Share News

డెంగీ పంజా

ABN , Publish Date - Aug 16 , 2026 | 11:55 PM

కోసిగి మేజర్‌ పంచాయతీ పరిధిలోని 4వ వార్డులో డెంగీ పంజా విసిరింది. కింద మారెమ్మ దేవలయం వెనకాల ఉన్న కాలనీలో పక్కపక్క ఇళ్లలోనే ఐదుగురు చిన్నారులు ఆసుపత్రి పాలయ్యారు.

డెంగీ పంజా
కాలనీలో తూతూ మంత్రంగా బ్లీచింగ్‌ పౌడర్‌

కోసిగి 4వ వార్డులో ఐదుగురు చిన్నారులకు పాజిటివ్‌

నెల రోజులుగా తీవ్ర జ్వరాలు... ఆదోని ప్రైవేట్‌ ఆసుపత్రిలో చికిత్స

కన్నెత్తి చూడని వైద్య సిబ్బంది, ఆశా వర్కర్లు

కోసిగి, ఆగస్టు 16 (ఆంధ్రజ్యోతి): కోసిగి మేజర్‌ పంచాయతీ పరిధిలోని 4వ వార్డులో డెంగీ పంజా విసిరింది. కింద మారెమ్మ దేవలయం వెనకాల ఉన్న కాలనీలో పక్కపక్క ఇళ్లలోనే ఐదుగురు చిన్నారులు ఆసుపత్రి పాలయ్యారు. పంచాయతీ అధికారుల పారిశుధ్య నిర్లక్ష్యం, ప్రభుత్వ వైద్యాధికారులు నిమ్మకు నీరెత్తిన వైఖరి వల్లే తమ పిల్లలు ప్రాణాపాయ స్థితిలోకి వెళ్లారని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాలనీకి చెందిన అవినాష్‌(3), తన్విక(1), కావ్య(5), పూజ(9), అంకిత(5) అనే ఐదుగురు చిన్నారులు నెల రోజులుగా డెంగీతో ఇబ్బందిపడుతున్నారు. వీరికి రక్త పరీక్షల్లో డెంగీ పాజిటివ్‌ అని తేలడంతో తల్లిదండ్రులు వారిని ఆదోనిలోని ప్రైవేట్‌ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కాలనీలో మురుగునీరు నిలిచిపోయి దోమలు స్వైర్యవిహారం చేస్తున్నా పంచాయతీ కార్యదర్శి, సిబ్బంది పట్టించుకోవడంలేదని స్థానికులు మండిపడుతున్నారు. అరకొరగా బ్లీచింగ్‌ చల్లి చేతులు దులుపుకున్నారే తప్ప దోమల నివారణకు ఎలాంటి ఫాగింగ్‌ గానీ, మురుగు కాలువల శుభ్రత గానీ చేపట్టలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - Aug 16 , 2026 | 11:55 PM