జరిగాయి. మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి వర్గీయులు 45వ వార్డు టీడీపీ అభ్యర్థి బంధువులపై దాడికి యత్నించడం చర్చగా మారింది. మేయర్ అభ్యర్థి లేకుండానే స్వతంత్ర అభ్యర్థి పేరిట ఉన్న వాహనాల్లో మాజీ ఎమ్మెల్యేలు కాటసాని, ఎస్వీ మోహన్‌రెడ్డి తిరుగుతుండడంపై టీడీపీ కార్యకర్తలు వర్గీయులు అభ్యంతరం వ్యక్తం చేయడంతో పోలీసులు అడ్డుకున్నారు. జిల్లాలో 7,59,141 మంది ఓటర్లు ఉంటే.. 4,25,196 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. సగటున 55.28 శాతం పోలింగ్ నమోదైంది. కర్నూలు, ఆదోని పలు వార్డుల్లో రాత్రి ఏడు గంటల వరకు ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకున్నారు. పోలింగ్ ప్రశాంతంగా ముగియడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. గెలుపుపై అభ్యర్థుల్లో ఉత్కంఠ మొదలైంది. బ్యాలెట్ బాక్సులను స్ర్టాంగ్ రూంలకు తరలించారు.
వేగంగా మొదలైనా..
కర్నూలు నగరపాలక సంస్థ మేయర్, 68 మంది కార్పొరేటర్లు.. ఆదోని మున్సిపల్ చైర్‌పర్సన్, 52 వార్డుల కౌన్సిలర్లు, ఎమ్మిగనూరు మున్సిపాలిటీ చైర్‌పర్సన్, 44 వార్డుల కౌన్సిలర్లు, గూడూరు నగర పంచాయతీ చైర్‌పర్సన్ సహా 23వార్డుల కౌన్సిలర్ల ఎన్నిక కోసం పోలింగ్ నిర్వహిచారు. జిల్లాలో నాలుగు పట్టణ స్థానిక సంస్థల్లో 7,59,141 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకో వడానికి 780 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటుచేశారు. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఏ.సిరి పర్యవేక్షణలో ఉదయం 7గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. ఆయా పట్టణాల్లో ఉదయం పోలింగ్ వేగంగా మొదలైనా.. ఎన్‌నినో ప్రభావంతో ఎండలకు మధ్యాహ్నం పోలింగ్ మందగించింది. పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు రాకపో వడంతో వెలవెలబోయాయి. సాయంత్రం మూడు గంటలు తరు వాత మళ్లీ స్వల్పంగా పుంజుకున్నా ఆశించిన స్థాయిలో పోలింగ్ నమోదు కాలేదు.
గంట గంటకూ..
జిల్లాలో నాలుగు పట్టణ స్థానిక సంస్థల్లో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు గంట గంటకూ ఉత్కంఠంగా పోలింగ్ కొనసాగింది. సాయంత్రం 5 గంటలకు జిల్లాలో సగటున 4,25,186 మంది ఓటేశారు. 55.28 శాతం ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. పలువార్డుల్లో రాత్రి 7 గంటల వరకు పోలింగ్ కొనసాగింది.
కర్నూలులో 68 వార్డులు, 487 పోలింగ్ కేంద్రాలు. 4,79,861 ఓటర్లకు గాను సాయంత్రం 5 గంటలకు 2,48,749 మంది (51.84 శాతం) ఓటేశారు. పలువార్డుల్లో రాత్రి ఏడు గంటల వరకు పోలింగ్ కొనసాగింది. పోలింగ్ ముగిసే సమయానికి 53.77 శాతం అంటే 2,58,035 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు.
ఆదోని మున్సిపాలిటీలో 52 వార్డులు, 179 పోలింగ్ కేంద్రాలు. 1,76,676 మంది ఓటర్లు ఉంటే, సాయంత్రం 5గంటకు 57,365మంది (42.28 శాతం) ఓటు హక్కు వినియోగిం చుకున్నారు. కొన్ని వార్డుల్లో రాత్రి 7గంటల వరకు ఓటేశారు. పోలింగ్ ముగిసే సమయానికి 53.59 శాతం అంటే 94,687 మంది ఓటర్లు ఓటు వేశారు.
ఎమ్మిగనూరు మున్సిపాలిటీలో 44 వార్డుల్లో 81 పోలింగ్ కేంద్రాలు. 84,939 మంది ఓటర్లు ఉంటే పోలింగ్ ముగిసే సమయానికి 57,673 మంది (67.90 శాతం) ఓటేశారు.
గూడూరు నగర పంచాయతీలో 23 వార్డులకు 23 పోలింగ్ కేంద్రాలు. పోలింగ్ ముగిసే సమయానికి 17,665 మంది ఓటర్లకు గాను 14,971 మంది ఓటర్లు (83.73 శాతం) ఓటేశారు. జిల్లాలో అత్యధికంగా పోలింగ్ నమోదు కావడం విశేషం.
నాలుగు పట్టణ స్థానిక సంస్థల్లో పోలైన ఓటర్ల వివరాలు
నగరం/పట్టణం వార్డులు మొత్తం ఓట్లు పోలైన ఓట్లు శాతం
కర్నూలు 68 4,79,861 2,58,035 53.77
ఆదోని 52 1,76,676 94,697 53.60
ఎమ్మిగనూరు 44 84,939 57,673 67.90
గూడూరు 23 17,665 14,791 83.73
మొత్తం 187 7,69,141 4,25,196 56.01